సనాతన ధర్మానికి పురాతన వైభవం

4 Nov, 2017 23:59 IST|Sakshi

యోగభూమి

యతిగా... పీఠాధిపతిగా... ధార్మిక యోగిగా... సనాతన ధర్మ పరిరక్షణకు పన్నెండేళ్లుగా అహరహం కృషి చేస్తున్నారాయన. వసుధైక కుటుంబం అన్న భావనను ఆచరణాత్మకంగా లోకానికి చాటి చెబుతున్న యతిశ్రేష్ఠులాయన. ఒక పరమహంస పరివ్రాజకాచార్యులు ఎలా ఉండాలో అన్న సనాతన వైదిక ధర్మానికి సజీవోదాహరణం. నిరాడంబరమైన రూపం, నిర్వా్యజకరుణామృతాన్ని కురిపించే వాత్సల్యం ఆయన స్వభావం. ప్రతి ఒక్కరి జీవితానికీ పనికివచ్చే ప్రత్యక్షోదాహరణలతో సాగుతుంది వారి అనుగ్రహభాషణం. ఎవరినైనా సరే ఆత్మీయంగా పలకరించడం వారి నైజం. రోజుకు వందలాది మైళ్ల దూరమైనా సరే సంచారం చేసి, పిలిచిన వారు ఎవరైనా సరే, ఎంత దూరమైనా సరే, ఏమాత్రం తీరిక దొరికినా వెళ్లి ఆశీరనుగ్రహాన్ని అందించడం వారు ఏర్పరచుకున్న నియమం. ఆయనే పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ గురుమదనానంద సరస్వతీ పీఠాధీశ్వరులు మాధవానంద సరస్వతీస్వామి. లెక్కకు మిక్కిలి యాగాలలో, దేవతా ప్రతిష్ఠాపనలలో, జీర్ణ దేవాలయాల పునరుద్ధరణలలో పాల్గొని సనాతన ధర్మానికి పురాతన వైభవ కారకులవుతున్నారు. శ్రీగురు మదనానంద సరస్వతీ పీఠాధీశ్వరులుగా బాధ్యతలు చేపట్టి పుష్కరకాలంగా ధార్మిక తేజస్సును పరివ్యాప్తం చేస్తున్న మాధవానంద సరస్వతీ స్వామి పరిచయం ఇది.

కర్ణాటక రాష్ట్రంలోని బసవకళ్యాణ్‌ పట్టణంలో వెలసిన సనాతన సదానంద ఆశ్రమంలో పీఠాధిపతులుగా విరాజిల్లారు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీమదనానంద సరస్వతీ స్వామి. మెదక్‌ జిల్లా టేక్మాల్‌ ప్రాంతంలో జన్మించిన శ్రీ స్వామివారు ఆజన్మ బ్రహ్మచర్యంతో సర్వసంగ పరిత్యాగులై అకుంఠిత జపతపో యజ్ఞాలను నిర్వహించి దైవప్రేరణతో కర్ణాటకలోని బసవ కళ్యాణ్‌కి చేరారు. అక్కడి పీఠాధీశ్వరులు శ్రీ మాధవానంద యతివరులకు అనుంగు శిష్యులైనారు. వారి ఆజ్ఞ మేరకు చేర్యాల, సిద్ధిపేట, తొగుట తదితర ప్రాంతాలలో విస్తతంగా పర్యటించి ఎన్నో జీర్ణ దేవాలయాలను ఉద్ధరించి వందలాది మందికి ఆధ్యాత్మిక జ్ఞానభిక్షను అందించి నిరతాన్నదానవ్రతులుగా కోటిలింగాల ఆలయాల ప్రతిష్ఠాపకులుగా నిలిచారు. అంత్య సమయంలో గురుశుశ్రూషకై తిరిగి బసవకళ్యాణ్‌కి చేరి అక్కడే గురువుగారి ఆజ్ఞ మేరకు తదనంతర పీఠాధిపతులుగా నిలిచిపోయారు. అపరశివావతారులైన శ్రీ మదనానంద సరస్వతీ స్వామివారికి అంతేవాసులుగా ప్రియతమ అనుచరులుగా మెలిగి తురీయాశ్రమాన్ని స్వీకరించారు కృష్ణానంద సరస్వతీ స్వామివారు. గురువాజ్ఞను శిరసావహించి రాంపురంలోని శ్రీ గురుమదనానంద సరస్వతీపీఠాన్ని నెలకొల్పి గురువుల మార్గంలోనే త్యాగమయ నిరాడంబర జీవితాన్ని గడుపుతూ నిరతాన్నదాన వ్రతాన్ని కొనసాగిస్తూ ఆదర్శ తపోమూర్తిగా విరాజిల్లుతున్నారు. ఆశ్రమ నిర్వహణ బాధ్యతను సమస్తాన్నీ తన భుజస్కంధాలపై ధరించి పీఠాన్ని దివ్య ఆధ్యాత్మిక కేంద్రంగా ఇతోధి కంగా అభివృద్ధిపరిచారు శ్రీరామశైలేశ్వరశర్మ గారు (ధర్మాధికారి), వారి సోదర ద్వయం.
నిరంతర వైరాగ్య మార్గంలో శ్రీ కృష్ణానందుల వారి పూర్వాశ్రమ పుత్రులైన శైలేశ్వరశర్మ గురుమదనానందుల వద్ద మంత్రదీక్షను పొంది కఠోర సాధనలతో తమ ఆధ్యాత్మిక మార్గాన్ని సుస్థిరపరచుకున్నారు. గురువులకే ఆశ్చర్యానందాలను కలిగించే సాధన వారికి అలవడింది. దానికితోడు సన్యస్తులై పీఠాధిపతులుగా విరాజిల్లుతున్న శ్రీ కృష్ణానందస్వాముల యోగ సాధనలను ప్రత్యక్షంగా గమనించడం, వారి సేవలలోనే సమయాన్ని వెచ్చిస్తూ పీఠాభివృద్ధికి నిరంతరాయంగా పాటుపడడం శైలేశ్వర శర్మ నిర్ణిద్ర కృషీవలత్వానికి నిదర్శనం.పీఠంలో మూడేళ్ల క్రితం జరిగిన  శతకోటి గాయత్రీ మహాయజ్ఞం అనంతరం శైలేశ్వరశర్మ తన జీవన విధానాన్ని పూర్తిగా వాన ప్రస్థాశ్రమ పద్ధతిలోకి మార్చుకున్నారు. వారి ధర్మపత్ని శ్రీమతి లలిత సహధర్మచారిణిగా భర్తసేవలలోనే గడుపుతూ గురు వృద్ధులను, అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ ఆదర్శమూర్తిగా విరక్త జీవనాన్ని గడుపుతున్నారు.

