నా చిర్నవ్వే నాకు 'తోడు'

5 Mar, 2018 00:04 IST|Sakshi

చికాకుల్లో చిరునవ్వును తోడు తెచ్చుకుంది. 

కష్టాల్లో పట్టుదలను పనిముట్టుగా చేసుకుంది. 

తన జీవితాన్ని తానే మలచుకుంది. 

స్వావలంబనకు, సాధికారితకు, సెల్ఫ్‌ మేడ్‌ వుమన్‌కు నిర్వచనంగా తానెలా మారారో...

తనను తాను ఎలా మలచుకున్నారో చెబుతున్న ఝాన్సి కథ ఇది. 

ఎందరికో స్ఫూర్తినిచ్చేంత నిజజీవనగాధ ఇది. 

నేనూ అందరమ్మాయిల్లాగానే పదవ తరగతి వరకు హాఫ్‌ లంగా అంచుల పట్టీలు(ఫ్రిల్స్‌) విప్పి రెండు మూడేళ్ళు అదే యూనిఫాం వాడేదాన్ని. మూడు యూనిఫాంస్‌తోనే స్కూలింగ్‌ గడిచిపోయింది. గుంటూరు జమీందారీ కుటుంబమే అయినా అమ్మానాన్నలకి పనుల విషయంలో తేడా లేదు. అన్ని పనులూ ఇద్దరూ చేసేవారు. నాకు తెలిసి నేనెప్పుడూ ఇస్త్రీ లేని యూనిఫాంతో స్కూల్‌కి వెళ్ళలేదు. అమ్మ చీరలు కూడా నాన్నే ఇస్త్రీ చేసేవారు. వంటకూడా యిష్టంగా చేసేవారు. ఇంట్లో వర్క్‌ డివిజన్‌ ఉండేది. నాన్న కాంట్రాక్టర్‌ అయినా మంచి హోమ్‌ మేకర్‌. మగాళ్ళు చాలా అగ్రెసివ్‌గా ఉన్న కాలంలో మా ఇంట్లో జెండర్‌ న్యూట్రాలిటీ ఉండేది. చిన్నప్పట్నుంచీ నాకది రాదు, నేను చేయలేను అని చెప్పడం నాకిష్టం ఉండేది కాదు.

‘‘పెదవులపై చిర్నవ్వులు మోసుకొని కోర్టు మెట్లెక్కాను. దానికి నేను పెట్టిన పేరు ఆపరేషన్‌ స్మైల్‌. ఆ నవ్వు నా కోసం కాదు. నిత్యజీవితంలో ఎన్నో అవమానాలను భరిస్తూ, ఎంతో హింసాయుతమైన జీవితాన్ని అనుభవిస్తూ రోజూ ఛస్తూ బతుకుతోన్న ఎందరో ఆడవాళ్ళకు కోర్టుకెళ్ళడం తప్పేం కాదనే భరోసానిచ్చేందుకు నేనూ మా అమ్మా కోర్టుకెళ్లిన ప్రతిసారీ మరచిపోకుండా ఇంట్లోనుంచి చిర్నవ్వులను మోసుకెళ్ళే వాళ్ళం. కోర్టు చుట్టూ ఎందరో ఆడవాళ్ళు. వాళ్ళందరి గుండెల్లో రేపెలా ఉంటుందోననే గుబులు. కానీ ఎవరికోసమో మనం బతకలేంగా! మన కోసమే మనం బతకాలి. ఇది జీవితం నటన కాదు. అందుకే మనకి నచ్చినట్టు మనం బతకాలి. రోజూ ఎందరో ఆడవాళ్ళ సమస్యలను తెరపైకి తెస్తోన్న ఝాన్సీ నిజజీవితంలో ఇంతలా డీలా పడిపోతే ఇక సాధారణ మహిళలు ఎలా ఉంటారు. మరింతగా కుంగిపోరూ!. అందుకే రోజూ నేను తెరపైన చెప్పే ధైర్యాన్నే ఆచరణలోనూ వారికందివ్వాలనుకున్నాను. పెదవులపై చెరగని చిర్నవ్వుని అభినయించాను’’ కోర్టుకెళ్లడం భారంగా, నామోషీగా ఫీలయ్యేవాళ్లెందరో మన చుట్టూ ఉంటారు. కానీ అది తప్పు. అది చెప్పడానికే నేను ప్రతి వాయిదా ఒక పిక్‌నిక్‌లా భావించాన్నేను. అమ్మానేనూ నచ్చిన పదార్థాలు, బాగా నచ్చిన పుస్తకాలూ ఎప్పటికీ చెదరని సన్నటి చిర్నవ్వులతో కోర్టుమెట్లెక్కేవాళ్ళం.  కోర్టు లోపల కూడా జడ్జిగారి పోడియంకి దగ్గరగా కూర్చునేదాన్ని. 

