యాండ్రాలజీ కౌన్సెలింగ్

28 May, 2015 00:10 IST|Sakshi

నా వయస్సు 29 ఏళ్లు. నేను మూడేళ్ల క్రితం ఓ మహిళతో శారీరకంగా కలిశాను. ఆమెకు హెచ్‌ఐవీ ఉందేమోననే అనుమానంతో ఆమెకు హెచ్‌ఐవీ పరీక్ష చేయించాను. వెస్ట్రన్‌బ్లాట్ పరీక్ష కూడా చేయించాను. అన్ని రిపోర్టులూ నెగెటివ్ వచ్చాయి. ఆ మహిళకూ, నా భార్యకు కూడా పరీక్షలు చేయించాను. ఇద్దరికీ నెగెటివ్ వచ్చింది. అయితే విండో పిరియడ్ అని ఒకటి ఉంటుందని, ఆ సమయంలో వ్యాధి ఉన్నా బయటపడదని స్నేహితులు అంటున్నారు. ఈ విండో పిరియడ్ అంటే ఏమిటి? ఎన్నాళ్లుంటుంది? వివరించండి.
 - పి.వి.ఆర్., రాజమండ్రి
 
వివాహేతర సంబంధాలు ఉన్నప్పుడు హెచ్‌ఐవీ వస్తుం దేమో అని భయం ఉంటుంది. దానికి ప్రధాన కారణం... కండోమ్ లేకుండా సెక్స్‌లో పాల్గొనడం. కండోమ్ వాడితే ఈ సమస్యను చాలా సులువుగా ఎదుర్కోవచ్చు. కండోమ్ వాడకుండా సెక్స్‌లో పాల్గొంటే హెచ్‌ఐవీ, హెపటైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉంది. ఆ వైరస్‌ల విండో పిరియడ్ కొన్ని వారాల నుంచి ఆరు నెలల వరకు ఉంటుంది. ఇక విండో పీరియడ్ అంటే ఏమిటనే విషయానికి వస్తే - ఏదైనా వైరస్‌ను వాటి యాంటీబాడీస్ ద్వారా గుర్తిస్తాం. ఓ వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటి యాంటీబాడీస్ ఉత్పత్తి కావడానికి కొంత సమయం పడుతుంది.

ఆ వ్యవధినే విండో పీరియడ్ అంటాం. ఈ విండో పీరియడ్‌లో యాంటీబాడీస్ ఉండవు. అయితే శరీరంలో వైరస్ మాత్రం ఉంటుంది. అలాంటప్పుడు ఆ వైరస్ ఉన్నవాళ్లతో సెక్స్‌లో పాల్గొంటే (యాంటీబాడీస్ పరీక్షలో హెచ్‌ఐవీ టెస్ట్ నెగెటివ్ అని వచ్చినా) ఆ వైరస్ సోకే ప్రమాదం ఉంది. అందువల్ల ఆర్నెల్ల తర్వాత ఇద్దరికీ హెచ్‌ఐవీ పరీక్షలో నెగెటివ్ వస్తే దాదాపు వ్యాధి లేనట్లే అనుకోవచ్చు. ఇక కండోమ్ కంటే కూడా ఎలాంటి వివాహేతర సంబంధాలు లేకపోవడమే ముఖ్యం. అదే అన్నిటికంటే సురక్షితం.
 
డాక్టర్ వి. చంద్రమోహన్
యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కె.పి.హెచ్.బి, హైదరాబాద్

మరిన్ని వార్తలు