నవ్విన చెట్టు

3 Feb, 2020 00:59 IST|Sakshi

కథాసారం 

ఒకనాడు ఆఫీసుకు వస్తూనే అహమ్మదుతో చెప్పేడు 
‘సాయిబూ, మన పెరట్లో తొగరు చెట్టు నరికించీ... 
వెధవ చెట్టు’. సాయిబు హడలిపోయేడు. 
‘అదేం అయ్యగోరూ– పాపం ఆ సెట్టు యెన్నాల్లకో 
ముచ్చటగా సిగిర్పింది. దాన్నెందుకు నరకాలి?’

జిల్లా ట్రెజరీ హెడ్‌ అకౌంటెంటు చిట్టి వెంకట్రామయ్య గారు అవాళ సాయంత్రం గడియారం టంగు టంగున ఐదుకొట్టగానే టక్కున ఇంటికి వెడిపోయారు. ఏం చెప్మా అనుకున్నారు పెద్ద గుమస్తా అంతా. ఇవాళైనా వెలుగులో భార్యాబిడ్డల మొహాలు చూస్తామనుకున్నారు టైపిస్టులూ, అటెండర్లూ. అయితే, గత పన్నెండు సంవత్సరాలలో యిలాంటి విపరీతం జరగలేదు. ఇది జనన తేదీలు అజాయించేపట్ల  మనవాళ్లు భూతకాలంలోని తుపానులు, భూకంపాలు మొదలైనవి ఉటంకించినట్లు చెప్పుకోతగ్గది.]

చిట్టి వెంకట్రామయ్య గారు పన్నెండేళ్ల కిందట ఆ జిల్లా ట్రెజరీకి హెడ్‌ అకౌంటెంటుగా వచ్చేరు. అప్పటికీ యిప్పటికీ ఆయన హోదాలోగాని, ప్రవర్తనలో గాని మార్పు లేదు. ఉదయం పదకొండింటికి వచ్చి సాయంత్రం ఏడున్నరకు లేచేవారు. ఎప్పుడూ నవ్వకపోయినా యేడుపుముఖం పెట్టలేదు. ఎవర్ని యెన్ని తిట్టినా పై అధికారితో చెప్పి అపకారం చేయించలేదు. ఆయన్ని అర్థం చేసుకున్నామనుకున్నవాళ్లు గత్యంతరం లేక సమాధానపడ్డారు. పోతే, అవాళ సాయంత్రం ఐదింటికి అకస్మాత్తుగా ఆయన యెందుకు లేచి వెడిపోయారో యెవ్వరికీ తెలీదు. చివరికి ఆయన ప్రైవేట్‌ సెక్రటరీలాంటి బంట్రోతు అహమ్మదుకు కూడా. అసలాయనకి ప్రైవేటు జీవితం లేదనే అందరి అభిప్రాయం. ఆయన భార్య సుమారు ముప్పై యేళ్ల కిందట పెళ్లి అయిన కొద్ది నెలలలోనే పోయిందని కొందరికి తెలుసు. ఇంకా లోతైన విషయాలు అహమ్మదుకీ, కనీసం పన్నెండేళ్లనుంచీ వంట చేస్తున్న నరసింహానికీ కూడా తెలీవు.

సూర్యుడికంటే ముందు లేచి స్నానం చేసి, సంధ్య వార్చి, ఆఫీసు కాగితాలు చూసుకుని, తొమ్మిది గంటలకి వేడి వేడి పెసరట్టూ, వుడికించిన కూర, పెరుగూ అన్నం తిని ఆఫీసుకు వెళ్లడం, సాయంత్రం సుమారెనిమిదింటికి యిల్లు చేరి మడి కట్టుకుని భోంచేసి, రాత్రి సుమారు పదకొండు వరకూ తిరిగి ఆఫీసు కాగితాలు చూసుకుని పడుకోవడం ఆయన దినచర్య. దీనిలో యెన్నడూ యేమీ మార్పుండదు. ఆయన యెప్పుడూ సినీమాలూ నాటకాలూ చూడరు. ఎప్పుడైనా వాళ్ల బంధువులెవరైనా ఆ వూరు వస్తే వాళ్లింట్లోనే దిగేవారు. దూరపు అన్నదమ్ములు, రెండువేళ్లు విడిచిన మేనమామ మనవరాళ్లూ, స్నేహితులు, స్నేహితుల స్నేహితులు యిత్యాది. కారణం ఆయనమీద అభిమానం అనుకోవడం సత్యానికి చాలా దూరం; ఆయన కలిగినవాడని, ఖర్చు లేనివాడని. అయితే ఆయన యెవ్వరితోటీ ఆట్టే మాట్లాడేవారు కారు. చుట్టపక్కాలున్నప్పుడు కూడా ఆయన మేడమీద తన గదిలోంచి బైటికి వచ్చేవారు కారు. అంచేత ఆ వచ్చినవాళ్లు కూడా ఆనవాయితుకు ‘బాబాయీ బాగున్నావా’ అనో, ‘అన్నయ్యా యెన్నాళ్లయింది నిన్ను చూసి’ అనో పలకరించినా, ఆ యింటిని సుమారొక విశ్రాంతి గృహంగానే భావించేవారు, చార్జీలు మినహా.