తురీయాశ్రమ స్వీకారం
డిసెంబర్‌ 15, 2005 శ్రీదత్తజయన్తి రోజున తొగుట రాంపురంలోని ‘గురుమదనానంద సరస్వతీ పీఠం’లో కృష్ణానంద సరస్వతీ స్వామివారు వారి పూర్వాశ్రమ పుత్రులు, పీఠానికి ధర్మాధికారిగా ఉన్న శ్రీరామశైలేశ్వర శర్మకు ‘మాధవానంద సరస్వతీ స్వామి’గా దీక్షితనామాన్ని ఇచ్చి సన్యాసదీక్షను ప్రసాదించారు. పీఠానికి తమ ఉత్తరాధికారిగా శ్రీ మాధవానంద సరస్వతీ స్వామిని ప్రకటించారు.మాధవానందసరస్వతి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ (తెలుగు) పట్టం పొందారు. రుక్మాభట్ల విధుమౌళి శాస్త్రి రచించిన ప్రసిద్ధ ‘తందనాన రామాయణం’పై పరిశోధన గావించి ఎం.ఫిల్‌ పట్టాను స్వీకరించారు. చాలాకాలం ఉపన్యాసకులుగా పనిచేసి డిగ్రీ విద్యార్థులకు తెలుగు పాఠాలను బోధించారు.

బ్రహ్మశ్రీ దోర్బల విశ్వనాథశర్మ వద్ద శిష్యరికం గావించి భారత, భాగవత ఉపనిషదాదులపై ప్రవచనాలను గావించే సామర్థ్యాన్ని పెంపొందించుకున్నారు. ఎన్నోచోట్ల ప్రవచనాలను గావించారు. శ్రీ గురుమదనానందుల ఆరాధనోత్సవాలను గురుపాదుకాపూజలను అత్యంత భక్తిప్రపత్తులతో ఆచరించారు. జ్ఞాన వయోవృద్ధుల సేవలతో  ఆధ్యాత్మిక భాండాగారాన్ని పెంపొందించుకున్నారు.ఒక స్వచ్ఛంద సేవా కేంద్రంగా, ఆధ్యాత్మిక నిలయంగా సాంగవేదవిద్యాలయంగా ఆదర్శ విద్యాలయంగా అన్నదాన కేంద్రంగా పీఠాన్ని బహుముఖీనంగా ప్రవర్ధిల్లజేశారు. వాస్తు జ్యోతిషాది విషయాలలో భక్తుల సందేహాలను తీర్చి ఓదార్చేవారు. ఇన్ని విలక్షణ విశిష్ట లక్షణాలను సంతరించుకుని అందరికీ ఆదర్శ ప్రేమమూర్తిగా అలరారుతూ తమలోని విరక్త భావాన్ని తపస్సాధనా మార్గంలో సుసంపన్నం గావించుకున్న మాధవానంద స్వామి బోధలు...

ధర్మాచరణే శిరోధార్యం...  
ప్రేమతత్వం సకల చరాచర సృష్టిలో నిండి ఉంది. అపరిమిత చైతన్యస్వరూపమైన పరమాత్మ దర్శనాపేక్ష గల శ్రేయోమార్గం ద్వారా పరంపరాగత దర్శనాన్ని కోరుకోవడంలో తప్పేముంది? సంసారం ఒక కాలుతున్న ఇనుపగుండులాంటిది. దాన్ని ఎంతకాలం భరిస్తాం.నిత్యం మన కళ్ల ముందు కదలాడే నిత్య చైతన్య స్వరూపాన్వేషణమే పారమార్థిక సత్యం. దాన్ని అనుభవిస్తే తప్ప సంపూర్ణ తాత్వికావిష్కరణ చేయలేం. చక్కెరలో తీపి ఎలా ఉంటుందో పారమార్థిక తత్వాన్వేషణ ఫలితం అలా ఉంటుంది,
కోరికల వల్ల రాగం పెరుగుతుంది. దానివల్ల కోపం కలుగుతుంది. పరమాత్మ దర్శన ఇచ్ఛనే కలిగి ఉండాలి. ఆదిశంకరుల నుండీ అనుసరించిన ఆదర్శమార్గంలోనే ధర్మాన్ని ఆచరించడమే ముఖ్య ధ్యేయం.
– మరుమాముల

మరిన్ని వార్తలు