పుడకా? పురుగా? పుడకా?

30 Jan, 2018 00:14 IST|Sakshi
అనుష్క

సందేహం 

సినిమా కన్నా ముందు.. ‘భాగమతి’ మూవీ పోస్టర్లు విడుదలైనప్పుడు, చాలామందికి మొదట అర్థం కాలేదు.. అనుష్క ముక్కుపై ఉన్నదేమిటో!! ఎవరో పుడక అన్నారు. ఇంకెవరో, పురుగై ఉండొచ్చు అనుకున్నారు. పురుగెలా అవుతుందని ఇంకొందరు. క్యారెక్టర్‌ని బట్టి పుడకో, పురుగో అయి ఉంటుందిలెమ్మని సరిపెట్టుకున్నారు అప్పటికి. సినిమా రిలీజ్‌ అయింది. అనుష్క ముక్కుపై ఉన్నది పుడక అని తేలిపోయింది. పోస్టర్‌ని దీక్షగా చూసినవాళ్లు రిలీజ్‌కంటే ముందే అది పుడక అని గుర్తించే ఉంటారు. అయినా పురుగులను ఆభరణాలుగా ధరించేవారు ఎక్కడైనా ఉంటారా? ఉంటారు. ఇప్పుడు ఉన్నారో లేదో కానీ, ఒకప్పుడు ఉండేవారు.

ఈజిప్షియన్‌లు యుద్ధానికి వెళ్లే ముందు జీరంగి పురుగులను మెడలో ధరించి వెళ్లేవాళ్లు. అలా చేస్తే అతీంద్రియ శక్తులు ఆవహించి విజయం లభిస్తుందని వారి నమ్మకం. జీరంగికి నొప్పి కలక్కుండా ఒడుపుగా మెడలోని హారానికి దానిని తగిలించేవారట. ఈ ఆచారం ప్రాచీన మెక్సికన్‌లలో కూడా ఉండేది. అయితే వాళ్లు బొద్దింకలను ధరించేవారు. మయన్‌ కల్చర్‌లో బంగారు ఆభరణాలకు జీవంతో ఉన్న పురుగుల్ని కలిపి ధరించడం అనే సంప్రదాయం ఉన్నట్లు చరిత్రలో ఉంది. అదృష్టం కలిసిరావడానికి, దుష్టశక్తులు దూరంగా వెళ్లడానికి ఇలా చేసేవారట.   

మరిన్ని వార్తలు