చిట్టి వెంకట్రామయ్య గారి ‘గది’ మేడమీదుంది. మేడమీదున్న గది అదొక్కటే. ఆ గదికి ఉత్తరం వేపున్న కిటికీ గుండా పెరట్లో వున్న తొగరుచెట్టు పైభాగం సూటిగా అగుపిస్తుంది. తీరికగా వున్నప్పుడల్లా ఆయన దానివేపు చూసేవారు. ఆయన యెరికని ఆ చెట్టు యెప్పుడూ అలాగేవుంది, ఆకులు లేకుండా మోడులా. దానిని చూస్తున్నంతసేపూ ఆయన మనసు శాంతియుతంగా వుండేది. అవాళ ఆయన సాయంత్రం ఐదు గంటలకి టక్కున లేచి ఆఫీసు నుంచి వెళ్లిపోవడం లగాయతు, ఆర్నెళ్లపాటు ఆయన ఆఫీసు జీవితంలో వింతమార్పు వచ్చింది. ఉన్నంతసేపూ అందరిమీదా రుసరుసలాడ్డం, తిట్టడం, ట్రెజరీ ఆఫీసు మీదే ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ విసుక్కోవడం. ఎంత గొడవ చేసినా ఐదింటికల్లా డ్రాయర్లు మూసి వెడిపోవడం. ఆయన్ని యెవరూ యేమీ అనేవారు కారు. కారణం ఆయనకి అప్పుడే చాలా సర్వీసు అయిపోయింది. పైగా ఆయన వయసు యాభైలోపైనా, పళ్లూడిపోయి, దిగజారిపోయి అరవై యేళ్ల వాడిలా అగుపించేవాడు.

డిసెంబరు నెల నడుస్తూంది. హేమంతుడి ప్రతాపానికి తట్టుకోలేక పృథకి శియ్యలు ఏకశియ్యలౌతున్నాయి. చిట్టి వెంకట్రామయ్య వొక్క నిద్ర తీసేరు. ఈదురుగాలికి తెలివి వచ్చింది. పెరటి వైపు కిటికీ మూసివేద్దామని లేచారు. కిటికీ దగ్గరికి వెళ్లగానే తొగరుచెట్టు మొండికొమ్మల్లోంచి వొక దృశ్యం అగుపించింది. అవతల వీధి మేడగది కిటికీ తెరిచివుంది. ఎలట్రి దీపం కాంతి చక్కగావుంది. ఒక యువకుడు వొక యువతి – నిటారుగా, నగ్నంగా, గాఢాలింగనంలో పెనచుకుపోయేరు, చెట్టుతీగలా. చిట్టి వెంకట్రామయ్య హృదయం వేగంగా కొట్టుకుంది. వెంటనే చలి పటాపంచలై ఆపాదమస్తకం వేడెక్కింది.

కిటికీ మూసి వెడిపోదామా అనిపించింది. కానీ అలా చెయ్యలేకపోయేరు. వారు చీకట్లో వున్నారు. వాళ్లు లోకానికి మటుకే చీకట్లో వున్నారు. వాళ్లు నూతన దంపతులై వుంటారు. నిర్భయంగా, నిస్సంకోచంగా, నిర్లజ్జగా, రక్తమాంసాస్తి నరాలకు పంచభక్ష్య పరమాన్నాలతో విందుగా ప్రవర్తిస్తున్నారు. చిట్టి వెంకట్రామయ్య శరీరం విపరీతంగా కంపిస్తూంది. నిత్య శిశిర జీవితం గడుపుతూన్న ఆ నిర్భాగ్యపు తొగరుచెట్టు అవతలి, జీవిత పరిణామంలో మహోద్రేక పూరితమైన యీ ఘట్టపు విశ్వరూపం యిలా ఆ హేమంత నిశామధ్యంలో ప్రత్యక్షం అవుతుందని ఆయన కలలో కూడ అనుకోలేదు. ఆ సన్నివేశం ఆయన ప్రవృత్తిని పునాదులతో కుదిపింది.


