ముండకోపనిషత్తు ప్రాణస్వరూపం పరమాత్మే!

18 Jun, 2016 22:39 IST|Sakshi
ముండకోపనిషత్తు ప్రాణస్వరూపం పరమాత్మే!

భారతీయ వేదాంతానికి మణిదీపాల వంటి  మంత్రాలు తృతీయ ముండకంలో ఉన్నాయి. ఒక చెట్టు మీద స్నేహంతో కలసి వుండే రెండు పక్షులు ఉన్నాయి. వాటిలో ఒకటి ఆ పిప్పలి చెట్టు పళ్లు తింటోంది. మరొక పక్షి ఏమీ తిన కుండా చూస్తూ కూర్చుంది. మొత్తం వేదాంతం రెండు పక్షుల రూపంలో సూక్ష్మంగా చెప్పబడింది. ఒక పక్షి జీవాత్మ. అది ఐహిక దృష్టితో దైవచింతన లేని మోహంతో దుఃఖిస్తోంది. దాని పక్కనే అదే చెట్టు మీద ఉన్న రెండోపక్షి పరమాత్మ. మహిమాన్వితమైన పరమాత్మను చూస్తూ జీవాత్మ దుః ఖాన్ని పోగొట్టుకుంటోంది. పరమాత్మను దర్శించిన విద్వాంసుడు పాపపుణ్యాలకు అతీతుడై అతణ్ణి చేరుకుంటున్నాడు. అన్ని ప్రాణులలోని ప్రాణస్వరూపం పరమాత్మే. దీనిని తెలుసుకున్నవాడు పండితుడై మౌనంగా ఉంటున్నాడు. నిరంతరం ఆత్మతత్త్వంలో క్రీడిస్తూ, ఆనందిస్తూ క్రియాశీలియై బ్రహ్మవేత్తలతో శ్రేష్ఠుడు అవుతున్నాడు.

 
శౌనకా! సత్యం, తపస్సు, సమ్యక్ జ్ఞానం, బ్రహ్మచర్యంతో ఆత్మను తెలుసుకోవచ్చు. దోషరహితులైన యోగులు శుభ్రమూ, జ్యోతిర్మయమూ అయిన పరమాత్మను శరీరంలోనే చూడగలుగుతారు. సత్యమే జయిస్తుంది. అసత్యం గెలవదు. సత్యంతోనే దేవయానమార్గం ఏర్పడుతోంది. ఋషులు, కోరికలను జయించిన సత్పురుషులు ఈ మార్గం ద్వారానే పరమపథానికి చేరుకుంటున్నారు. ఆ పరబ్రహ్మం దివ్యకాంతితో ఊహకు అందని రూపంతో సూక్ష్మాతి సూక్ష్మంగా, దూరాతిదూరంగా ఉంటుంది. హృదయగుహలో దాగిన ఆ పరబ్రహ్మాన్ని యోగులు తమలోనే చూడగలరు. దానిని కళ్లతో చూడలేరు. వాక్కుతో వర్ణించలేరు. ఇంద్రియాలతో, తపస్సుతో, యజ్ఞయాగాది కర్మలతో గ్రహించలేరు. జ్ఞానంతో పరిశుద్ధుడై ధ్యానించేవాడు నిరాకారమైన పరబ్రహ్మను చూడగలుగుతాడు. అదే ఆత్మ సాక్షాత్కారం. పంచప్రాణాలతో ఉన్న శరీరంలో అణురూపంలో ఉన్న ఆత్మను మనసుతో తెలుసుకోవచ్చు. మానవుల మనస్సును ఇంద్రియాలు గట్టిగా చుట్టుకొని ఉన్నాయి. నిగ్రహంలో ఇంద్రియాలనుండి మనస్సును వేరు చేస్తే స్వచ్ఛమైన మనస్సులోని ఆత్మ సాక్షాత్కరిస్తుంది. పరిశుద్ధ మనస్కుడైన ఆత్మజ్ఞాని ఏ లోకాలను కోరుకుంటే ఆ లోకాలను పొందుతాడు. కోరికలన్నీ నెరవేరతాయి. కనుక ఆధ్యాత్మిక సంపద కోరుకునేవారు ఆత్మజ్ఞానం కలిగిన మహాత్ములను ఆశ్రయించి, అర్చించాలి.

 
ద్వితీయ ఖండం
శౌనకా! ఆత్మజ్ఞాని మాత్రమే దివ్యమూ, కాంతిమంతమూ, విశ్వద్యాప్తమూ అయిన పరంధామాన్ని తెలుసుకుంటాడు. అటువంటి బ్రహ్మజ్ఞుడైన గురువును ఏ కోరికా లేకుండా ఉపాసించినవారు జనన మరణ చక్రం నుండి బయటపడతారు. ఇంద్రాయసుఖాలకోసం ఆరాటపడేవారు ఆ కోరికలు తీరేవారికి మళ్లీమళ్లీ పుడతారు. ఆత్మజ్ఞానంతో కోరికలను ఆత్మలో లీనం చేసినవారి కోరికలు నశించిపోతాయి.