‘‘ఝాన్సీ...ఝాన్సీ...ఝాన్సీ మూడు సార్లూ... నా పేరే... కోర్టుహాలు బయట నుంచొని బంట్రోతు పిలుస్తున్నాడు గట్టిగా. ఎందుకో గుండె కలుక్కుమంది. ఎంత ధైర్యంగా ఉన్నా. అది కూడా ఒక్క క్షణమే. తమాయించుకొని లోనికెళ్ళా. ఎనిమిదేళ్ళ నా పోరాటానికి విముక్తి లభించింది. నేను డైవోర్స్‌ తీసుకోవడాన్ని చాలా మంది చాలా రకాలుగా భావించారు. గుచ్చి గుచ్చి అడిగారు. మనస్సు నొచ్చుకునే ప్రశ్నలు. మన సర్వస్వాన్నీ నియంత్రించే ప్రశ్నలు. మనస్సుని గాయంచేసే మాటలెన్నో...నా చుట్టూ ఉన్న మనుషులు, నాతోనే ఉన్న స్నేహితులు, చాలా అందంగా సాయం చేస్తామని వచ్చినవారే అందులో చాలా మంది. ఎవ్వరేమన్నా నేను లక్ష్యపెట్టలేదు. ఎందుకంటే జీవితం నాది కనుక. 

మా పెళ్ళి అయినప్పటి నుంచే మా యిద్దరికీ కుదరదని నేననుకున్నాను. అయినా ఒక ఛాన్స్‌ ఇచ్చాను. ట్రై చేసాను. ఆ వ్యక్తితో కలసి జీవించడానికి కావాల్సిన సఖ్యత లేదు. మాది కలిసి నడిచేందుకు అనువైన ప్రయాణం కాదు. కానీ ఆ నిర్ణయం తీసుకోడానికి 11 ఏళ్ళు పట్టింది. ‘‘ఐ హావ్‌ మై ఓన్‌ లైఫ్‌ అండ్‌ విజన్‌’’. పక్కవాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కు అనుగుణంగా మీ జీవితాన్ని మార్చుకోవద్దు. అది మన పిల్లలైనా సరే. ముల్లు గుచ్చుకున్నా నవ్వేయడానికి ఇది నటన కాదని ముందే చెప్పాను. పోతపోసిన పితృస్వామ్య భావజాలంలో ఘనీభవించిన పురుషులెందరో... అదే భావజాలాన్ని మోస్తున్న స్త్రీలు కూడా...నన్ను ఆపే ప్రయత్నం చేసారు. నేనెవరినైతే నమ్ముతానో అందర్నీ సంప్రదించాను.‘‘లెట్‌ మై ఫైట్‌ బి మైన్‌’’.  కానీ నన్ను నేను ప్రొటెక్ట్‌ చేసుకోవడానికి కొన్ని కోల్పోవాల్సి వచ్చింది. నా మిత్రులెవరో, ఎవరు కాదో అనుభవం తేల్చింది. నా ప్రయాణంలో ఇద్దరు మిత్రులు జారిపోయారు. ఇద్దరు మాత్రమే మిగిలారు. ఏ దాపరికం లేకుండా నన్ను నేనుగా స్వచ్ఛంగా పంచుకునే, ఇష్టంగా ప్రకటించుకునే మిత్రులు వీళ్లు. రామలక్ష్మి. శీతల్‌. వరదనీటికి కొట్టుకుపోయిన చెత్తపోగా మిగిలిన సారవంతమైన నేలలాంటి వాళ్ళు వీళ్ళిద్దరూ. ఇక నా చైల్డ్‌ హుడ్‌ ఫ్రెండ్స్‌ ఎప్పుడూ నాతోనే ఉన్నారు. నా ప్రయాణం రెండు దారులుండే సొరంగం కాదు. ఒకే మార్గం గుండా చీకట్లోంచి ప్రారంభమై, గుహఅంచున దాగిన వెలుతురు రేఖలవైపే నా ప్రయాణం.

