లీగల్‌ వార్నింగ్‌

26 Jun, 2018 00:03 IST|Sakshi

బజారులో చెత్త ఎందుకు వేశావ్‌ అనిప్రశ్నించిన అనుష్క శర్మకు, నన్ను లైంగికంగావేధించాడు అని తోటి నటుడు అలీ జఫర్‌  మీద  ఆరోపించిన పాకిస్థాన్‌ నటి మీషా షఫీకు లీగల్‌ నోటీసులు సిద్ధంగా ఉన్నాయి.

గీతాంజలి ఎలిజబెత్‌కు న్యూమరాలజీ తెలుసు. ... ‘అండ్‌ గాడ్‌ స్పోక్‌ ఇన్‌ నంబర్స్‌’  పేరుతో న్యూమరాలజీని వివరిస్తూ ఆమె పుస్తకం కూడా రాశారు. ఆమె పేరులోని ఇంగ్లిష్‌ స్పెలింగ్‌ ‘గీతా’లో ‘టీ’లు ఉంటాయి. మరో ‘టీ’ను జత చేయడం వల్ల మంచి జరుగుతుందని న్యూమరలాజికల్‌గా ఆమె భావించి ఉండవచ్చు. అలాగే ఆమె కుమారుడు అర్హాన్‌ సింగ్‌ పేరులో కూడా ఒక హెచ్‌కు బదులు రెండు హెచ్‌లు కనిపిస్తాయి. అలా చేస్తే కుమారుడి భవిష్యత్తు బాగుంటుందనీ ఆమె అనుకుని ఉండొచ్చు.ఏ నంబరు ప్రవర్తన ఎలా ఉంటుందో గణించే గీతాంజలికి ‘జూన్‌ 18’వ తేదీ మాత్రం పెద్ద కుదుపునే ఇచ్చిందని చెప్పాలి.ఆ రోజు క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఒక వీడియో ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. అది గీతాంజలి కుమారుడు అర్హాన్‌ సింగ్‌కు సంబంధించినది. అందులో కోహ్లీ భార్య, స్టార్‌ హీరోయిన్‌ అయిన అనుష్క శర్మ అర్హాన్‌ సింగ్‌ను మందలించింది.ముంబైలోని ఒక రోడ్డు మీద అర్హాన్‌ కారును సమీపిస్తూ కారులో ఉన్న అనుష్క అతడిని మందలించింది.

‘రోడ్డు మీద ప్లాస్టిక్‌ బాటిల్‌ని ఎందుకు పడేశావ్‌? ఏదైనా పారేయాలనుకుంటే డస్ట్‌బిన్‌ను ఉపయోగించు’ అని ఆమె గట్టిగా అనడం ఆ వీడియోలో ఉంది.విరాట్‌ కోహ్లీ ఆ వీడియోను పోస్ట్‌ చేస్తూ ‘లగ్జరీ కార్లలో ప్రయాణిస్తారుగానీ వీళ్ల బుర్రలు ఎలా ఉన్నాయో చూడండి. ఇలాంటివారు దేశాన్ని ఎలా శుభ్రంగా ఉంచుతారు’ అని కామెంట్‌ చేశాడు.భార్య ఎవరినైతే తిడుతోందో అతని ముఖం, అంటే అర్హాన్‌ ముఖం బ్లర్‌ చేయకుండా వీడియోను యథాతథంగా పోస్ట్‌ చేశాడుఆ రోజు నుంచి ఈ చెత్త గొడవ రాజుకోవడం మొదలైంది.ట్విట్టర్‌లో విరాట్‌ వీడియోను సమర్థించినవారూ ఉన్నారు, పెద్ద బడాయి అన్నట్టు చిరాకు పడినవారూ ఉన్నారు. కాని రెండో రోజుకు అనుష్క శర్మకు అర్హాన్‌ సింగ్‌ తిరుగు సమాధానం చెప్పడం వార్త అయి కూచుంది.

