ఆటలా వ్యాయామం...

14 Jul, 2018 01:13 IST|Sakshi

ఆడుతు పాడుతు పనిచేస్తూంటే అలుపు సొలుపు తెలియదట. మరి ఇది కేవలం పని విషయానికి మాత్రమేనా? వ్యాయామానికి కూడా వర్తిస్తుందా? అయోవా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు  వెబ్‌ ఆధారిత ఆటతో ఈ అంశాన్ని పరీక్షకు పెట్టారు. స్మార్ట్‌ఫోన్‌తోపాటు ఫిట్‌బిట్‌ గాడ్జెట్‌ ఉన్న వారెవరైనా ఈ గేమ్‌ ఆడవచ్చు. బద్దకిష్టులను కూడా వ్యాయామం చేసేలా చేయవచ్చునని వీరు అంటున్నారు. శరీరానికి కొద్దోగొప్పో పని కల్పించకపోతే ఊబకాయం వచ్చేసి మధుమేహం మొదలుకొని కేన్సర్ల వరకూ అనేక వ్యాధులు సోకే ప్రమాదం ఉందన్నది తెలిసిన విషయమే.

వెబ్‌ గేమ్‌ ద్వారా వ్యాయామాన్ని చేసేందుకు చాలామంది ఆసక్తి చూపారని.. తొలి పైలెట్‌ పరీక్షల ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని లూకాస్‌ కార్‌ అనే శాస్త్రవేత్త చెప్పారు. ఈ ఆట ఆడటం మొదలుపెట్టిన తరువాత ఒక్కో వ్యక్తి సగటున 2200 అడుగులు ఎక్కువ వేశాడని ఇది ఒక మైలు నడకకు సమానమని చెప్పారు. మ్యాప్‌ట్రెక్‌ పేరున్న ఈ గేమ్‌.. వినియోగదారులకు తరచూ చిన్న చిన్న సవాళ్లు విసురుతూ ఎక్కువ శ్రమ పడేలా చేస్తుందని, ఇరుగుపొరుగు వారి వ్యాయామం తీరుతెన్నులను కూడా కలిపడం ద్వారా గేమ్‌ మరింత ఆసక్తికరంగా మారిందని కార్‌ వివరించారు. వారం రోజులు ఒక యూనిట్‌గా చేసి నడకకు సంబంధించిన సవాళ్లు విసిరి ఫలితాలను విశ్లేషించడం ద్వారా తాము ఈగేమ్‌ సత్ఫలితాలిస్తున్నట్లు నిర్ధారించినట్లు చెప్పారు.  

మరిన్ని వార్తలు