అనుకోని ఆదాయంతో అత్యవసర నిధి...

4 Jul, 2014 23:02 IST|Sakshi
అనుకోని ఆదాయంతో అత్యవసర నిధి...

అనుకోకుండా బోనస్‌ల రూపంలోనో, గిఫ్టుల్లాగానో లేదా వారసత్వంగా ఆస్తిపాస్తులో వచ్చి పడితే? ఊహించుకోవడానికి బాగానే ఉన్నా, నిజంగానే  వచ్చి పడితే ఆ డబ్బును ఏ విధంగా ఉపయోగిస్తాం అన్నది ముఖ్యం. సాధారణంగానైతే ఊహించని విధంగా వచ్చింది కాబట్టి అదనపు ఆదాయం కింద లెక్కేసుకుని అడ్డదిడ్డంగా అనవసరమైన వాటన్నింటిపైనా ఖర్చు చేసేస్తుంటాం. అలా కాకుండా కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే ఆ డబ్బును సద్వినియోగం చేసుకునేందుకు పలు మార్గాలు ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్ని ఇవి..
 
ఎమర్జెన్సీ ఫండ్‌కు కొంత మొత్తం


అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కోసం అటూ, ఇటూ పరుగెత్తాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక ఫండ్ అంటూ ఉండటం చాలా ముఖ్యం. ఇప్పటిదాకా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే .. కొత్తగా చేతికొచ్చిన అదనపు సొమ్మును ఇందుకోసం ఉపయోగించవచ్చు. ఈ నిధి పరిమాణం ఎంత ఉండొచ్చనేది మీ వయసు, ఆర్థిక పరిస్థితులు, మీ కుటుంబసభ్యుల సంఖ్య తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది.

ఒకవేళ మీపై ఆధారపడిన వారెవరూ లేకుండా.. మీరు సింగిల్ అయిన పక్షంలో కనీసం మూడు నెలల ఖర్చులకు సరిపడా డబ్బును ఈ అత్యవసర నిధిలో ఉంచుకోవాలి. అదే, కుటుంబం.. ఇతర బాధ్యతలు ఉన్న పక్షంలో ఇది 6 నెలలకు పెరుగుతుంది. ఇక రిటైర్మెం ట్‌కి దగ్గరవుతున్నా లేదా రిటైరయిపోయినా.. కనీసం రెండేళ్లకు సరిపడా ఖర్చులైనా ఫండ్‌లో ఉండాలి.
 
అప్పులు తీర్చేయొచ్చు

పరిమితికి మించి అప్పుల భారం ఎక్కువగా ఉండటం ఆర్థిక పరిస్థితికి ఎప్పుడూ ముప్పే. అది కూడా వ్యక్తిగత రుణాలపై ఎక్కువ వడ్డీ రేటు చెల్లించాల్సి వస్తుంటే మరింత కష్టం. కనుక, అనుకోకుండా వచ్చిన డబ్బుతో సాధ్యమైనంత మేర అప్పులను తీర్చేసి, భారాన్ని తగ్గించుకోవచ్చు.
 
ఇన్వెస్ట్‌మెంట్
 
అత్యవసర నిధి, కొంతైనా అప్పులు తీర్చివేయడం.. ఇవన్నీ చూసుకున్నాక ఇంకా కాస్త మిగిలిన పక్షంలో పెట్టుబడులవైపు చూడొచ్చు. స్టాక్‌మార్కెట్లు, షేర్లు వంటి వాటిల్లో ఇప్పటిదాకా ఇన్వెస్ట్ చేయకపోయినట్లయితే ఇకపైనైనా కొద్దో గొప్పో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని పరిశీలించవచ్చు. ఎందుకంటే ఓర్పుగా ఉండగలిగితే దీర్ఘకాలికంగా షేర్లు మంచి రాబడులే ఇస్తుంటాయి. అయితే, స్టాక్‌మార్కెట్ పరిజ్ఞానం లేకుండా నేరుగా షేర్లలో పెట్టడం కన్నా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం మంచిది.

మంచి రాబడులు అందిస్తున్న ఫండ్స్‌ని చూసి కావాలంటే నెలవారీగా కూడా పెట్టుబడి పెట్టొచ్చు. ఇందుకోసం ఫండ్స్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (సిప్) అంటూ ప్రత్యేక పథకాలు అందిస్తున్నాయి కూడా. మీరు ఎంత ఇన్వెస్ట్ చేయగలరు, ఎంత రిస్కు తీసుకోగలరు అన్నదాన్ని బట్టి అత్యంత తక్కువగా రూ. 500- రూ.1,000 నుంచి కూడా వీటిలో ఇన్వెస్ట్ చేయడానికి వీలుంది.
 

మరిన్ని వార్తలు