ఏది శుభ్రత?
దేశంలో ‘స్వచ్ఛ్‌ భారత్‌’ ఉద్యమం నడుస్తోంది. చెత్తను సరిగ్గా వేయడం గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యం బుర్ర మీద పని చేస్తుండగా అనుష్క శర్మ తాను ప్రయాణిస్తున్న దారిలో ఒక కారులో నుంచి ఒక వ్యక్తి ప్లాస్టిక్‌ బాటిల్‌ పడేస్తే కోపం తెచ్చుకోవడం సహజమైన ప్రతిస్పందన కావచ్చు. గొడవ అంతటితో ముగియాల్సిందే. కాని అనుష్క తిట్లకు గురైన అర్హాన్‌ సింగ్‌ ట్విట్టర్‌లో ఘాటుగా ప్రతిస్పందించాడు.‘శుభ్రత చాలా రకాలుగా ఉంటుంది. అందులో భాష శుభ్రత కూడా ఒకటి. నేను కారులో నుంచి పడేసిన చెత్త కంటే నీ నోటి నుంచి వచ్చిన చెత్త ఎక్కువ’ అని అతను అన్నాడు.ఇక్కడే అర్హాన్‌ సింగ్‌ గీతాంజలి కూడా తన కుమారునికి మద్దతునిస్తూ అనుష్కను తప్పు పట్టారు.‘నా కుమారుడు చేసింది తప్పే అవ్వొచ్చు గాక. కాని దానిని చెప్పే పద్ధతి ఇదేనా? కొంచెం మంచి భాషతో చెప్పి ఉంటే తక్కువస్థాయి నటి అయి ఉండేదా? అయినా తీవ్ర మనస్తత్వాలు ఉండే ఆమె లక్షలాది అభిమానుల మధ్య నా కుమారుడి ముఖం కవర్‌ చేయకుండా అతడి ప్రైవసీని భంగపరిచింది. నా కుమారుడి మాన ప్రాణాలకు ప్రమాదం తెచ్చి పెట్టింది’ అంటూ ఆమె కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యాఖ్యను పోస్ట్‌ చేశారు. అంతేకాదు ‘నువ్వు అంత పరుషంగా మాట్లాడినా దేవుడి దయ వల్ల నా కుమారుడు ఏమీ అనలేదు. ఎందుకంటే అతడి పెంపకం మంచిది’ అని కూడా ఆమె అన్నారు.

లీగల్‌ నోటీసులు
అయితే దీని తర్వాత అనుష్క లేదా విరాట్‌ నుంచి ఎటువంటి కవ్వింపు లేకపోయినా ఆ తల్లికొడుకులు మాత్రం వారికి లీగల్‌ నోటీసులు పంపారు. ‘అందులో ఏముందో ఇప్పుడే నేను బయటకు వెల్లడించదలచుకోలేదు’ అని అర్హాన్‌ సింగ్‌ తల్లి గీతాంజలి చెప్పారు. ‘గుట్టుగా బతుకుతున్న మమ్మల్ని... అనుష్కవిరాట్‌లు వీధిలో పడేశారు’ అన్న కోపం ఆ తల్లికొడుకుల్లో ఉంది. దానికి ప్రతీకారమే ఈ లీగల్‌ నోటీసులు అనుకోవచ్చు. కాని సమస్య అది కాదు. మంచి చెప్పే ప్రయత్నానికి ఇంత ప్రతిస్పందన అవసరమా అని?

ఎలా చెప్పాలి?
అర్హాన్‌ సింగ్‌ను అనుష్క శర్మ మందలిస్తున్న వీడియోను చూస్తే అనుష్క నైతిక ఆధిపత్యం తీసుకున్నట్టు కనిపిస్తుందని నెటిజన్లు అంటున్నారు. బాటిల్‌ పడేసిన అర్హాన్‌ అనుష్క ప్రతిస్పందనకు చేష్టలుడిగి కూర్చుని ఉండగా తిట్టే హక్కు తనకు ఉన్నట్టు అనుష్క అతడి పట్ల వ్యవహరించడం కనిపిస్తుంది. భర్త పక్కన ఉండగా ఆమె కొంచెం అతిశయం ఫీలై ఉండవచ్చు. కాని ఎవరినైనా సరిచేసే క్రమంలో స్త్రీలు ముఖ్యంగా తల్లులు గాని భార్యలు గాని ఇంటి ఆడవాళ్లు గాని గట్టిగానే అరవడం మనకు తెలుసు. పిల్లలను సరిచేసే క్రమంలో తల్లి, భర్తను సరి చేసే క్రమంలో భార్య గట్టిగా మాట్లాడటం ఉంది. అనుష్క కోపాన్ని కూడా అలా అర్థం చేసుకోవాలని కొందరు సోషల్‌ మీడియాలో వ్యాఖ్యానిస్తే నిశ్శబ్దంగా ఉండి ఏ పక్షమూ మాట్లాడనివారూ కనిపిస్తున్నారు.

