నిరంతరం... నిశ్చింతగా..!

12 Feb, 2015 23:16 IST|Sakshi
నిరంతరం... నిశ్చింతగా..!

చింత లేని వ్యక్తి ఈ లోకంలో ఉండడు. ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఏదో ఒక విషయానికి చింతిస్తూ ఉంటారు. చింతలు మనల్ని మానసికంగా దిగజార్చుతాయి. మన జీవితంలో అధిక భాగం చింతించడానికే సరిపోతుంది. నిజానికి మన అనారోగ్యానికి ఈ చింతలే కారణం. చింతలకు కారణం అవిశ్వాసం!

అయితే దేవుడిపై విశ్వాసం ఉన్నవారి దరికి ఏ చింతా చేరలేదని మనం గ్రహించాలి. విశ్వాసం దేవునికి అత్యంత ప్రీతికరమైన గుణం. విశ్వాసం లేకుండా భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడం అసాధ్యం. దేవునిపై విశ్వాసం గలవారు దేవుని కోసం నిరీక్షిస్తారు. అంతేకాదు, విశ్వాసంలో సానుకూల అలోచనా ధోరణి మనల్ని నడిపిస్తుంది. అందుకే విశ్వాసి తలపెట్టిన కార్యాలన్నీ సఫలం అవుతాయి. ఇందుకు భిన్నంగా అవిశ్వాసి వ్యతిరేక ఆలోచనా ధోరణితో, అపసవ్య ప్రవృత్తితో ఉంటాడు.

అందుకే అతడు ప్రతి క్షణం సమస్యలతో, సందేహాలతో, చింతలతో సతమతం అవుతూ ఉంటాడు. సానుకూలతా? వ్యతిరేకతా? మనం ఎటువైపు ఉండాలన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. మనం దేని వైపు ఉంటే, దానికి తగిన ఫలితమే మనకు చేకూరుతుంది. ‘నమ్మడం నీ వల్ల సాధ్యం అయితే సమస్తం నీకు సాధ్యమే’ అంటారు ఆధ్యాత్మిక గురువులు. భగవంతునిపై నమ్మకం ఉంచినప్పుడు జీవితంలో అద్భుతాలు జరిగిపోతుంటాయి. కనుక వ్యతిరేక దిశలో ఆలోచించండం మాని సవ్యదిశలో, ఆశావహ దృక్పథంలో ప్రతి ఒక్కరం జీవనయానం సాగించాలి.

సృష్టికర్త అయిన దైవాన్ని మనం హృదయపూర్వకంగా ప్రేమించి, విశ్వసించినప్పుడు మన భారం మొత్తం ఆయన మీద మోపినప్పుడు మనం ఏ విషయానికీ చింతించనవసరం లేదు. దేవునికి ఇష్టులముగా నిశ్చింతగా నిరంతరం జీవించవచ్చు.
 - యస్.విజయ భాస్కర్
 
 

మరిన్ని వార్తలు