అమ్మ ఆల్‌ ఇండియా రేడియోలో ప్రొడ్యూసర్‌. వుమన్‌ అండ్‌ చైల్డ్‌ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన కార్యక్రమం కావడంతో అవి వింటూ తెలుసుకునే దాన్ని. చాలా వోకల్‌గా ఉండేదాన్ని. సంగీతం నాకెందుకు రాదని సంగీతంలో జాయిన్‌ అయ్యాను. గట్టిగా అరవడం వస్తే చాలనుకునేదాన్ని. నాకిక పాడ్డం రాదని డిక్లేర్‌ చేసాక వీణ నేర్చుకున్నాను. ఎవరైనా ఏదైనా చేయొచ్చు. సాధన కావాలంతే, అదేమంత కష్టంకాదని నా పట్టుదల. ఎస్‌పి బాలు లాగానో, చిత్ర లాగానో పాడలేకపోవచ్చు. పీటీ ఉష లాగా పరిగెత్తలేకపోవచ్చు. కానీ సాధన ద్వారా ఏదోమేరకు ఏదైనా సాధించొచ్చు. గ్రూప్‌ సింగింగ్‌కి వెళితే లిప్‌సింక్‌ ఇవ్వమనే వాళ్ళు. నువ్వు పాడితే పక్కాళ్ళు పారిపోతారు, పెదాలు కదిలిస్తే చాలనే వాళ్ళు. నాకెప్పుడూ ఓ బ్యాచ్‌ ఉండేది. టెంత్‌ క్లాస్‌ వరకూ నేనెప్పుడూ ఏదో దాంట్లో లీడర్‌గా ఉండే దాన్ని. కాళ్ళు పీకేవి. ఎప్పుడూ లో బీపీ. స్పోర్ట్స్‌కి పనికిరానన్నారు. కానీ వాలీబాల్, డిస్క్, జావలిన్‌ త్రోలో నేషనల్‌ గేమ్స్‌ని రిప్రజెంట్‌ చేశాను. అప్పట్నుంచే గెలవడం ముఖ్యం కాదు పాల్గొనడం ప్రధానం అనే భావం ఏర్పడింది. ప్రయాణం చాలా నేర్పిస్తుంది. గమ్యం మాత్రమే కాదు ప్రయాణం కూడా ప్రధానమే. విజయమే కాదు ఓటమే చాలా నేర్పిస్తుంది అలాగే స్నేహాలు కూడా. 

నా పన్నెండవ ఏట అమ్మ మాక్సీమ్‌ గోర్కీ ‘అమ్మ’ నవల చదవమని యిచ్చింది. ఆల్‌ ఇండియా రేడియో యువవాణిలో సింపోజియం కోసం చదివిన ఆ పుస్తకం నాలో సాహిత్యకాంక్షను రేకెత్తించింది. ఎలెక్స్‌ హెలీ ‘రూట్స్‌’(ఏడుతరాలు) పుస్తకం నాలో సామాజిక స్పృహను వేళ్ళూనుకునేలా చేసింది. ఏది చదవాలి? ఏది చదవకూడదు అని అమ్మెప్పుడూ నిర్దేశించలేదు. కానీ ‘చలం’ పుస్తకం చదువుతున్నప్పుడు మాత్రం నీకింకా ఆ వయస్సు రాలేదని వారించింది. 

