చీమకు కొండైనా బరువు కాదు!

30 Nov, 2017 00:33 IST|Sakshi

ఒక ధనికుడికి ఆదివారం ఉదయం తీరిక దొరికింది. పైగది వసారాలో కూర్చొని సూర్యోదయాన్ని చూస్తూ తేనీరు సేవిస్తున్నాడు. వసారాలో ఒక చీమ ఈ వైపు నుంచి ఆ వైపుకు, తనకన్నా కొన్ని రెట్లు పెద్దదైన ఒక ఆకును మోసుకుని వెళ్లడం అతడి కంట పడింది. చీమ చాలా ప్రయాస పడుతోంది. ఆకును లాగలేకపోతోంది. మధ్యలో అడ్డంకులు, అవాంతరాలు వస్తున్నాయి. అయినా కూడా చీమ తన ప్రయత్నం మానలేదు! కొద్దికొద్దిగా ఆకును జరుపుకుంటూ వెళ్తోంది. ఒక చోట నేలపై చీమకు ఒక పగులు అడ్డొచ్చింది. పగులు మీదుగా ఆకును లాక్కుంటూ వెళ్తే కనుక చీమ ఆ పగులులో జారి పడిపోవడం ఖాయం. చీమనే చూస్తూ ఉన్నాడు ధనికుడు.

చీమ ఆకును అక్కడే వదిలేసి వెళ్లిపోతుందా? ఆకును మళ్లీ వెనక్కు తోసుకుపోతుందా అని ఆలోచిస్తున్నాడు. చీమ ఆ పగులు దగ్గరే కొద్దిసేపు తచ్చట్లాడింది. తర్వాత ఆకును మెల్లగా పగులు పైకి చేర్చింది. ఆ తర్వాత ఆకు పైకి ఎక్కి, పగులుకు అటు వైపు దిగింది. తిరిగి ఆకును లాక్కుంటూ వెళ్లడం ప్రారంభించింది. ఇదంతా ధనికుడికి అబ్బురంగా అనిపించింది. ఆ చిన్న జీవి తెలివికి అతడు ముగ్ధుడయ్యాడు. దేవుని సృష్టిలో అల్పమైనదిగా కనిపించే చీమలో ఎంత ఆలోచన! ప్రయాణం మొదలు పెట్టక ముందే మనం గమ్యం గురించి దిగులు పెట్టుకుంటాం.

‘అవాంతరాలు వస్తేనో..’ అని, వస్తాయో రావో తెలియని సమస్యల్ని ఊహించుకుంటాం. బాధ్యతల్ని బరువుగా భావిస్తాం. కుటుంబం ఒక బరువు. ఉద్యోగం ఒక బరువు. ఆస్తుల్ని కాపాడుకోవడం ఒక బరువు. నిజానికి వీటిలో ఏదీ బరువు కాదు. ఎక్కడ వీటిని పోగొట్టుకుంటామోనన్న భయమే మనకు బరువుగా అనిపిస్తుంది. ప్రయాణం ప్రారంభం కావడానికి ముందే గమ్యం గురించి ఆలోచించదు కాబట్టే చీమకు కొండైనా బరువు కాదు. కొండ కదిలిందా లేదా అన్నదే ముఖ్యం. కొండ కదులుతుందా లేదా అన్నది ముఖ్యం కాదు.

మరిన్ని వార్తలు