జరిగింది ఒకటి...రాసింది మరొకటి!

2 Jul, 2017 00:03 IST|Sakshi
జరిగింది ఒకటి...రాసింది మరొకటి!

రవితేజగారు చాలా సరదాగా ఉంటారు. మాకు తెలిసిన రవితేజగారంటే అంతే. కానీ, ఇప్పుడు మరో వ్యక్తిని చూస్తున్నాం. భరత్‌ అంటే రవితేజగారికి చాలా ఇష్టం. షూటింగ్‌కి వస్తున్నప్పటికీ ఆయన లోలోపల ఎంత బాధపడుతున్నారో మాకు అర్థమవుతోంది. రవిగారికి సన్నిహితంగా ఉంటాం కాబట్టి ఆయన, వాళ్ల అమ్మానాన్న ఎంత బాధలో ఉన్నారో మాకు తెలుసు. కొడుకు ముఖం చూసే ధైర్యం లేదా తల్లికి. వాళ్ల జీవితంలో భరత్‌ ఓ మంచి జ్ఞాపకం. ఆ జ్ఞాపకం అలాగే జీవితాంతం ఉంచాలనుకున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత భరత్‌ను చూసేందుకు వాళ్ల అమ్మగారు భయపడిపోయారు.

కేవలం ఆ ఒక్క కారణంతోనే ఆవిడ అక్కడికి వెళ్లలేకపోయారు. తల్లితో పాటే ఉండిపోయారు రవితేజ. జరిగిన వాస్తవం ఇది. నాలుగు గోడల మధ్య ఉన్న ఈ బాధను అర్థం చేసుకోకుండా కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. సోషల్‌ మీడియాలో పెట్టే కంటెంట్‌ ఒకటి, హెడ్డింగ్‌ ఇంకొకటి. ఆ హెడ్డింగ్‌ చూడగానే అదేంటో తెలుసుకోవాలని క్లిక్‌ చేస్తారు. కట్‌ చేస్తే.. అందులో విషయం ఉండదు. ఇంతకుముందు ఏమైనా జరిగితే మన బాధ్యత మన అమ్మానాన్నలకు సమాధానం చెప్పడం వరకే ఉండేది.

ఇప్పుడు ఫేస్‌బుక్‌కి చెప్పుకోవాలి. ట్విట్టర్‌కి చెప్పుకోవాలి. యూట్యూబ్‌కి చెప్పుకోవాలి. విషయం తెలుసుకోకుండా సోషల్‌ మీడియాలో కొందరు రెచ్చిపోయారు. ఈ విషయమై మీడియాతో మాట్లాడమని రవితేజగారితో అన్నాం. కానీ, ఆయన బాధలో ఉన్నారు. లక్కీగా కొంతమందికి సోషల్‌ మీడియాపై అవగాహన ఉంది కాబట్టి, ఏది వాస్తవమో వాళ్లు అర్థం చేసుకున్నారు. ఏది ఏమైనా అసలే బాధలో ఉన్నవాళ్ల గురించి లేనిపోనివి కల్పించి, ఇంకా బాధపెట్టడం తప్పు.– దర్శకుడు అనిల్‌ రావిపూడి
భరత్‌ చాలా సరదాగా ఉండేవాడు
నింద.. నేను.. భరత్

మరిన్ని వార్తలు