కారు కొంటున్నారా..

27 Jun, 2014 23:03 IST|Sakshi
కారు కొంటున్నారా..

భారీ జీతాలందుకునే ఫ్రెండ్స్ ముందు తానూ ఆర్భాటంగానే ఉండాలనే కాన్సెప్టుతో తనకు ప్రత్యేకంగా అవసరం లేకపోయినా ఈఎంఐల మీద లగ్జరీ కారు కొనేశాడు ఆనంద్. మొదట కొన్నాళ్లు బాగానే నడిచినా.. ఆ తర్వాత అర్థమయింది కారు కొనుక్కోవడం ఒకెత్తు.. దాన్ని భరించడం మరో ఎత్తు అని. బైటికి తీస్తేనేమో పెట్రోల్ వాత.. పోనీ తియ్యకుండా అలా ఉంచేసినా.. ఎలుకలు వగైరాలు దూరేసి మెయింటెనెన్స్ మోత మోగిపోతోంది. ఇటు ఈఎంఐలు, అటు ఇంధనం ఖర్చులు, మరోవైపు రెండు మూడు నెలలకోసారి మెయింటెనెన్స్ బాదుడు కలిపి ఆనంద్‌కి తడిసిమోపెడవుతోంది. ఇలాంటి తలనొప్పులు లేకుండా ముందస్తుగా కొద్ది పాటి జాగ్రత్తలు తీసుకుంటే.. కారులో జోరుగా హుషారుగా షికారు చేయొచ్చు.
 
సరైన కారే కొంటున్నామా..

కారు తీసుకోవడం అన్న ఆలోచన వచ్చిన తర్వాత.. మన అవసరాలకు తగినట్లుగా ఉండేది ఎంచుకోవాలి. అంటే ఎంత మంది కుటుంబసభ్యులు ఉన్నారు, ఎంత ఎక్కువ లగేజి ఉంటుంది లాంటివి చూసుకోవాలి. ఆరేడు మంది కుటుంబసభ్యులు ఉన్నప్పుడు చిన్న కారు తీసుకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

పెట్రోల్.. డీజిల్.. ఏది బెస్టు?

కారన్నాక.. మైలేజీ మొదలుకుని మెయింటెనెన్స్ వ్యయాలు దాకా అన్నీ చూసుకోవాల్సిందే. పెట్రోల్ ఖరీదైనప్పటికీ.. పెట్రోల్ కార్ల రేట్లు తక్కువగానే ఉంటాయి. మిగతా వాటితో పోలిస్తే మెయింటెనెన్సూ తక్కువే. డీజిల్ రేటు తక్కువ అయినా పెట్రోల్ కార్లతో పోలిస్తే డీజిల్ కార్ల రేట్ల మధ్య వ్యత్యాసం దాదాపు రూ.1 లక్ష పైగానే ఉంటోంది. పైగా మెయింటెనెన్సూ ఎక్కువగానే ఉంటుంది. ఉదాహరణకు, మారుతీ సుజుకీ స్విఫ్ట్ పెట్రోల్ వేరియంట్ సుమారు రూ. 4.57 లక్షల రేంజిలో ఉంటే.. డీజిల్ వెర్షన్ రూ. 5.66 లక్షల శ్రేణిలో ఉంది. రోజుకి కనీసం 80 కిలోమీటర్లయినా తిరిగేవారయితే డీజిల్ ఫర్వాలేదు. అయితే, ప్రస్తుతం డీజిల్, పెట్రోల్ రేట్లకి మధ్య వ్యత్యాసం భారీగా తగ్గిపోతోంది కాబట్టి ఆ కోణంలోనూ ఒకసారి ఆలోచించుకోవడం మంచిది. ఇక సీఎన్‌జీ కార్లు ఉన్నప్పటికీ.. అన్ని చోట్ల సీఎన్‌జీ దొరకడం ప్రస్తుతం సమస్యగా ఉంటోంది. కొన్ని కార్లు సీఎన్‌జీ- పెట్రోల్ కాంబినేషన్స్‌లో కూడా లభిస్తున్నాయి.
 
కొత్తదా.. పాతదా..

కాస్త ఎక్కువ డబ్బు పెట్టి కొత్తది తీసుకోవడం లేదా చవకగా పాత కారును తీసుకోవడం అన్నది మన అవసరం, డబ్బు లభ్యతను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం ముందుగా అసలు ఏ కారు రేటు ఎంత ఉంది, కొత్తది ఎంతకు లభిస్తోంది.. కొంత పాతబడినది ఎంతకు రావొచ్చు, మనం ఎంత బడ్జెట్ అనుకుంటున్నాము లాంటి అంశాలు చూసుకోవాలి. వివిధ కార్ల రేట్ల గురించి తెలుసుకోవడానికి, పోల్చి చూసుకోవడానికి కార్‌దేఖోడాట్‌కామ్ వంటి వెబ్‌సైట్లు ఉపయోగపడతాయి. ఇక, కార్ల తయారీ కంపెనీలు కూడా సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకం కోసం ప్రత్యేక షోరూమ్‌లు ఏర్పాటు చేశాయి. మారుతీ సుజుకీ ట్రూ వేల్యూ పేరిట, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ఫస్ట్ చాయిస్ పేరిట యూజ్డ్ కార్లను కూడా విక్రయిస్తున్నాయి.
 
ముందుగా డబ్బుల షాపింగ్..


ఒకవేళ లోన్ తీసుకుని కారు తీసుకోవాలనుకుంటున్న పక్షంలో ముందుగా ఎంత రుణం లభించే అవకాశం ఉంది, డౌన్‌పేమెంటు ఎంత చేయాల్సి ఉంటుంది అన్నవి చూసుకోవాలి.  ఏ బ్యాంకు తక్కువ వడ్డీ రేటు కు ఎక్కువ రుణం ఇస్తోందో తెలుసుకోవాలి. రుణ దరఖాస్తుకు బ్యాంకుల నుంచి ముందుగానే అప్రూవల్ దక్కించుకోగలిగితే.. బేరమాడేందుకు మరింత వీలు దొరుకుతుంది. ఏదైనా.. బడ్జెట్  దాటకుండా చూసుకోవాలి. కారు సైజు పెరిగే కొద్దీ భారీ డిస్కౌంట్లంటూ కంపెనీలు ఊదరగొడతాయి. ఆ మాయలో పడి బడ్జెట్‌ను దాటిపోకుండా జాగ్రత్తపడాలి. మీరు కట్టే ఈఎంఐ.. మీ ఇంటి ఖర్చులు, ఇతరత్రా కట్టాల్సిన బాకీలు అన్నీ పోయాక ఇన్వెస్ట్ చేసేందుకు మిగిలే డబ్బులో 40% మించకుండా ఉండాలి.
 

>
మరిన్ని వార్తలు