 
నాయమాత్మా ప్రవచనేన లభ్యో న మేధయా న బహుదా శ్రుతేన ఊకదంపుడు ఉపన్యాసాలతో, మేధాశక్తితో, శాస్త్రాధ్యయనంతో ఆత్మజ్ఞానం కలగదు. ఎవరు ఆత్మసాక్షాత్కారాన్ని సంపూర్ణంగా కోరుకుంటారో వారికి ఆత్మదర్శనం అవుతుంది. తన స్వరూపాన్ని ఆత్మ స్వయంగా వివరిస్తుంది. దృఢసంకల్పం లేకుండా అజాగ్రత్తగా, మిడిమిడి జ్ఞానంతో తపస్సు చేసే వారికి ఆత్మజ్ఞానం కలగదు. మనోబలం, శ్రద్ధ, ఆత్మజిజ్ఞాస సంపూర్ణంగా సాధన చేసే వాని ఆత్మ మాత్రమే పరబ్రహ్మలో లీన మౌతుంది. ఆత్మదర్శనాన్ని పొందిన ఋషులు జ్ఞానతప్తులై రాగద్వేషాలు లేనివారు, ప్రశాంత చిత్తులు, పరమాత్మ స్వరూపులు అవుతారు. అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మను అన్ని చోట్లా దర్శించగల ధీరులు, ప్రాజ్ఞులై అన్నిటిలో ప్రవేశించగలుగుతారు.

 వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః  సన్న్యాసయోగార్యతయః శుద్ధ సత్త్వాః తే బ్రహ్మ లోకేషు పరాంతకాలే పరామృతాఃపరిముచ్చంతి ధీరాః


సన్న్యాసులు ఎక్కడ కనపడినా నమస్కరించాలి. వెంటనే ఈ మంత్రాన్ని చదవటం సంప్రదాయం. భారతీయ వేదాంతానికి, ముండకోపనిషత్తుకు ఇది ప్రాణం లాంటిది. వేదాంత విజ్ఞానాన్ని స్పష్టంగా తెలుసుకున్నవారు యతులై, శుద్ధసత్త్వులై సన్న్యాసయోగాన్ని పొందుతారు. బ్రహ్మలోకానికి చేరి మోక్షాన్ని పొందుతారు. అప్పుడు వారి పదిహేను కళలు వాటి స్థానాలకు చేరుకుంటాయి. ఇంద్రియాలు పంచభూతాలలో కలిసిపోతాయి. కర్మలు, జీవాత్మ పరబ్రహ్మలో లీనమైపోతాయి.   బ్రహ్మజ్ఞానం వల్ల శోకం, పాపాలు నశిస్తాయి. హృదయంలోని ముడులు విడిపోతాయి. విముక్తుడైనవాడు అమృతత్త్వాన్ని పొందుతాడు.


శౌనకా! శ్రద్ధగా కర్మలు చేసేవారు, వేదాధ్యయనం చేసేవారు, శ్రోత్రియులు, బ్రహ్మనిష్ఠులు, ‘ఏకర్షి’ అయిన అగ్నికి ఆహుతులు ఇచ్చేవారు, యధావిధిగా ‘శిరోవ్రతాన్ని’ ఆచరించేవారు మాత్రమే ఈ బ్రహ్మవిద్య వినడానికి అర్హులు. అటువంటివారికే ఉపదేశించాలి. ఇది సత్యం. దీనిని పూర్వం అంగిరసుడు తన శిష్యులకు నియమబద్ధంగా చెప్పాడు. వ్రతాచరణ లేనివాడు ఈ ముండకోపనిషత్తును వినకూడదు. నమః పరమ ఋషిభ్యోన్నమః పరమ ఋషిభ్యః  - డా.పాలపర్తి శ్యామలానంద ప్రసాద్

 

వేరువేరు పేర్లు గల నగరాలు సముద్రంలో కలిసి పేర్లను, ఆకారాలను కోల్పోతున్నట్లు విద్వాంసుడు తాను నామరూపాలనుండి విముక్తుడై పరాత్పరుడైన పరబ్రహ్మాన్ని చేరుకుంటున్నాడు. పరబ్రహ్మ తత్వం తెలిసినవాడు పరబ్రహ్మ అవుతాడు. అతని వంశంలో బ్రహ్మజ్ఞానం కలిగిన వారే పుడతారు.

 

మరిన్ని వార్తలు