రైతు కుటుంబానికి కూలి పనులే గతా?

1 May, 2018 11:56 IST|Sakshi
రమేష్‌ చిత్రపటంతో భార్య అంజమ్మ, కుమార్తె కల్పన, కుమారుడు అనిల్, నాయనమ్మ కోటమ్మ

నివాళి 

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడుకు చెందిన కోనంకి రమేష్‌ తనకున్న నాలుగు ఎకరాలతో పాటు మరో ఆరు ఎకరాలను కౌలుకు తీసుకొని పత్తి, మిరప, తమలపాకు తోటలను సాగు చేసేవాడు. గిట్టుబాటు ధరలేక అప్పులపాలయ్యాడు. అప్పు రూ. 6 లక్షలకు పెరిగింది. రుణ మాఫీ కాలేదు. దీంతో 4 ఎకరాలను అమ్మి కొంత అప్పు తీర్చాడు. మళ్లీ ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకుని పంట వేస్తే అప్పు మరో రూ. 4 లక్షలు పెరిగింది. అప్పుల వాళ్ల ఒత్తిడితో కౌలు రైతు రమేష్‌ గతేడాది మార్చి 15న తన పొలంలోనే పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

రమేష్‌ భార్య అంజమ్మ, కుమార్తె కల్పన(ఇంటర్‌), కుమారుడు అనిల్‌కుమార్‌ (8వ తరగతి) నిస్సహాయులుగా మిగిలారు. భర్త ఆత్మహత్య చేసుకున్న తర్వాత అంజమ్మ కూలి పనులు చేస్తూ పిల్లలతో పాటు రమేష్‌ నాయనమ్మ కోటమ్మనూ పోషిస్తున్నారు. ఉంటున్న ఇల్లు కూడా తాకట్టులో వుంది. మొత్తం అప్పు రూ. 13 లక్షలకు చేరింది. ఏమి చేయాలో అర్థంకావడం లేదని అంజమ్మ కుమిలిపోతున్నారు. ప్రభుత్వం ఆదుకొని ఎక్స్‌గ్రేషియా ఇవ్వకపోతే.. వచ్చే ఏడాది నుంచి పిల్లల చదువులు అపేసి తనతో పాటు కూలి పనులకు తీసుకువెళ్లడం తప్ప మరో దారి లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని నమ్మి మోసపోయామన్నారు. 
ఓ. వెంకట్రామిరెడ్డి, అమరావతి బ్యూరో  

మరిన్ని వార్తలు