భర్త రాసిన ప్రిస్క్రిప్షన్‌

8 Feb, 2019 00:20 IST|Sakshi

ఆనంది భారతదేశపు తొలి వైద్యురాలు.ఆవిడ తెలివైందని.. ఆలోచన గలదనీ..కష్టాన్ని జయించగలదనీ..పందొమ్మిదో శతాబ్దంలోనే అమెరికా వెళ్లిడాక్టర్‌ చదువు చదివేంత ధైర్యం గలదనీ..ఇన్ని.. ఉన్నా..ఆవిడ విజయం.. భర్త రాసిన ప్రిస్క్రిప్షన్‌గానేఉండిపోయింది!ఆ ప్రిస్క్రిప్షన్‌ని కొద్దిగా మారుస్తూ.. ఆనందీ గొప్పతనాన్ని, వారిద్దరి అన్యోన్య దాంపత్యాన్నీచూపించబోతోంది..కొత్త మరాఠీ సినిమా.. ‘ఆనందీ గోపాల్‌’.

భరించువాడు భర్త! మంచి మాటే. పెళ్లయితే భర్తయినట్లేనా?! కలిసుండాలి లైఫ్‌ లాంగ్‌. కనీసం కష్టంలో. ట్యాప్‌లో నీళ్లు రాకపోతే, ‘కాశీకి పోతాను రామా హరి..’అని రాగి చెంబు అందుకుని, వారణాసి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కుతానంటే కుదరదు. ఫోన్‌ చెయ్యాలి. వాటర్‌ ట్యాంక్‌ తెప్పించాలి. అంత లేకపోతే, బిందెల్ని సైకిల్‌కి కట్టుకుని, పోయిరావలె చెరువుకు. జ్వరం వచ్చిందా తనకి. ‘డోలో సిక్స్‌ఫిఫ్టీ వేసుకో’ అని చెప్పి ఆఫీస్‌కి వెళ్లిపోవడం కరెక్టే. ఒకరోజుకి కరెక్ట్, రెండు రోజులకు కరెక్ట్‌. మూడో రోజూకీ తగ్గకుంటే నీ మానాన నువ్వు ఆఫీస్‌కి వెళ్లిపోవడం కరెక్ట్‌ కాదు. డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకో. బండి మీద ఎక్కించుకో. అంతలేకపోతే భుజాన వేసుకుపో. భార్య ఆమె నీకు. నీళ్లు రాకపోవడం, జ్వరం తగ్గకపోవడం జీవితంలో పెద్ద కష్టాలు కాదు. ఇంకా పెద్దవి ఉంటాయి. ఏం ఉంటాయో చెప్పలేం. చెప్పకుండా వచ్చేస్తాయి. అకస్మాత్తు అవసరాలు, అకస్మాత్తు ట్రాన్స్‌ఫర్‌లు.

 అకస్మాత్తుగా.. ఇంకేమైనా. అప్పుడు గట్టిగా నిలబడాలి. గట్టిగా నిలబడలేకపోతే పిల్లాడికి అమ్మ కొంగు ఉంటుంది. కుర్రాడికి నాన్న చెయ్యి ఉంటుంది. డిగ్రీ అయి వీధిలోకి వచ్చినవాడికి ‘రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదరూ’ అని గాత్ర సహకారం అందించే సాటి పట్టభద్రులు ఉంటారు. భర్తకు వీళ్లెవరూ ఉండరు. అతడే పడాలి. పడలేకపోతే, కనీసం బయటైనా పడకుండానైనా ఉండాలి. నువ్వు బయట పడితే.. ఆమె బయటపడి పోతుంది. పడకూడదు. భార్య ఆమె నీకు. భర్తకు అన్నిటికన్న పెద్ద కష్టం.. భార్య మనసులోని కష్టం తెలుసుకోవడం! ఆమె చెప్పదు. నువ్వు బిజీగా ఉంటావు. ప్రపంచంతో పోరాడి ఇంటికి వస్తావు. అప్పుడు చెప్పదు. ఉదయాన్నే మళ్లీ కత్తీ డాలు తీసుకుని, కవచం తొడుక్కుని, హెల్మెట్‌ పెట్టుకుని బయల్దేరతావు. అప్పుడూ చెప్పదు. ఇంకెప్పుడు చెప్పడం? ఎప్పుడూ చెప్పదు. నువ్వే తెలుసుకోవాలి. ఆమె చెప్పకుండా ఆమె చెప్పాలనుకుంటున్నదేమిటో  తెలుసుకోవాలి.

