కేసుల అంతుచూసే లేడీ డిటెక్టివ్...

23 May, 2016 22:47 IST|Sakshi
కేసుల అంతుచూసే లేడీ డిటెక్టివ్...

బాండ్


‘ఒక హత్య కేసులో ఫలానావాడు నిందితుడు అని నాకు తెలుసు. కాని ఆధారాలు కావాలి. అందుకని అతని ఇంటిలో పని మనిషిగా చేరాను. ఇది చాలా ప్రమాదకరమైన పనే. కాని అనుమానం రాకుండా పని చేస్తూ ఆధారాలన్ని సేకరించాక అతణ్ణి అరెస్ట్ చేయించాను’ అంటుంది రజని పండిట్. ముంబైలో ఆమెను అందరూ ‘లేడీ డిటెక్టివ్’ అని అంటారు. కొందరు క్లయింట్లు ‘మా దుర్గ’ అని దుర్గాదేవితో పోలుస్తారు. మరి కొందరు ‘లేడీ జేమ్స్‌బాండ్’ అంటారు. ఎవరు ఎలా పిలిచినా నేను మాత్రం డిటెక్టివ్‌నే అంటుంది రజని.

 
భారతదేశంలో డిటెక్టివ్‌ల ప్రాబల్యం ఇటీవల పెరిగింది. ఇంతకు పూర్వం మిలట్రీ నుంచి వచ్చిన మాజీ సైనికోద్యోగులు అదీ మగవాళ్లు మాత్రమే డిటెక్టివ్‌లుగా పని చేసేవారు. కాని 1983లో ముంబై యూనివర్సిటీలో చదువుతున్నప్పటి నుంచి రజని డిటెక్టివ్‌గా మారింది. ‘చదువుకు దూరమై డ్రగ్స్‌కు అలవాటు పడిన ఒకమ్మాయిని సాక్ష్యాధారాలతో సహా ఆమె తల్లిదండ్రులకు అప్పగించాను. అప్పటి నుంచి నన్ను అందరూ డిటెక్టివ్ పనులకు ప్రోత్సహించారు’ అంటుంది రజని.

 
సాధారణంగా మగవాళ్లకు అనుకూలమైన ఈ పని ఆడవారికి ఇంకా అనుకూలమైనది రజని అభిప్రాయం. ఆడవాళ్లు సులభంగా ఇరుగుపొరుగు వారితో మాట కలపగలరు. ఎదుటివారు కూడా కావలసిన సమాచారం సులభంగా ఇచ్చేస్తారు అంటుంది రజని. అయితే ఆమెకు ఎక్కువగా వచ్చే కేసులు మాత్రం భార్య లేదా భర్త మీద అనుమానం కలిగి దానిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోమని కోరేవే. ‘నా జీవితంలో చాలా కేసులు అలాంటివి చేశాను. చేస్తున్నాను. పెళ్లయ్యాక ఇంకో ఎఫైర్ కోసం వెంపర్లాడేవాళ్లను చూస్తే బాధేస్తుంది. ఇంత వెంపర్లాట ఉన్నవాళ్లు పెళ్లి చేసుకోవడం ఎందుకు? అంటాను’ అందామె. అలాగే ఆఫీసుకు బ్లూ షర్ట్‌తో బయలుదేరి మళ్లీ మనసు మార్చుకుని తెల్లషర్ట్ వేసుకున్నా సరే అనుమానించే భార్యలు కూడా ఉంటారని అంటోందామె.

 
చాలామంది ఆడవాళ్లు ఒంటరిగా మిగిలినప్పుడు నా డిటెక్టివ్ పనితో వారికి బాసటగా నిలిచాను. అందుకు వారు చాలా కృతజ్ఞతగా ఉంటారు. ఆ ఆనందం చాలు అంటుంది ముంబై డిటెక్టివ్ రజని పండిట్.

 

మరిన్ని వార్తలు