రక్షక ఫలం

25 Nov, 2018 00:42 IST|Sakshi

గుడ్‌ ఫుడ్‌

ఆపిల్‌ అనే మాటలోనే ‘పిల్‌’ ఉంది. నిజమే. ఎన్నో ఆరోగ్యాలనిచ్చే సూపర్‌ పిల్‌ అది. దానితో సమకూరే కొన్ని ప్రయోజనాలివి. 

∙ఆపిల్‌లోని పవర్‌ఫుల్‌ యాంటీ ఆక్సిడెంట్స్‌ ఎన్నో రకాల క్యాన్సర్ల నుంచి మనకు రక్షణ కల్పిస్తాయి. అయితే మిగతా పండ్లతో పోలిస్తే ఆపిల్‌కు ప్యాంక్రియాస్‌ క్యాన్సర్‌ ముప్పునుంచి రక్షణ కల్పించే గుణం 23 శాతం ఎక్కువ అని అమెరికన్‌ అసోసియేషన్‌ ఫర్‌ క్యాన్సర్‌ రీసెర్చ్‌ పరిశోధనల్లో స్పష్టమైంది. 

∙దీనిలో ట్రైటెర్పినాయిడ్స్‌ అనే పోషకాలు కాలేయ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్‌లను నివారిస్తాయని కార్నెల్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధనలో తేలింది. 

∙ఆపిల్‌ మెదడును చురుగ్గా ఉండేలా చేస్తుంది. ఈ కారణంగానే అది మనకు అలై్జమర్స్‌ వ్యాధిని నివారించి మెదడుకు రక్షణనిస్తుంది. అంతేకాదు... పార్కిన్‌సన్స్‌ వ్యాధినీ ఆపిల్‌ నివారిస్తుంది. 

∙ఆపిల్‌లో పీచుపదార్థాలు చాలా ఎక్కువ. ఈ పీచుపదార్థాల కారణంగా మలవిసర్జన సాఫీగా అయి, మలబద్దకం నివారితమవుతుంది. ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌), పైల్స్‌ వంటి వ్యాధులను సైతం తేలిగ్గా నివారిస్తుంది. 

∙ఆపిల్‌లో పీచుపదార్థాల కారణంగా పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది.

∙ఇందులోని పీచు కారణంగా ఆరోగ్యకరంగా బరువును నియంత్రించుకోడానికి ఆపిల్‌ ఎంతగానో తోడ్పడుతుంది. 

∙ఆపిల్‌ మంచి డీ–టాక్సిఫైయింగ్‌ ఏజెంట్‌ కూడా. ఇది కాలేయంలోని విషాలను సమర్థంగా తొలగిస్తుంది. 

∙ఆపిల్‌లోని విటమిన్‌–సి వల్ల ఇది శరీరంలోని స్వాభావికమైన రోగనిరోధకశక్తిని మరింత పెంచుతుంది. తద్వారా ఎన్నో వ్యాధులనుంచి రక్షణ కలిగిస్తుంది. 

∙ఆపిల్‌లో కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం ఉంది. ఫలితంగా రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా గుండెను చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది.  

మరిన్ని వార్తలు