పనే అన్నపూర్ణ ఐడీ

10 Jul, 2020 00:42 IST|Sakshi
ఇల్లిల్లూ తిరిగి వివరాల సేకరిస్తున్న అన్నపూర్ణ

‘ఐ యామ్‌ ఫ్రమ్‌ సీబీఐ’ అనగానే.. టెన్షన్, అటెన్షన్‌ వచ్చేస్తాయి. ఇన్‌కం టాక్స్‌కీ ఒక ఐడీ ఉంటుంది. మీడియాకూ ఐడీ ఉంటుంది. ఏ ఐడీ వాల్యూ ఆ ఐడీకి ఉంటుంది. అన్నపూర్ణ దగ్గరా ఒక ఐడీ ఉంది. చేతిలోని ఐడీ కాదు. చేతల్లోని ఐడీ! ఆ ఐడీకి ప్రభుత్వం సెల్యూట్‌ చేసింది. ‘బెస్ట్‌ ఆశా వర్కర్‌’ గా గుర్తించింది.

మంచి చెబితే ఎవరికీ నచ్చదు అంటారు. మాస్క్‌ పెట్టుకోమంటే అసలే నచ్చడం లేదు జనాలకు. ఈమధ్య ఒక ప్రభుత్వోద్యోగి.. ‘నన్నే మాస్క్‌ పెట్టుకోమంటావా!’ అని ఉగ్రుడైపోయి, ఆఫీస్‌లో తన కింద పని చేస్తున్న మహిళా కాంట్రాక్టు ఉద్యోగిని జుట్టుపట్టుకుని లాగి, ఆమెపై పిడిగుద్దులు కురిపించాడు. ఇలాంటి ఘటనలే దేశంలో రెండుమూడు చోట్ల జరిగాయి.  అన్నపూర్ణ ఆశా వర్కర్‌. మంచి చెప్పడం ఆమె పని. ఇప్పుడైతే ఇక మాస్క్‌ పెట్టుకోమని చెప్పడం కూడా. అక్కడితో అయిపోదు ఆమె డ్యూటీ. భౌతిక దూరం పాటించేలా చూడాలి.

ఎవరికైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్యా కేంద్రానికి తెలియజేయాలి. కరోనా అని ఎవరైనా భయపడుతుంటే ధైర్యం చెప్పాలి. మాకెందుకొస్తుందిలే అని ఎవరైనా కనీస జాగ్రత్తలు పాటించకుండా తిరుగుతుంటే భయం చెప్పాలి. ఇవన్నీ ఊరికే చెప్పేస్తే జరిగిపోయేవి కావు. కొందరు చెప్పనీయరు. కొందరు చెప్పినా వినరు. కొన్నిసార్లు మాటలు కూడా పడుతుంటుంది అన్నపూర్ణ. మురికివాడల్లోని మాటలు ఎలా ఉంటాయో అన్నపూర్ణొచ్చి చెప్పనవసరం లేదు. అన్నపూర్ణ గురించి మాత్రం కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తానికీ చెప్పేసింది.. ‘షీ ఈజ్‌ ద బెస్ట్‌’ అని! 

అవును. ‘బెస్ట్‌ ఆశా వర్కర్‌’గా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అన్నపూర్ణను గుర్తించింది. అందుకు తగిన కారణమే ఉంది. కోవిడ్‌ మల్టీ టాస్కింగ్‌ చేసింది అన్నపూర్ణ.. ప్రభుత్వం ఇచ్చిన ఆశా వర్కర్‌ అనే చిన్న ఐడీ కార్డును మెడలో వేసుకుని. వర్కర్‌ అనే కానీ, అంతకంటే ఎక్కువ పనే చేసింది. కర్ణాటకలోని తుంగానగర్‌లో ఆమె ఆశా (అక్రెడిటెడ్‌ సోషల్‌ హెల్త్‌ యాక్టివిస్ట్‌) వర్కర్‌. చిన్న గ్రామం అది. మూడు వేల మంది జనాభా ఉంటే, 2,500 మంది మురికివాడల్లోనే ఉంటారు. పైగా కోవిడ్‌ ‘కంటైన్‌మెంట్‌’ ఏరియా! తమ ప్రాంతాన్ని ప్రభుత్వం మూసివేసినప్పుడు వాళ్లంతా మొండిగా వ్యతిరేకించారు. అప్పుడు అన్నపూర్ణే వారికి.. ‘మూసివేయకపోతే మన ప్రాణాలు పోతాయి’అని అర్థమయ్యేలా చెప్పగలిగింది.
ఆశావర్కర్‌గా అన్నపూర్ణ ఐడీ