ఆఫీసులో అంత అలజడి ఆ మర్నాడే జరిగింది. కిటికీలో నాటకం ఆరంభం ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటలకే. దానికి చివరి అంకం భరతవాక్యం వుంటాయని చిట్టి వెంకట్రామయ్య గారు అనుకోలేదు. కాలచక్రం తిరుగుతూంది. మార్చి నెల ప్రవేశించింది. హఠాత్తుగా పెరట్లో తొగరు చెట్టు చిగిర్చింది పన్నెండేళ్ల తరువాత. చూస్తుండగా చెట్టంతా గుబురై, పచ్చటి ఆకులు నిండింది. తొగరుపూల పరిమళాలు చిట్టి వెంకట్రామయ్య గది మీద, కాదు గుండెల మీద దాడి తీస్తున్నాయి. ఏం లాభం? కిటికీ కనిపించడం లేదు. ఆయనకి చిర్రెత్తింది. వెర్రెత్తింది. నిద్ర ఇదివరకే లేదు. కానీ ఇప్పుడు నిద్రలేని సుఖం కూడా లేదు.

ఒకనాడు ఆఫీసుకు వస్తూనే అహమ్మదుతో చెప్పేడు ‘సాయిబూ, మన పెరట్లో తొగరు చెట్టు నరికించీ... వెధవ చెట్టు’. సాయిబు హడలిపోయేడు. ‘అదేం అయ్యగోరూ– పాపం ఆ సెట్టు యెన్నాల్లకో ముచ్చటగా సిగిర్పింది. దాన్నెందుకు నరకాలి?’ ‘నీకు తెలీదు– సాయంత్రానికి నరికించీ’. అహమ్మదు గొణుక్కుంటూ వెడిపోయేడు. ఒంటిగంటకి ఆఫీసుకి ఒక యువకుడొచ్చాడు చిట్టి వెంకట్రామయ్య గారి కోసం. ఆయనకి సరిగా గుర్తురాలేదు. ‘మరేం లేదు. మీ యింట్లో క్రింద భాగములో చాలా గదులున్నాయిట. నాకో గది అద్దెకిస్తారేమో అని అడుగుదామని వచ్చా.’ ‘నేనెప్పుడూ యెవరికీ అద్దెకివ్వలేదే... అయినా మీ రెక్కడుంటున్నారు?’ ‘ఇక్కడే... అంటే ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. మీ యింటి దగ్గిరసానే వుంటున్నా. మా మేడమీంచి మీ పెరట్లో తొగరుచెట్టు అగుపిస్తుంది.’


చిట్టి వెంకట్రామయ్య అదిరిపడ్డాడు. ఇప్పుడు పోల్తి అందింది. కొంచెం సర్దుకుని అడిగారు, ‘మీరు బ్యాచిలరా?’ అతడు సిగ్గుతో అన్నాడు, ‘కాదండీ... మా ఆవిడ పుట్టింటికి వెడుతూంది. మరేం... పురిటికి... ఈలోగా నాకెందుకు అంత యిల్లని... మీ యింట్లో ఏదో వొకగది ఇస్తే చాలు...’ చిట్టి వెంకట్రామయ్య మనసులో ఒక పెద్ద అల్లకల్లోలం లేచి క్రమేణా చల్లబడింది. అది వొక పెద్ద శస్త్రచికిత్స! యువకుడిని మర్నాడు మంచిరోజని తన యింట్లో దిగిపొమ్మన్నాడు.
‘అహమ్మదూ...’
‘అయ్యగోరూ...’
‘తొగరుచెట్టు నరకొద్దురా...’
‘ఏం అయ్యగోరూ...’
‘తొగరుచెట్టు చిగిర్పిందిరా...’ చిరునవ్వుతో అన్నారు. అహమ్మదుతో సహా ఆఫీసంతా మూర్ఛపోయింది.
 

 
అంగర వెంకట కృష్ణారావు 
(అంగర వెంకట కృష్ణారావు కథ ‘తొగరు చెట్టు’ కు సంక్షిప్త రూపం ఇది. 1959 లో ప్రచురితమైంది. ఉత్తరాంధ్రకు చెందిన అంగర– కథకుడు, నవలారచయిత. తెలుగులో సైన్యం నేపథ్యంలో సాహిత్య సృజన చేసిన అతి తక్కువమంది రచయితల్లో అంగర (1920–74) ఒకరు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన సైన్యంలో పనిచేశారు. ఆ అనుభవాలతో ‘విరామం’ నవల రాశారు. పెద్ద మనిషి, పోయిన పుటలు ఆయన కథల్లో కొన్ని.) 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా