కలలో ఆకలేల?

21 Apr, 2015 22:39 IST|Sakshi
కలలో ఆకలేల?

స్వప్నలిపి

కడుపు పట్టుకుంటూ నిద్ర నుంచి టక్కుమని లేస్తాం. ఆకలిగా అనిపిస్తుంది. ఇంతలోనే అది భ్రమ అని తేలిపోతుంది. మరి ఆకలిగా ఎందుకు అనిపించింది? అది కల ఫలితం! కలలో మీరు ఆకలితో అలమటిస్తుంటారు. చేతిలో డబ్బులు ఉంటాయి. కాని భోజనం ఎక్కడా దొరకదు. మరోసారేమో... ఎటు చూస్తే అటూ నోరూరించే వంటకాలు కనిపిస్తుంటాయి. కానీ... చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు. ఇలా ‘ఆకలి’ నేపథ్యంగా రకరకాల కలలు వస్తుంటాయి. ‘ఈ నెల రోజుల కాలంలో ఒక్కరోజు కూడా ఆకలితో  పడుకోలేదు. రోజూ సుష్టుగా భోజనం చేస్తున్నాను. మరి ఈ ఆకలి కల ఏమిటి?’ అనే సందేహం రావచ్చు.

నిజానికి కలలో మన అనుభవంలోకి వచ్చే  ఆకలి అనేది ఆహారానికి సంబంధించినది కాదు.. రకరకాల విషయాలకు అది సూచనప్రాయమైన వ్యక్తీకరణ మాత్రమే. ఆర్థిక సంక్షోభాలు, సమస్యలు చుట్టుముట్టినప్పుడు, అనుకున్న స్థాయిలో జీవనప్రమాణాలు లేవనుకున్నప్పుడు, ప్రేమరాహిత్యంతో బాధ పడుతున్నప్పుడు ఇలాంటి కలలు సాధారణంగా వస్తుంటాయి. చేస్తున్న పనిలో సంతృప్తి లభించనప్పుడు, చేయబోయే పనిలో సంతృప్తి ఉండదనే ఆలోచన వచ్చినప్పుడు, నేర్చుకోవాల్సిన విషయమేదో ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ నిరాశ కలిగిస్తున్నప్పుడు... సాధారణంగా  ఇలాంటి కలలు వస్తుంటాయి.

మరిన్ని వార్తలు