కుదరకపోయినా ఓ కప్పు

5 Dec, 2019 00:11 IST|Sakshi

తాగాల్సిందే!

మంచి కాఫీ కావాలంటే మద్రాసు కాఫీ హౌసుకి వెళ్లాల్సిందే అంటారు కాఫీ ప్రియులు. మరీ అంత దూరమైతే అక్కర్లేదు. విశాఖపట్టణం దగ్గరలో ఉన్న అరకులోనే మంచి కాఫీ చాలా సంవత్సరాలుగా దొరుకుతోంది. కిందటి ఏడాది ఈ అరకు కాఫీకి పారిస్‌లో ‘ప్రిక్స్‌ ఎపిక్యూర్స్‌’ అవార్డు కూడా వచ్చింది! ఆ అవార్డును అందుకున్నది కాఫీ గింజల్ని పండించిన అరకు గిరిజన మహిళలు కావడం విశేషం.

ఇంకొక విశేషం ఏంటంటే.. పారిస్‌లో ఇప్పుడు ‘అరకు’ అనే పేరున్న కాఫీ స్టాల్‌ ముందర జనం ఆగిపోతున్నారు. అరకు కాఫీ ఘనతను కేవలం కొన్ని కాఫీ గింజలు ప్రపంచానికి చాటుతున్నాయి. అరకు ప్రాంతంలో ఉండే గిరిజనులు పండించిన నాణ్యమైన కాఫీ గింజలు అవి! అరకు లోయలో గిరిజన మహిళల చేతి మీద సుమారు ఒకటిన్నర లక్షల ఎకరాల్లో కాఫీ గింజలు పండుతున్నాయి. అయితే ఈ గింజలకు అంతర్జాతీయంగా మార్కెట్‌ ఉన్నా, ఈ గిరిజనులు మాత్రం ఆర్థికంగా నేటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘‘మేం చాలా కష్టపడి పనిచేస్తున్నాం.

ప్రతి ఒక్కరం పది బస్తాల గింజలు పండించుకుంటాం. వాటి నుంచి ఒక్కొక్కరం కనీసం సీజన్‌కి రెండు లక్షల రూపాయలు సంపాదించుకుంటేనే గిట్టుబాటు అవుతుంది. కానీ మాకు ఎనభై నుంచి తొంభై వేల రూపాయలు మాత్రమే వస్తోంది. ఖర్చులన్నీ పోగా, తిండి తినటానికి సరిపడేంత డబ్బు మాత్రమే మిగులుతోంది. మా ఆర్థికస్థితిలో ఎటువంటి ఎదుగుదల లేదు. దానితో మాలో చాలామందికి కాఫీ పండించాలనే ఆసక్తి సన్నగిల్లిపోతోంది’’ అంటున్నారు అరకు గిరిజన మహిళలు. చరిత్రలోకి వెళ్తే.. 1898లో తూర్పుగోదావరి తీర ప్రాంతంలో ఒక బ్రిటిష్‌ అధికారి ఉండేవారు. ఆయన అక్కడి వాతావరణం చూసి, అది కాఫీ పంటకు అనుకూలంగా ఉంటుందని కాఫీ పంట వేశారు. 1950లలో ఆంధ్రప్రదేశ్‌ అటవీ శాఖ కాఫీ పంటను సాగు చేయడం మొదలైంది.

అలా క్రమేపీ అరకు కాఫీ రుచికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ‘అరకు కాఫీ’ అన్న పేరూ వచ్చింది. 1980 నాటికి రాష్ట్ర ప్రభుత్వం గిరిజన కోఆపరేటివ్‌ కార్పొరేషన్‌ ప్రారంభించి, కాఫీ పంటను ప్రోత్సహించింది. ఒకానొక సమయంలో వరి పంట కంటే కాఫీ పంట మీద లాభాలు వచ్చాయి. దాంతో చాలామంది రైతులు కాఫీ పండించడం మొదలుపెట్టారు. రెండేళ్ల క్రితం పారిస్‌లో అరకు కాఫీ స్టోర్‌ తెరుచుకుంది. ఈ స్టోర్‌ కారణంగానే కిందటి ఏడాది అరకు గిరిజన మహిళలకు అవార్డు వచ్చింది. ఇంత కమ్మని కాఫీని పండిస్తున్న ఈ గిరిజన మహిళలకు మాత్రం శ్రమకు తగ్గ ఫలితం లభించడం లేదు!

మరిన్ని వార్తలు