ఆమె నుదురు తాకకుండా నూటా మూడు డిగ్రీలలో సైతం ఆమె తన చిరునవ్వును చెరగనివ్వడం లేదని తెలుసుకోవాలి. భార్య ఆమె నీకు.చెప్పి నీ మనసు పాడు చేయకూడదని భార్యగా ఆమె అనుకుంటున్నప్పుడు, చెప్పకుండా తెలుసుకుని ఆమె మనసును భర్తగా నువ్వు అర్థం చేసుకోవాలి. భర్తంటే భరించేవాడేనా? ‘భరింపబడే’ అగత్యం లేకుండా లోకంతో తలపడడం ఎలాగో భార్యకు నేర్పించేవాడు కూడా. తల ఆన్చడానికి ఇవాళ నీ భుజం ఉంది. రేపు? నీకేదైనా అయితే? అప్పుడూ నువ్వే భరించాలి. అప్పుడూ భర్తవే కదా. ఇన్నాళ్లూ ఇద్దరూ కలిసి బతికిందంతా.. రేపు నువ్వు లేకున్నా కూడా ఆమె ఒకరే బతకడం ఎలాగో నేర్పించడానికే అవ్వాలి. భార్య తెలివిగలది కావచ్చు. మాటకారి కావచ్చు. ఏటీఎంకి వెళ్లి డబ్బులెలా తియ్యాలో ఆమెకు తెలిసుండొచ్చు. ఇంటిపనీ, ఆఫీస్‌ పని సింగిల్‌ హ్యాండెడ్‌గా చక్కబెడుతూ ఉండి ఉండొచ్చు.

అయినా నేర్పించాలి. అయినవాళ్లలోనే ఎవరైనా చివుక్కుమనేలా ఒక మాట అంటే.. ‘నా భర్తే ఉండి ఉంటేనా’ అనే ఆలోచన రాకుండా, గట్టిగా నిలబడేలా భర్తే ఆమెకు మానసిక శక్తిని ఇచ్చిపోవాలి. అదే భర్త బాధ్యత. భర్త ధర్మం.∙∙ ‘‘పద’’ అన్నాడు గోపాల్రావ్‌ జోషి, ఇంట్లోకొచ్చి. అతడు భర్త. మౌనంగా వెనకే బయల్దేరింది యమున. ఆమె భార్య. తొమ్మిదేళ్ల వయసులో యమునకు ఇరవై తొమ్మిదేళ్ల గోపాల్రావ్‌తో పెళ్లయింది. పెళ్లవగానే యమున ‘ఆనంది’ అయింది. భార్యకు భర్త ఇష్టంగా పెట్టుకున్న పేరు ఆనంది. ఆమెకేం ఇష్టాల్లేవు. భర్తపై ఇష్టం, భర్తంటే అయిష్టం కలిగే వయసు కూడా కాదు. పెళ్లైతే అవడానికి అయింది కానీ, ఆమె ఇంకా భార్య కాలేదు. పదేళ్లొచ్చినా, పన్నెండేళ్లొచ్చినా, పదమూడేళ్లొచ్చినా కాలేదు. పద్నాలుగో యేట మాత్రం తల్లి అయింది. తల్లయినా, భార్య కాలేదు! గోపాల్రావ్‌ వచ్చి భార్యతో ‘పద’అన్నది.. ఆమెకు తొమ్మిదీ–పదమూడేళ్ల మధ్య వయసులో. కనీసం ఐదుసార్లు ‘పద’ అని ఉంటాడు.

భర్త పద అనగానే ఇద్దరివీ బట్టలు సర్దేది. గోపాల్రావ్‌ పోస్టల్‌ క్లర్క్‌. పుణెకు కొద్ది దూరంలో కల్యాణ్‌లో హెడ్డాఫీస్‌. పుణె, కల్యాణ్, కొల్హాపూర్, అలీభాగ్, కచ్, సెరంపూర్‌.. ఎక్కడికి ట్రాన్స్‌ఫర్‌ అయితే అక్కడికి భర్త ‘పద’ అనేవాడు. ఆనంది చెప్పులైనా చప్పుడు కాకుండా ఫాలో అయ్యేది.ఆనంది పుట్టింది పుణెలో. పెరిగింది, పెళ్లి జరిగిందీ కల్యాణ్‌లో.  భూస్వామి కుటుంబం. కుటుంబంలోని పూర్వపు పెద్దల తెలివితక్కువతనంతో భూములు పోయి, ఫ్యామిలీ అప్పుల పాలైంది. ‘పిల్లకు పెళ్లి చేసేయండి’ అన్నారు బంధువులు. ‘ఇంకా తొమ్మిదేళ్లే కదా’అంటే, ‘మీకింకా తెలివి రాలేదా?’ అన్నారు. వాళ్లే గోపాల్రావ్‌ని వెదికి తెచ్చారు. గోపాల్రావ్‌ ప్రొగ్రెసివ్‌.‘‘బదిలీ అయిన ప్రతిచోటికీ పిల్లను తీసుకెళతావెందుకు?’’ అని ఆ ఇంట్లోవాళ్లు, ఈ ఇంట్లో వాళ్లు అన్నప్పుడు.. గోపాల్రావ్‌ అన్నమాట ఆనందికి బాగా గుర్తుండిపోయింది. ‘‘నా భార్య చదువుకుంది.

చదువుకున్న పిల్లకు ఇల్లే ప్రపంచం కాకూడదు. ప్రపంచం నడవడానికి తనూ ఒక కారణం అవాలి. ఒకవేళ ఆనందికి చదువులేకపోయినా నేను ఇంట్లో ఉంచేవాడిని కాదు. చదివించుకునేవాడిని’’ అన్నాడు. అంతా బుగ్గలు నొక్కుకున్నారు.1880ల చివరి కాలమది. అప్పటికి ఆనందికి పద్దెనిమిదేళ్లు. ఈసారి బదిలీ అయింది పెద్ద ఊరికి. కలకత్తా. ‘‘కలకత్తాలో పిల్ల ఒక్కతే ఎలా ఉంటుంది!’’ అన్నారు. ‘‘కలకత్తాలోనూ మనుషులే ఉంటారు’’ అన్నాడు గోపాల్రావ్‌. గుడిపాటి వెంకటాచలం కన్నా యాభై ఏళ్ల ముందే.. ‘స్త్రీకి మెదడు ఉంది. దానికి జ్ఞానం ఇవ్వాలి. స్త్రీకి హృదయం ఉంది. దానికి అనుభవం ఇవ్వాలి. స్త్రీకి శరీరం ఉంది. దానికి వ్యాయామం ఇవ్వాలి’ అని  వాదించిన మొండివాడు గోపాల్రావ్‌. పద్నాలుగో ఏట పుట్టిన బిడ్డ పదిరోజులకే చనిపోయి ఆనంది ఎడతెరిపి లేకుండా ఏడుస్తున్నప్పుడూ అతడు ఓదార్చిన విధానం మొండిగానే ఉంది.