అన్నపూర్ణతో పాటు మరో ఏడుగురు ఆశా వర్కర్‌లు ఉన్నప్పటికీ వారికి అప్పగించిన బాధ్యతల్లో వాళ్లు ఉండేవారు. అన్నపూర్ణ మాత్రం తుంగానగర్‌ మొత్తాన్నీ తన కుటుంబ బాధ్యతగా తీసుకుంది. అక్కడ ఉండేవాళ్లంతా రోజుకూలీలే. కంటైన్‌మెంట్‌గా ప్రకటించాక వారి ఉపాధి కూడా పోయింది. అప్పుడు కూడా అన్నపూర్ణ దగ్గరుండి మరీ ఇంటింటికీ ప్రభుత్వం పంపించిన నిత్యావసర సరకులను పంపిణీ చేయించింది. ఆమె ఆ ప్రాంతంలో 2015 నుంచీ ఆశావర్కర్‌గా పని చేస్తోంది. మొత్తం పది కంటైన్‌మెంట్‌ జోన్‌లు ఉన్నాయి తుంగానగర్‌లో ఇప్పుడు.

బయటి వాళ్లు ఎవరైనా వస్తే వెంటనే తన దృష్టికి వచ్చే ఏర్పాటు చేసుకుంది అన్నపూర్ణ. గ్రామస్థులే ఫోన్‌ చేస్తారు. వెంటనే ఆ బయటి వాళ్లను క్వారెంటైన్‌కు పంపిస్తుంది. ఇవికాక ఆమె చేసే రోజువారి పనులు ఉంటాయి. గర్భిణులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళుతుంది. వారి ఆరోగ్యస్థితి గురించి అధికారులకు సమాచారం ఇస్తుంది. ఇంటెన్సివ్‌ కేర్‌ నుంచి డిశ్చార్జి అయిన శిశువుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తుంది. పౌష్టికాహారం అందని పిల్లల గురించి ఆరోగ్య కేంద్రానికి తెలియజేస్తుంది. 

ఇళ్ల బయటి వరకే తన పరిమితి అనుకోలేదు అన్నపూర్ణ. తలుపుల చాటున జరిగే గృహహింసను వెళ్లి ఆపేసేది. ఏడుస్తున్న గృహిణి కన్నీళ్లు తుడిచి కారణం తెలుసుకునేది. సాధారణంగా భర్తే కారణం అయి ఉంటాడు. అతడి గురించి అధికారులకు చెబితే వాళ్లు పిలిపించి హెచ్చరించేవారు. గృహహింస ఒకటేనా.. కరోనా వల్ల మహిళలు, ఆడపిల్లలు తక్కువ బాధలేం పడటం లేదు. రోజంతా చాకిరి, అనారోగ్యంలోనూ విశ్రాంతి తీసుకోలేని స్థితి. వాకిట్లో నిలబడి ఇంట్లోని మగవాళ్లకు నాలుగు మంచి మాటలు చెప్పి వెళ్లేది. ఆమె మాట్లాడుతుంటే ప్రభుత్వమే మాట్లాడుతున్నట్లు ఉండేది.

చేతికి గ్లవుజులు, చేతుల్లో ఫైల్స్, ముఖానికి మాస్క్, మెడలో ఐడీ.. సీరియస్‌గా ఉండేది. ఓరోజు.. చిన్న పిల్లకు పెళ్లి చేస్తున్నారని అన్నపూర్ణకు కబురొచ్చింది. వేరొకరైతే పోలీసులకు చెప్పేవారు. అన్నపూర్ణ రెండు కుటుంబాలను కూర్చోబెట్టింది. ఆ పెళ్లిని ఆపించింది. ఇవన్నీ కూడా అన్నపూర్ణ చెప్పుకుంటే కేంద్ర ప్రభుత్వానికి తెలిసినవి కాదు. తుంగానగర్‌ గ్రామస్థులు, డిస్ట్రిక్ట్‌ ఆశా మెంటర్‌ ఆరతి చెబితే తెలిసినవి. ‘‘బెస్ట్‌ వర్కర్‌ అని ప్రభుత్వ గుర్తింపు వచ్చింది కదా.. ఎలా అనిపిస్తోంది’’ అనే ప్రశ్నకు అన్నపూర్ణ చెప్పే సమాధానంలోనూ ఆమె బాధ్యత కనిపిస్తుంది! ‘‘ప్రతి ఆశా వర్కరూ బెస్ట్‌ వర్కరే’’ అంటుంది అన్నపూర్ణ. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు