మహాత్ముడు కరుణించిన మరో ప్రపంచం!

25 Dec, 2016 00:18 IST|Sakshi
మహాత్ముడు కరుణించిన మరో ప్రపంచం!

ఈ లోకాన్ని పరలోకంగా మార్చే ప్రయత్నాలు చరిత్రలో ఎన్నో జరిగాయి. అడపాదడపా కనిపించే మార్పులే తప్ప అవేవీ సఫలం కాలేదు. అయితే ఒక మహా ప్రయత్నాన్ని దేవుడే పూనుకొని రెండువేల ఏళ్ల క్రితం బెత్లెహేమునే ఆరంభ కేంద్రంగా చేశాడు. మరియ, యోసేపు అనే నిరుపేద జంటకు జగద్రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వరంగా బెత్లెహేములో జన్మించాడు. యేసు జననంతో ‘స్వార్థం’, ‘భయం’ అనే రెండు రెక్కలతో విస్తరిస్తున్న చీకటి రాజ్యం రెక్కలు విరిచినట్లయింది. ‘ప్రేమ’, ‘క్షమాపణ’ ప్రాతిపదికగా యేసు ఆరంభించిన వెలుగు రాజ్యపు పరలోక సౌధపు పునాదులు ఆ రోజున బెత్లెహేములోనే పడ్డాయి.

చీకటి శక్తులకు ప్రాతినిధ్యం వహిస్తున్న రోమా నిరంకుశ పాలకుల పునాదుల్ని యేసు స్థాపించిన ప్రేమ సామ్రాజ్యం నామరూపాలు లేకుండా చేసింది. ఈ లోకంలో యేసుది ముప్ఫై మూడున్నరేళ్ల జీవితం! సరళమైన పదజాలంతో సాగినా, లోతైన భావజాలం కలిగిన ఆయన బోధలు, బోధలకు భిన్నంగా లేని ఆయన ఆదర్శప్రాయమైన జీవితం – నాటి ప్రజలను ప్రభావితం చేశాయి. ఆయనకు లభ్యమవుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక యూదు సమాజం, రోమా ప్రభుత్వం కలిసి కుట్ర చేసి, అత్యంత కర్కశంగా ఆయనను సిలువ వేసి చంపాయి. అయితే ఆయన తిరిగి మూడవనాడు సజీవుడై పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఇదంతా కళ్లారా చూసిన ఆయన శిష్యులు 12 మంది,కొందరు అనుచరులు కలిసి ఈ ‘సువార్త’నూ, ఆయన బోధల్నీ ప్రపంచం నలుమూలలకూ చేరవేశారు.

నిత్యనూతనం ఆ సందేశం!
ఇండియాకు కూడా ఆయన శిష్యుల్లో ఒకరైన తోమా ఆ కాలంలోనే సువార్త తీసుకొచ్చాడు. యేసుక్రీస్తు జననాన్ని గుర్తు చేసే క్రిస్మస్‌లో ఎన్నటికీ వాడని నూతనత్వం ఇమిడి ఉంది. ఆ నూతనత్వానికి కారణం – ఎన్ని ప్రయత్నాలు చేసినా, ‘ఎన్నాళ్లు ఉతికినా’ బాగు కాని మానవనైజం! మనిషి మారనంత వరకూ క్రీస్తు బోధలు, జీవితం తాలూకు సుగంధం మళ్లీ మళ్లీ ప్రతి ఏడాదీ పరిమళిస్తూనే ఉంటుంది. స్వార్థం, కుట్రలు, పదవీకాంక్ష, బలహీనుడిపై బలవంతుని పెత్తనం, శ్రమ దోపిడీ, డబ్బే సరికొత్త దేవుడుగా మనుషుల పూజలనందుకొంటున్న వైనం – ఇవన్నీ యేసు ప్రేమ సందేశాన్ని మరింత కొత్తదిగా చేస్తున్నాయి. యేసు ప్రకటించిన యుద్ధంలో హింసకూ, మారణాయుధాలకూ, రక్తపాతానికీ తావు లేదు. దౌర్జన్యానికి అసలు విలువే లేదు. ఎవరైనా ఒక చెంప మీద కొడితే, మరో చెంప మీదా దెబ్బ వేయించుకునే దాసులే యేసు సైనికులు! పొరుగువారిని ప్రేమిస్తే సరిపోదన్నాడు ప్రభువు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం, చలితో ఉన్నవాడికి దుప్పట్లు కప్పి ఫొటోలు వేయించుకొని ప్రచారం చేసుకోవడంలో డొల్లతనాన్నీ, దౌర్భాగ్యాన్నీ యేసు ఎండగట్టాడు.

ఇది పేదల కోసం... ప్రేమ ఉద్యమం!
రెండువేల ఏళ్ల క్రితం ఈ ప్రేమ విప్లవం, క్షమాపణ ఉద్యమం బెత్లెహేములో ఆరంభమైంది. బెత్లెహేములో ఆరంభమైన ‘మార్పు ఉద్యమమే’ కాలక్రమంలో చరిత్ర గతినీ, మానవజీవిత పరిస్థితుల్నీ మార్చి రాజకీయ మార్పులు తెచ్చింది. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు పడింది కూడా క్రీస్తు ఆరంభించిన ప్రేమ ఉద్యమంతోనే! పేదల పక్షాన నిలబడి పోరాడి, ప్రాణాలర్పించిన వేలాది ఆత్మీయ సైనికులను క్రీస్తు ఉద్యమం లేవనెత్తింది. క్రీస్తు కలలు కన్న పరలోక రాజ్యస్థాపన, క్రీస్తు బోధల్ని ఈసారి క్రిస్మస్‌ మళ్లీ గుర్తు చేస్తోంది. దుర్మార్గం విస్తరించి, స్వార్థం పెచ్చరిల్లి మనిషి ఒంటరివాడైన ప్రతిసారీ ఆయనే మనకు ‘ఇమ్మానుయేలు’! అంటే ‘దేవుడే మనకు తోడు’ అని క్రిస్మస్‌ గుర్తు చేస్తుంది. విష్‌ యూ ఎ వెరీ హ్యాపీ క్రిస్మస్‌!
– రెవ. డాక్టర్‌ టి.ఎ. ప్రభుకిరణ్‌

మరిన్ని వార్తలు