కేన్సర్‌పై పోరుకు ఇంకో ఆయుధం!

16 Nov, 2017 01:09 IST|Sakshi

ప్రాణాంతక కేన్సర్‌ వ్యాధిపై పోరుకు శాస్త్రవేత్తలు సరికొత్త ఆయుధాన్ని సిద్ధం చేశారు. రోగ నిరోధక వ్యవస్థలోని టి–సెల్స్‌ మాదిరిగానే పనిచేసే కృత్రిమ కణాలను సృష్టించారు. ఇవి కాస్తా కేన్సర్‌ కణితులపై నేరుగా దాడి చేసి వాటిని నాశనం చేస్తాయని అంచనా. శరీరంలో ఏదైనా వైరస్‌లో చేరిందనుకోండి. టి–సెల్స్‌ వెంటనే ఆ వైరస్‌లు సోకిన కణాలపై దాడి మొదలుపెడతాయి. కానీ కేన్సర్‌ కణాలను మాత్రం ఇవి నాశనం చేయలేవు. అయితే ఇటీవలి కాలంలో ఈ కణాలకే కొత్త శక్తులు అందించి వాటిని కేన్సర్‌పై దాడికి వాడుకునేందుకు ఇమ్యూనో థెరపీ పేరుతో కొత్త చికిత్స పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. వీటివల్ల లాభాలు ఎలా ఉన్నప్పటికీ కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్విట్జర్లాండ్‌లోని టెక్నికల్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మన శరీరంలోని రీనల్‌ కణాలకు మూడు అదనపు భాగాలను చేర్చడం ద్వారా కేన్సర్‌పై దాడి చేసే కృత్రిమ కణాలను సృష్టించారు. ఈ మూడు భాగాల్లో ఒకటి కేన్సర్‌ కణాల ఆకారాన్ని గుర్తించి అందులోకి చొచ్చుకుపోయేలా ఒక ప్రత్యేక నిర్మాణం కలిగి ఉంటుంది. ఆ తరువాత ఈ కణంలోనే ఉండే యాంటీబాడీలు కేన్సర్‌ కణంలోకి చేరిపోతాయి.

ఆ కణం నాశనమైపోయేలా చేస్తాయి.  కేన్సర్‌కు ప్రస్తుతం అందుబాటులో ఉన్న కీమోథెరపీ చికిత్సలో అటు కేన్సర్‌ కణాలతోపాటు సాధారణ కణాలూ తీవ్రంగా నష్టపోతాయి. కృత్రిమ టి–సెల్స్‌తో ఈ సమస్య లేదు. ఆరోగ్యకరమైన కణాలకు ఏమాత్రం హాని జరగదు. అంతేకాకుండా అతితక్కువ కృత్రిమ టి–సెల్స్‌తో సమర్థమైన చికిత్స కల్పించడం వీలవుతుంది. ఈ కొత్త టి–సెల్స్‌ రోగనిరోధక వ్యవస్థకు ఏమాత్రం సంబంధం లేకుండా పనిచేస్తాయని, తద్వారా దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త ఫుస్సెనిగర్‌ తెలిపారు. ప్రస్తుతం తాము ఒక రకమైన కేన్సర్‌ కణాలతో అనుసంధానం కాగల కృత్రిమ టి–సెల్‌ను అభివృద్ధి చేశామని, మరిన్ని పరీక్షలు జరిపిన తరువాతగానీ దీన్ని వినియోగంలోకి తేలేమని ఆయన వివరించారు.

పరిపరిశోధన

మరిన్ని వార్తలు