దంపతీ దక్షిణామూర్తి

17 Feb, 2019 00:36 IST|Sakshi

కథా శిల్పం

దక్షిణామూర్తి జ్ఞానమూర్తి. విద్యను అర్థించే ఎవరైనా దక్షిణామూర్తిని ప్రార్థించాల్సిందే. మర్రిచెట్టు నీడలో తన చేతిముద్రలతో మహర్షుల మౌనాన్ని తీర్చిన బాలుడు ఈయన. దక్షిణం వైపు తిరిగి కూర్చుంటాడు కనుక ఇతడిని దక్షిణామూర్తి అంటారు. సాధారణంగా దక్షిణామూర్తి అంటే 8 సంవత్సరాల బాలుడని అందరి భావన. ఆయన చుట్టూ మహర్షులు కొలువుతీరి ఉంటారు. ఆయన వారికి మౌనంతో, చిన్ముద్రతో జ్ఞానాన్ని ఉపదేశించి వారి అజ్ఞానాన్ని తొలగిస్తాడు. చిత్తూరు జిల్లా సురుటుపల్లి పల్లికొండేశ్వర ఆలయంలో అరుదైన దక్షిణామూర్తి రూపం ఒకటి ఉంది. ఈ స్వామికి పక్కనే అమ్మవారు కూడా దర్శనమిస్తుంది. ఇదే ఇక్కడి విశేషం. ఇక్కడి వారంతా ఆయనను దంపతీ దక్షిణామూర్తి అంటారు.

ఇటువంటి అరుదైన విగ్రహం తమిళనాడులోని ఊతుకోట అనే ఊరిలో మరొకటుంది. ప్రపంచంలో అమ్మ వారితో కలిసి ఉన్న దక్షిణామూర్తి విగ్రహాలు ఇవి రెండే. ఈ స్వామి రూపాన్ని దర్శిస్తే ...ఆసీనస్థితిలో ఉండి కుడికాలును కిందకు జారవిడిచి, ఎడమకాలును పైకి మడిచి, కుడిచేత చిన్ముద్రను, ఎడమచేతిని ఎడమమోకాలిపై జారవిడిచి, పరహస్తాలలో కుడివైపు గొడ్డలిని, ఎడమవైపు జింకను పట్టుకుని ఉంటాడు. దక్షిణామూర్తి కుడివైపు అమ్మవారు ఆయనను ఆరాధనాభావంతో చూస్తూ ఉంటుంది. స్వామివారి కుడికాలి కింద అపస్మారుడుంటాడు. ఈ స్వామిని దర్శిస్తే మనలోని చక్కటివిద్య లభిస్తుంది. విద్యాపరమైన మందమతి వంటి దోషాలు తొలగి విజయం సాధిస్తారు.
– డాక్టర్‌ ఛాయా కామాక్షీదేవి 

మరిన్ని వార్తలు