ఇక నాకు నంది అవార్డుని తెచ్చిపెట్టిన తొలి పాత్ర నన్నెంతగానో ప్రభావితం చేసింది. ఓల్గాగారు రాసిన ‘తోడు’ కథని అక్కినేని కుటుంబరావుగారి డైరెక్షన్‌లో మధు అంబటి కామెరాతో సినిమాగా తీసారు. జీవితమంతా ప్రతిపనికీ ఆమెపైన ఆధారపడి బతికి, భార్య (చనిపోయి) దూరమయ్యాక కనీసం గుండీలు కూడా కుట్టుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్న భర్త ఒకవైపు, భర్త చని పోయి స్వేచ్ఛాగాలులు పీల్చుకుని, తనకోసం జీవిం చడం మొదలుపెట్టిన స్త్రీ మరోవైపు. ఈ సినిమాలో ఈ యిద్దరి మధ్యా నేను అనుసంధానకర్తను. ఈ కథలో నేను పూర్తిగా ఇమిడిపోయాను. ఈ కథే కాదు. అన్ని పాత్రల్లోనూ లీనమై, ఆ పాత్ర నిజంగా నేనైతే ఎలా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. 

సెంట్రల్‌ వర్సిటీ నుంచి అప్పుడే ఇండస్ట్రీలో కొచ్చిన కొంగ్రొత్త భావజాలం, కొత్త నీరు గీత, అనురాధ, హేమంత్‌ గ్రూప్‌లో పెరగడం, నాకు దొరికిన గురువులు భరణి గారు, నిమ్‌ గారు, శ్యాంబెనగళ్‌ డైరెక్షన్‌లో గోపీచంద్‌గారి అబ్బాయి సాయిచంద్‌ గారి ‘గోపీచంద్‌కీ అమర్‌ కహానియా’ ఫిజికల్లీ ఛాలెంజ్డ్‌ వుమన్‌ విజయగాధ ఇతివృత్తంగా తీసిన ‘విజేత’ లాంటివెన్నో నన్ను ప్రభావితం చేసాయి. అలా ప్రారంభమైన నా జీవితాన్ని నన్ను నేనుగా తీర్చిదిద్దుకుంటూ వచ్చాను. పోచంపల్లి కాటన్‌ చీర కట్టుకుంటే ఉత్తమత్వం అనీ, మిడ్డీలూ, స్లీవ్‌లెస్‌లూ వేసుకుంటే తప్పనే స్వభావం కాదు నాది. సౌకర్యంగా అనిపించేది వేసుకోవచ్చు. అలా వేసుకోను అని చెప్పే స్వేచ్ఛ కూడా ఉండాలి. పురుషులు దగ్గరికి తీసుకోవడం కొందరికి అసభ్యంగా అనిపించకపోవచ్చు. కొందరికి వీపురాసి, పిరుదులు తాకినా అది తప్పనిపించక పోవచ్చు. కానీ ఆ స్పర్శలోని ఆంతర్యాన్ని బట్టి నాలాంటి కొందరికది నచ్చకపోవచ్చు. ఎంత వరకు లిమిట్‌ అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. 

ఏ వివక్షనీ నేను సహించేదాన్ని కాదు. అందుకే నా ముందు చెత్తజోక్స్‌ వేసుకోవడానికి భయపడతారు. ఇలా ఉండడానికి చాలా మందిని కోల్పోయి ఉండొచ్చు. అయినా నాకు ఏ ఇబ్బందీ లేదు. నాకిష్టమైనట్లు నేనుండగలను అనేది అర్థం కావడానికి నాకే చాలా కాలం పట్టింది.  

మనం ఉంటోంది అంతా తులసి వనం కాదు. కలుపు మొక్కలుంటాయి. వాటి మధ్య కూడా మహిళలు తమ అస్తిత్వాన్ని నిలుపుకునే చైతన్యం రావాలి. తమ హక్కుల్ని సాధించుకునే పోరాటపటిమ కావాలి.  
– అత్తలూరి అరుణ,ఫొటోలు: కె. రమేష్‌ బాబు

మరిన్ని వార్తలు