ఏకంగా వంద కోట్ల దావా
36 ఏళ్ల పాకిస్థాన్‌ నటి మీషా షఫీ మన బాలీవుడ్‌ సినిమాలలో కూడా నటించింది. ఫర్హాన్‌ అఖ్తర్‌ ‘భాగ్‌ మిల్కా భాగ్‌’లో ఆమెను చూడవచ్చు. ఈమె ఏప్రిల్‌ 19, 2018న తన సహ నటుడు అలీ జఫర్‌ మీద ట్విట్టర్‌లో లైంగిక ఆరోపణలు చేసింది. ఇలాంటి సందర్భాలలో స్త్రీలందరూ కలిసికట్టుగా గొంతెత్తాలని కూడా ఆమె కోరింది. అయితే పాకిస్థాన్‌లో పెద్ద స్టార్‌ అయిన అలీ జఫర్‌ ప్రతినిధులు వెంటనే ఆమెను సంప్రదించి ట్విట్టర్‌లో క్షమాపణలు చెప్పి ఆ పోస్ట్‌ తీసేయమని, లేకుంటే దావా వేస్తామని చెప్పారు. అయితే మీషా వెనక్కు తగ్గలేదు. ‘ఇలా ఒకటి కంటే ఎక్కువసార్లే అలీ జఫర్‌ నన్ను ఇబ్బంది పెట్టాడు’ అని మళ్లీ పోస్ట్‌ చేసింది. ‘నేను నాలా ఆత్మవిశ్వాసంతో లొంగక ఉండటం వల్లే ఇలాంటి దాడి’ అని ఆమె అంది. దాంతో అలీ జఫర్‌ ఏకంగా వంద కోట్ల రూపాయలకు ఆమె మీద పరువు నష్టం దావా వేశాడు. ఇవన్నీ ఆధారాలు లేని ఆరోపణలు అని అతడి వాదన.
 

దావాలతో నిరోధాలు
సాధారణంగా పురుషుల మధ్య గొడవలు లీగల్‌ సమస్యలుగా మారుతుంటాయి. అయితే ఇటీవలి కాలంలో స్త్రీలను నిరోధించడానికి కూడా లీగల్‌ వ్యవస్థను ఒక ఆయుధంగా ఉపయోగించడం చూస్తున్నాం. ‘పెళ్లికి ముందు ఆడపిల్లలు సెక్స్‌లో పాల్గొనదలిస్తే సురక్షితంగా పాల్గొనాల్సి ఉంటుంది’ అని ఎయిడ్స్‌ నేపధ్యంలో ఖుష్‌బూ అన్న మాటలకు ఆమెపై ఎన్ని కేసులు పెట్టాలో అన్ని కేసులు పెట్టారు. ‘నేను శబరిమలను సందర్శించాను’ అని కన్నడ నటి జయమాల అన్నందుకు ఆమెపై కేసులు నమోదయ్యాయి. ‘అతడు నాకు సన్నిహితుడు’ అని ప్రకటించిన కారణాన తన పరువు బజారులో పడేసిందంటూ కంగనా రనౌత్‌పై హృతిక్‌ రోషన్, అతడి తండ్రి రాకేష్‌ రోషన్‌ లీగల్‌ నోటీసుల హెచ్చరికలకు దిగారు. డేరా బాబా సన్నిహితురాలు హనిప్రీత్‌ ఇన్‌సాన్‌పై ఆమె ఎన్నో అసాంఘిక కార్యకలాపాలు చేసి ఉండవచ్చు అని వ్యాఖ్యానించిన నటి రాఖీ సావంత్‌పై హనిప్రీత్‌ తల్లి ఐదు కోట్ల పరువు నష్టం దావా వేస్తానని బెదిరించింది. మలయాళంలో చిన్నపాటతో దేశ గుర్తింపు పొందిన ప్రియా వారియర్‌ను ఆ పాటలో నటించినందుకుగాను చట్టపరమైన చర్యల కోసం ప్రయత్నాలు జరిగాయి. చివరకు ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇటీవల ఇండస్ట్రీ పోకడలపై పదే పదే వ్యాఖ్యానించిన తెలుగు నటి శ్రీరెడ్డికి కూడా లీగల్‌ నోటీసుల వార్నింగులు అందాయి. తనపై లైంగిక్‌ ఆరోపణలు చేసిన ఒక జూనియర్‌ ఆర్టిస్టుపై యాభై లక్షలకు పరువు నష్టం దావా వేస్తానని సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు