కామెర్లు ఎందుకొస్తాయి...?

10 Jun, 2019 03:01 IST|Sakshi

గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్స్‌

నేను వృత్తిరీత్యా కాంట్రాక్ట్‌ పనులు చేస్తుండటం వల్ల ఎక్కువగా ఊళ్లు తిరుగుతూ ఉంటాను. ఈమధ్య ఆకలి మందగించింది. నీరసంగా ఉండి ఎక్కువ సమయం నిద్రపోవాలనిపిస్తోంది. జ్వరంగా, అలసటగా ఉంటోంది. అప్పుడప్పుడూ కళ్లు పచ్చగా కనిపిస్తున్నాయి. తరచూ ఒళ్లంతా దురదలు కూడా వస్తున్నాయి.

ఆసుపత్రికి వెళ్లి చూపించుకుంటే కామెర్లని చెప్పారు. వెంటనే చికిత్స ప్రారంభించాలని కూడా అన్నారు. అసలు కామెర్ల వ్యాధి ఎందుకు వస్తుంది? ఒకసారి వ్యాధికి గురైతే పూర్తిగా తగ్గడం సాధ్యమేనా? నా లివర్‌కు ఏమైనా ప్రమాదం ఉంటుందా? దయచేసి కామెర్ల వ్యాధి గురించి వివరంగా చెప్పండి.

చర్మం, కళ్లలోని తెల్లటి భాగం పసుపుపచ్చ రంగుకు మారడమే కామెర్ల (జాండీస్‌)కు కొండగుర్తు. రక్తంలో బైలిరుబిన్‌ అనే పదార్థం అధికంగా చేరడం అన్నది ఈ కండిషన్‌కు దారితీస్తుంది. బైలిరుబిన్‌ అనేది పసుపురంగులో ఉండే ఒక వ్యర్థ పదార్థం. ఎర్రరక్తకణాలలోని హిమోగ్లోబిన్‌ తొలగిపోయాక మిగిలిపోయే భాగం ఇది. బైలిరుబిన్‌ పరిమాణం ఎక్కువైనప్పుడు అది చుట్టుపక్కల కణజాలాలోకి చేరి వాటికి పసుపురంగును కలిగిస్తుంది. సాధారణంగా రక్తంలోని బైలిరుబిన్‌ను కాలేయం తొలగిస్తుంటుంది.

అది కాలేయానికి చేరగానే అక్కడ దానిపై కొన్ని రసాయనాలు పనిచేస్తాయి. ఆ రసాయన చర్యలతో అది అన్‌కాంజుగేటెడ్‌ బైలిరుబిన్‌ అనే పదార్థంగా తయారవుతుంది. కాలేయం దీన్ని పైత్యరసంలోకి పంపిస్తుంది. ఈ జీర్ణరసం ద్వారా ఆహారంలోకి చేరిన బైలిరుబిన్‌ జీర్ణప్రక్రియ చివరివరకూ కొనసాగి చివరకు మలంతో విసర్జితమవుతుంది. మలానికి రంగు దీనివల్లనే ఏర్పడుతుంది. అనేక కారణాలు, అలవాట్లు, వైరల్‌ ఇన్ఫెక్షన్స్‌ వల్ల ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడి కామెర్ల వ్యాధి వస్తుంది.

గుర్తించడం ఎలా?
సాధారణంగా బయటకు కనిపించేది, అత్యధికులకు తెలిసింది చర్మం, కళ్లు పచ్చగా మారడం. ఇది మొదట తల భాగంతో ప్రారంభించి క్రమంగా శరీరమంతా వ్యాపిస్తుంది. ఈ పచ్చదనం కాకుండా మరికొన్ని లక్షణాలు కూడా ఈ వ్యాధిలో కనిపిస్తుంటాయి. అవి...

దురదలు : చర్మంలో బైల్‌ సాల్ట్స్‌ అధికంగా చేరడం వల్ల శరీరమంతటా దురదలు వస్తాయి.

అలసట : స్పష్టమైన ఏ కారణం లేకుండానే విపరీతమైన అలసట కనిపిస్తుంది. బరువు తగ్గిపోతుంది.

జ్వరం : హఠాత్తుగా జ్వరం వస్తుంది. వాంతులవుతాయి.

నొప్పి : పొట్టలో తీవ్రమైన నొప్పి వస్తుంది.

మలమూత్రాల రంగు మారడం : సాధారణంగా కొద్దిపాటి లేత పసుపురంగుతో తేటగా ఉండే మూత్రం చిక్కగా గోధుమరంగులో వస్తుంది. అలాగే మలం పసుపు, ఆకుపచ్చ రంగులో ఉండటం కూడా కామెర్ల వ్యాధి లక్షణాలలో ముఖ్యమైనది.

కారణాలు
ప్రధానంగా రెండు కారణాల వల్ల జాండిస్‌ సోకుతుంది. వీటిలో మొదటిది శరీరంలోని బైలిరుబిన్‌ అత్యధికంగా ఉత్పత్తి అవుతుండటం. రెండో సహజంగా ఉత్పత్తి అవుతున్న బైలురుబిన్‌ను కాలేయం తొలగించలేకపోవడం. ఈ రెండు సందర్భాల్లోనూ బైలిరుబిన్‌ శరీర కణజాలంలో చేరి స్థిరపడుతుంది. కామెర్లవ్యాధి సోకిన వ్యక్తి శరీర అంతర్భాగంలో కొన్ని స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి.

కాలేయం వాపు : ఇలా వాపు రావడం వల్ల బైలిరుబిన్‌ను గుర్తించి, దాన్ని తొలగించే సామర్థ్యం మందగించి, రక్తంలో ఆ వ్యర్థపదార్థం పరిమాణం పెరుగుతూపోతుంది.

బైల్‌డక్ట్‌ వాపు : పైత్యరసం నాళం వాపు కారణంగా ఆ జీర్ణరసం స్రవించడానికీ, తద్వారా బైలిరుబిన్‌ తొలగించడానికి ఆటంకంగా తయారవుతుంది. దాంతో కామెర్ల వ్యాధి కనపడుతుంది.

పైత్యరస నాళంలో అడ్డంకులు : ఇది బైలిరుబిన్‌ను తొలగించే ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది.

హీమోలైటిక్‌ అనీమియా : భారీసంఖ్యలో ఎర్రరక్తకణాలు విచ్ఛిన్నమైనప్పుడు శరీరంలో పెద్దమొత్తంలో బైలిరుబిన్‌ తయారవుతుంది. మలేరియా, థలసేమియా వ్యాధుల వల్లగానీ లేదా కొన్ని రకాల ఔషధాల వల్ల ఎర్రరక్తకణాలు భారీగా విచ్ఛిన్నమవుతాయి.

గిల్బర్ట్‌ సిండ్రోమ్‌ : వంశపారంపర్యంగా ఏర్పడే ఈ పరిస్థితి వల్ల పైత్యరసాన్ని విడుదల చేయగల ఎంజైముల సామర్థ్యం దెబ్బతింటుంది.

కొలెస్టాటిస్‌ : ఈ కండిషన్‌లో కాలేయం నుంచి పైత్యరసం విడుదలకు అడ్డంకులు ఏర్పడతాయి. దాంతో కాంజెగేటెడ్‌ బైలిరుబిన్‌ విసర్జితం కావడానికి బదులు కాలేయంలోనే ఉండిపోతుంది.

వయోజనుల్లో మరికొన్ని తీవ్రమైన కారణాల వల్ల కామెర్ల వ్యాధి వస్తుంది. వీటిలో కొన్ని ప్రాణాంతకమైన పరిస్థితులకూ దారితీయవచ్చు. మితిమీరిన మద్యపానం (నాలుగేళ్లకు పైబడి), హెపటైటిస్‌ బి, సి వైరస్‌ల ఇన్ఫెక్షన్‌ల వల్ల ఎక్కువమంది కామెర్ల వ్యాధికి గురవుతుంటారు. హెపటైటిస్‌ ఏ, ఈ వైరస్‌ల వల్ల కూడా కామెర్లు వస్తాయి. ఇవి ప్రమాదకరం. కలుషితమైన నీళ్లు, తిండి వల్ల ఈ తీవ్రమైన హెపటైటిస్‌ ఏ, ఈ వైరస్‌లు శరీరంలోకి చేరుతుంటాయి.

వ్యాధి నిర్ధారణ
 చాలా సందర్భాల్లో పేషెంట్‌ ఆరోగ్య చరిత్రను తెలుసుకోవడం, భౌతికంగా పరీక్షించడం, పొట్టదగ్గర పరిశీలించడం ద్వారా డాక్టర్లు కామెర్ల వ్యాధిని గుర్తిస్తారు. పొట్టలో ఏమైనా గడ్డలు ఉన్నాయా, కాలేయం గట్టిపడిందా అని పరిశీలించి చూస్తారు. కాలేయం గట్టిగా మారడం సిర్రోసిస్‌ వ్యాధిని సూచిస్తుంది. అది అలా గట్టిగా మారడం క్యాన్సర్‌ లక్షణం. కామెర్ల తీవ్రతను తెలుసుకోడానికి చాలా రోగనిర్ధారణ పరీక్షలు ఉన్నాయి. వీటిలో మొదటిది లివర్‌ ఫంక్షన్‌ పరీక్ష. కాలేయం సరిగా పనిచేస్తున్నదీ లేనిదీ దీనితో వెల్లడవుతుంది.

రోగిలో వ్యక్తమవుతున్న లక్షణాలకు కారణాలు బయటపడని పక్షంలో బైలిరుబిన్‌ పరిమాణం, రక్తపు తాజా పరిస్థితిని అర్థం చేసుకోడానికి బైలురుబిన్‌ టెస్ట్, ఫుల్‌ బ్లడ్‌ కౌంట్, కంప్లీట్‌ బ్లడ్‌ కౌంట్, హెపటైటిస్‌ వైరస్‌ల పరీక్షల వంటి వివిధ రకాల పరీక్షలను డాక్టర్లు సూచిస్తారు. నాళాలకు అడ్డంకులు ఏర్పడిన కారణంగా కామెర్లు వచ్చినట్లు అనుమానిస్తే ఎమ్మారై స్కాన్, అబ్డామినల్‌ అల్ట్రాసోనోగ్రఫీ, కాట్‌స్కాన్‌ వంటి పరీక్షలు చేయిస్తారు. సిర్రోసిస్, క్యాన్సర్, ఫాటీలివర్‌ ఏర్పడినట్లు అనుమానం కలిగితే బయాప్సీ చేయించాల్సిందిగా సూచిస్తారు.

చికిత్స
చాలామంది అవగాహన లేక జాండిస్‌కు నాటుమందులు వాడుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ప్రాణాంతకం కూడా. కామెర్లకు ఇప్పుడు మంచి చికిత్స అందుబాటులో ఉంది. కామెర్లకు సరైన చికిత్స తీసుకోకపోతే కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. కామెర్లకు చికిత్స చేసే ముందర ఆ వ్యాధికి దారితీసిన కారణాలను గుర్తించేందుకు పరీక్షలు జరుపుతారు. వాటిని అదుపుచేయడం, నివారించడానికి చికిత్స చేస్తారు. రక్తహీనత కారణంగా ఏర్పడిన కామెర్లను రక్తంలో ఎర్రరక్తకణాలను అభివృద్ధిపరచడం ద్వారా అదుపుచేస్తారు. ఇందుకు ఐరన్‌ సప్లిమెంట్లు, ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆహారం సిఫార్సు చేస్తారు. హెపటైటిస్‌ కారణంగా వచ్చే కామెర్లను తగ్గించడానికి యాంటీవైరల్‌ మందులు, స్టెరాయిడ్స్‌ ఇస్తారు.

నాళాలలో అడ్డంకుల కారణంగా కామెర్లు వస్తే, శస్త్రచికిత్స ద్వారా ఆ ఆటంకాలను తొలగిస్తారు.ఏమైనా మందులు వాటం వల్ల వాటిలోని రసాయనాల వల్ల కామెర్లు వస్తే మొదట వాటి వాడకాన్ని నిలిపేస్తారు. ప్రత్యామ్నాయ ఔషధాలను సిఫార్సు చేయడంతో పాటు వాటి దుష్ఫలితాలను తగ్గించేందుకు అవసరమైన చికిత్స అందిస్తారు. హెపటైటిస్‌ ఏ, ఈ వైరస్‌ల వల్ల వచ్చే కామెర్లు చాలా ప్రమాదకరం. దీనిలో హఠాత్తుగా కామెర్ల వ్యాధి సోకి ప్రాణాపాయ ప్రమాదం ముంచుకువచ్చే అవకాశం ఉంది. కాలేయమార్పిడి మాత్రమే దీనికి నమ్మకమైన చికిత్స. సజీవులై వారి నుంచి లేదా బ్రెయిన్‌డెడ్‌ అయిన దాత నుంచి సేకరించిన ఆరోగ్యకరమైన కాలేయంతో అవయవమార్పిడి ఆపరేషన్‌ చేస్తారు.

డా. బి. రవిశంకర్, సీనియర్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ అండ్‌ హెపటాలజిస్ట్,
యశోద హాస్పిటల్స్‌. సికింద్రాబాద్‌

మరిన్ని వార్తలు