 ‘‘ఏడ్వకు. ఏడిస్తే పోయిన బిడ్డ వస్తాడా. నీ బిడ్డ ఒక్కడే కాదు. పుణె చుట్టుపక్కల చాలామంది బిడ్డలు చనిపోతున్నారు. బతికించే వైద్యం లేదు. ఉండి ఉంటే నీ బిడ్డ బతక్కపోయేవాడా’’ అన్నాడు. ‘నీ బిడ్డ’ అనడం ఆనందిని నొప్పించింది. బిడ్డ చనిపోతే తల్లికేనా బాధ! తండ్రికి ఏమీ ఉండదా? ‘నీ బిడ్డ’ అన్న మాటకు భార్య బాధపడిందని గోపాల్రావ్‌ గ్రహించాడు. తనూ కూర్చొని ఏడిస్తే ఏం భర్త?! ‘‘ఆనందీ.. నువ్వు మెడిసిన్‌ చదవాలి’’ అన్నాడు. ఆశ్చర్యంగా చూసింది. ‘‘అవును. మన బిడ్డలా సరైన వైద్యం లేక ఎవరూ చనిపోకూడదు. నువ్వు డాక్టర్‌వి కావాలి’’ అన్నాడు. ఆనంది ముఖం వెలిగిపోయింది. ‘నువ్వు డాక్టర్‌వి కావాలి’ అన్నందుకు కాదు. అతడు ‘మన బిడ్డ’ అన్నందుకు. ∙∙ ‘‘పద’’ అన్నాడు గోపాల్రావ్‌ వచ్చి. ఈసారి యు.ఎస్‌కి! పెన్సిల్వేనియాలోని ‘ఉమెన్స్‌ మెడికల్‌ కాలేజ్‌’లో భార్యకు సీటు సంపాదించుకొచ్చాడు అతడు! మళ్లీ అంతా ‘హవ్వ’ అని బుగ్గలు నొక్కుకున్నారు.

కిరస్తానీలుండే దేశానికి పెళ్లాన్ని తీసుకెళ్తున్నాడా?! తీసుకెళ్తున్నాడా ఏంటీ.. తీసుకెళ్లాడు గోపాల్రావ్‌. ఆనంది మెడిసిన్‌ పూర్తి చేసింది. అప్పటికి ఆమెకు ఇరవై ఏళ్లు. యు.ఎస్‌.లో వాతావరణం పడక దగ్గుతూ ఉండేది. మెడిసిన్‌ అయ్యాక ఆ దగ్గుతోనే ఇండియా వచ్చింది. కొల్హాపూర్‌ ‘ఆల్బర్ట్‌ ఎడ్వర్డ్‌ హాస్పిటల్‌’లో డాక్టర్‌గా ఉద్యోగం. దేశంలోనే మొదటి మహిళా డాక్టర్‌!! క్రమంగా దగ్గుకు ఆమె దగ్గరైంది. డాక్టర్‌ అయిన ఏడాదికే క్షయ వ్యాధితో 21 ఏళ్ల వయసులో చనిపోయింది. ∙∙ పెళ్లయినా భార్య కాలేకపోయింది ఆనంది. ఓ పిల్లను పెంచినట్లే మురిపెంగా ఆమెను పెంచుకున్నాడు గోపాల్రావ్‌. బిడ్డ పుట్టినా తల్లి కాలేకపోయింది ఆనంది. పదిరోజులు మురిపించి కన్నుమూశాడు ఆ బిడ్డ.

డాక్టర్‌ చదివినా వైద్యం చేయలేకపోయింది ఆనంది. ‘డాక్టరమ్మ’ వచ్చిందనే మురిపెం కూడా దేశానికి తీరకముందే మృత్యువు ఆమెను తీసుకుపోయింది. ఆనంది చనిపోయిన ఫిబ్రవరి 26 కి పదిరోజుల ముందు 15 వ తేదీన.. వచ్చే శుక్రవారం. సినిమా విడుదల అవుతోంది. సమీర్‌ విద్వాంస్‌ దర్శకుడు. ఆనందికి భర్తలో ఒక తండ్రిని, ఒక ప్రేమికుడిని, ఒక స్నేహితుడినీ చూపించాడు విద్వాంస్‌. అన్నిటినీ మించి.. ఒక మంచి భర్తను! ‘వాటా వాటా వాటా గో’ అనే ఒక శ్రావ్యమైన పాటతో విడుదలైన తాజా వీడియోలో మీకు ఆ భర్త కనిపిస్తాడు. పల్లెకు పోదాం.. పారును చూదాం.. చలో చలో.. అని పాటలోని ప్లెజెంట్‌ నెస్‌ అందులో ఉంది.  
మాధవ్‌ శింగరాజు

మరిన్ని వార్తలు