కోరిన కోర్కెలను  తీర్చే కల్పవల్లి శ్రీమావుళ్లమ్మ తల్లి

27 Jan, 2019 02:40 IST|Sakshi

అమ్మలగన్న అమ్మగా, కోరిన కోర్కెలను తీర్చే కల్పవల్లిగా భీమవరం గ్రామ దేవత శ్రీమావుళ్లమ్మ తల్లి దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారి దైవంగా ప్రసిద్ధి. అమ్మ సన్నిధికి వచ్చి తమ బాధలను చెప్పుకుని ఆర్తితో వేడుకుంటే చాలు... చిటికెలో సమస్యలన్నీ దూరమవుతాయని భక్తుల విశ్వాసం.  అందుకే సామాన్య భక్తుడి నుంచి సంపన్నుడి వరకు నిత్యం అమ్మవారి దర్శనం కోసం పరితపిస్తుంటారు. అంతటి మహిమ గల మూర్తి పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొలువై ఉంది. వ్యాపారం ప్రారంభించినా, వివాహాదివేడుకలు చేస్తున్నా, నూతన వాహనాలు కొన్నా, అంతా శ్రీమావుళ్లమ్మ అమ్మవారి దయ అని చెప్పుకుంటారు స్థానికులు. 
ఘనంగా ఆరంభమైన వార్షికోత్సవాలుఅమ్మవారి 55వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ఆరంభమైనాయి. జనవరి 13న మొదలైన ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతాయి. అమ్మవారి ఉత్సవాలను తిలకించడానికి తెలంగాణ నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. అమ్మవారి ఆలయం వద్ద ప్రతి రోజు పలు సంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు, కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయగా భక్తులు భారీగా తరలి వచ్చి తిలకిస్తున్నారు.

ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఉత్సవాల నిర్వాహకులు నీరుల్లి, కూరగాయలు, పండ్లు వర్తకం సంఘం, అమ్మవారి ఉత్సవ కమిటీ వారు రోజుకు సుమారు 800 మంది భక్తులకు అన్నదాన ప్రసాదం వితరణ చేస్తున్నారు. వచ్చే నెల 7 తేదీ శ్రీఆదిలక్ష్మీ అమ్మవారి అలంకరణ నుంచి 15 తేదీ శ్రీ అన్నపూర్ణ దేవి అమ్మవారి అలంకరణ వరకు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు ఉంటాయి. 
అమ్మవారి ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్‌ అలంకరణలు భక్తులను ఎంతో అకట్టుకుంటున్నాయి.
– బొక్కా రామాంజనేయులు (నాని) 
 

ఉత్సవాలు... విశేషాలు

►శ్రీమావుళ్లమ్మ అమ్మవారు విగ్రహం ఎనిమిది అడుగుల మించిన ఎత్తుతో ఉండడం విశేషం.

►అమ్మవారి స్వర్ణ కిరీటం తిరుమల వెంకటేశ్వరస్వామి వారి కిరీటం కంటే పెద్ద కిరీటమని ప్రతీతి. 

►శ్రీమావుళ్లమ్మ అమ్మవారు క్రీస్తు శకం 1200 సంవత్సరంలో వెలిసినట్లు చెబుతారు. 

►భీమవరం పట్టణంలో ప్రస్తుతం ఉన్న మోటుపల్లి వారి వీధిలో అమ్మవారి గరగలు భద్రపరుచుటకు నిర్మించిన పూరి గుడి ఉన్న ప్రాంతంలో వేప, రావి చెట్టు కలిసి ఉన్న చోట శ్రీమావుళ్లమ్మ అమ్మవారు వెలిశారని తెలుస్తోంది. 

►మామిడి చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వెలిసిన తల్లి కనుక శుభపద్రమైన మామిడి పేరుమీదగా మామిళ్ళ అమ్మగా... అనంతరం మావుళ్లమ్మగా నామాంతరం చెందిందని చరిత్ర చెబుతుంది. 

►చిన్న చిన్న ఊళ్ళ వారంతా కలిసి అమ్మవారిని గ్రామ దేవతగా కొలవడం వల్లే మావుళ్ల అమ్మ మావుళ్లమ్మగా నామాంతరం చెందారని మరి కొందరు అభిప్రాయం.

►ఫిబ్రవరి 15న అమ్మవారి ఆలయం వద్ద సుమారు 60 వేలమందికి అఖండ అన్నసమారాధన జరుగుతుంది.

మరిన్ని వార్తలు