పిల్లల్లో యాంటీబయాటిక్స్‌తో జువెనైల్ ఆర్థరైటిస్ ఎక్కువ!

18 Aug, 2015 03:44 IST|Sakshi

కొత్త పరిశోధన
పిల్లల్లో యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వల్ల చిన్నతనంలోనే వాళ్లకు ఆర్థరైటిస్ (ఎముకలు పెళుసుబారి తేలిగ్గా విరిగిపోయే జబ్బు) వస్తుందని తేలింది. చిన్న చిన్న ఇన్ఫెక్షన్లకు సైతం యాంటీబయాటిక్స్ వాడే పిల్లల్లో జువెనైల్ ఆర్థరైటిస్ (పిల్లల్లో వచ్చే ఆర్థరైటిస్) చాలా ఎక్కువని తెలిసింది. ‘‘ఒక ఏడాది కాలంలో తరచూ ఏదో ఇన్ఫెక్షన్ల వల్ల యాంటీబయాటిక్స్ చాలాసార్లు వాడిన పిల్లలను పరిశీలించినప్పుడు ఈ వాస్తవం నిరూపితమైంది’’ అంటున్నారు నిపుణులు. అది ఏ యాంటీబయాటిక్ అయినప్పటికీ దాన్ని వాడని పిల్లలతో పోలిస్తే యాంటీబయాటిక్స్ వాడే పిల్లల్లో జువెనైల్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు రెట్టింపు అని తేలింది.

సాధారణంగా పిల్లల్లో శ్వాసనాళం ఇన్ఫెక్షన్లు (అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్) వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఇస్తుంటారు. ఇలాంటి పిల్లలను పరిశీలించినప్పుడు వారిలో జువెనైల్ ఆర్థరైటిస్ కూడా ఎక్కువే అని తేలింది. ఇక్కడో మంచి విషయం ఏమిటంటే.. యాంటీఫంగల్ లేదా యాంటివైరల్ డ్రగ్స్ వాడినప్పుడు మాత్రం వాటి వల్ల జువెనైల్ ఆర్థరైటిస్ పెరిగిన దాఖలాలు కనిపించలేదు. కేవలం యాంటీబయాటిక్స్ వల్లనే జువెనైల్ ఆర్థరైటిస్ అనే అనర్థం రావడం పరిశోధకులు గమనించారు. అందుకే పిల్లల్లో యాంటీబయాటిక్స్ వాడే సమయంలో చాలా విచక్షణతో వాడాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ ‘పీడియాట్రిక్స్’ అనే మెడికల్ జర్నల్‌లో పొందుపరిచారు ఈ పరిశోధనకర్తలు.

మరిన్ని వార్తలు