కత్తుల సిద్ధారెడ్డి

25 Nov, 2019 01:19 IST|Sakshi

నందిని సిధారెడ్డి అసలు పేరు నర్ర సిద్ధారెడ్డి. ‘నర్ర’ కూడా ఆయన పూర్వీకులు బందారంలో స్థిరపడిన తర్వాతే వచ్చింది. ఆయన తాతల తరం వారు ముస్తాబాద్‌ సమీపంలోని బండలింగంపల్లిలో ఉండేవాళ్లట. అక్కడ వారిని ‘కత్తుల’ అనే ఇంటిపేరుతో పిలిచేవారట. ఆయన తాతల కాలంలో బందారంలో స్థిరపడటం వల్ల, బందారంలో వారి బంధువులందరిదీ ‘నర్ర’ కావడం వల్ల, వీరికి కూడా నర్ర ఇంటిపేరుగా మారింది.
ఈయన కాలేజీ రోజుల్లో కవిత్వం రాస్తున్నప్పుడు నర్ర సిద్ధారెడ్డి పేరుతో నలుగురు వ్యక్తులు ఉండేవారు. ఈయన కవిత అచ్చయినప్పుడు మరో నర్ర సిద్ధారెడ్డికి అభినందనలు చెప్పారు. పేరు విషయంలో గందరగోళం ఏర్పడింది. అప్పుడే కవిమిత్రుడు మల్లారెడ్డి ‘గులాబీల’ మల్లారెడ్డిగా పేరు మార్చుకోగా, ఆనందం తన ఇంటిపేరును ‘మల్లెల’గా మార్చుకున్నాడు. నర్ర అంటే ఎద్దు. దానిని నంది అన్నా అర్థంలో తేడా రాదు. అంతేగాక నంది తిమ్మనలా వినూత్నంగా కూడా ఉంటుందని తన పేరులో నంది కలుపుకొని కొన్ని రోజులు కవిత్వం రాశాడు. అయితే సిద్ధిపేట కవి, పండితుడైన ఉమాపతి పద్మనాభశర్మ, నంది అంటే నిండుగా లేదని నందికి ‘ని’ జోడించాడు. దాంతో నందిని సిద్ధారెడ్డి అయ్యాడు.

ఇక, ఆధునిక కవిత్వం అధ్యయనం చేస్తున్నప్పుడు ‘ఫిడేలు రాగాల డజన్‌’ పట్టాభి తన పేరును ‘పఠాభి’ అని చెప్పుకోవటం నచ్చింది. ఆయన ద్విత్వ టకారం తీసేసి మహాప్రాణాక్షరమైన ‘ఠా’ చేర్చుకున్నట్లు, తన పేరులోనూ ద్విత్వ ‘ద’కారం తీసేసి ‘ధా’గా మార్చుకున్నాడు. ఇన్ని మార్పుల తర్వాత నందిని సిధారెడ్డిగా మార్పు చెంది, స్థిరపడిపోయాడు.
(సౌజన్యం: తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి ప్రచురించిన ‘శిఖరం’లోని  డాక్టర్‌ వి.శంకర్‌ వ్యాసం) 

మరిన్ని వార్తలు