ప్రేమికులకు ప్రొ'టెక్‌'షన్‌

12 Mar, 2018 01:45 IST|Sakshi

మళ్లీ ఒక పరువు హత్య! అగ్రకులానికి చెందిన అమ్మాయి దళితుడిని ప్రేమించి, కుటుంబాన్ని ఎదురించి పెళ్లి చేసుకుంది. తక్కువ కులం వ్యక్తిని పెళ్లి చేసుకొని కుటుంబ పరువు గంగలో కలిపిందని అగ్రహోదగ్రులయ్యారు కుటుంబసభ్యులు. అమ్మాయిని వెదికి, నయానా, భయానా  ఇంటికి తీసుకొచ్చి, మూడో కంటికి తెలియకుండా అమ్మాయిని చంపేసి, అబ్బాయి మీద కిడ్నాప్‌ కేస్‌ పెట్టారు.

తమిళనాడులో జరిగిన ఈ సంఘటన గురించి  తమిళ పేపర్లో వార్తగా వచ్చింది. ఇలాంటివి ఈ మధ్య బాగా వింటోంది చెన్నైకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ వసుమతి వాసంతి. కుల వివక్ష మీద పెరియార్‌ రామస్వామి యుద్ధం ప్రకటించిన నేల మీద పరువు హత్యలా? ఇవి అనాగరికమని, ఇలాంటి హత్యలకు పాల్పడిన వాళ్లకు తగిన శిక్ష ఉంటుందని 2006లో అపెక్స్‌ కోర్ట్‌ తీర్పు కూడా ఇచ్చింది.

అయినా ఆగలేదే?! 2013 నుంచి 2017 వరకు నాలుగేళ్లలో 187 పరువు హత్యలు జరిగాయని ఓ రిపోర్ట్‌ చెప్తోంది. అన్యాయం! ప్రేమకు కులం ఏంటి? కులం పేరుతో వాళ్లను విడదీయడమే కాకుండా చంపడం ఏమిటి? వసుమతి మనసు కలత చెందింది. ఏదైనా చేయాలి... సహపంక్తి భోజనాల ద్వారా కాదు, కులాంతర వివాహాల ద్వారా కులం నశిస్తుంది అని చెప్పాడు అంబేద్కర్‌. ప్రేమ ఆ పని చేస్తోంది.

కానీ సమాజం అడ్డుకుంటోంది. తను అలాంటి ప్రేమికులకు రక్షణ కల్పించాలి. ఏం చేయాలి? ఆలోచించింది. ఈ కాలంలో దేన్నయినా మేడ్‌  ఈజీ చెస్తున్నవి యాప్సే. గడప దాటకుండానే ప్రపంచాన్ని ఇంట్లో పెడుతున్నాయి. ఈ ప్రేమ పక్షులకు అలాంటి సురక్షితమైన యాప్‌ గూడును అల్లేస్తే? యెస్‌.. తట్టింది ఆమెకు. ఆపరేషన్‌లో మునిగింది.

పెళ్లి చేస్తారు.. ఇల్లూ చూస్తారు!
వసుమతి డెవలప్‌ చేసిన యాప్‌ పేరు.. కాదల్‌ అరణ్‌. అంటే ప్రొటెక్టర్‌ ఆఫ్‌ లవ్‌. ఇదెలా పనిచేస్తుందంటే.. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు వలంటీర్స్‌ ఉంటారు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోగానే యూజర్‌ తన కాంటాక్ట్‌ వివరాలన్నీ అందులో పొందుపర్చాలి. అలాగే ఆ జంట ఎలాంటి సహాయం కోరుకునుందో కూడా అందులో నమోదు చేయాలి.

ఆ సమాచారాన్ని అనుసరించి వలంటీర్స్‌ ఆ జంటకు ఫోన్‌ చేస్తారు. వాళ్లున్న పరిస్థితిని బట్టి వారికి అవసరమైన న్యాయ సంబంధమైన, పోలీసుల సహకారం,షెల్టర్‌.. అంటే అద్దెకు ఇల్లు చూపెట్టడం వంటివి సహాయాన్ని అందిస్తారు. ఇవన్నీ కాక ఎమోషనల్‌ సపోర్ట్‌ ఇవ్వడంలోని ముందుంటారు. ‘‘తమిళనాడులోని దాదాపు అన్ని జిల్లాల్లో వలంటీర్లు ఉన్నారు. ఇలా కులాంతర ప్రేమ వివాహాలు చేసుకున్న జంటలకు స్వచ్ఛందంగా సహాయం అందించాల నుకునే వాళ్లు మా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావచ్చు. వాళ్లకు ట్రైనింగ్‌ కూడా ఇస్తాం’’ అని చెబుతున్నారు వసుమతి వాసంతి.

ప్రేమకు కులం ఏంటి? కులం పేరుతో ప్రేమికులను   విడదీయడమే కాక చంపిపారేయడం ఏంటి? వసుమతి మనసు కలత చెందింది. ఆ కలతలోంచి వచ్చిన ఆలోచనే..
కాదల్‌ అరణ్‌ యాప్‌!

మరిన్ని వార్తలు