బుద్ధులు ఇద్దరా? ఇద్దరూ ఒక్కరా?

14 Jun, 2018 00:07 IST|Sakshi

పరిశోధన

అదో దాయాది వైరం. ఒకే తండ్రి సంతతైనా దేవదానవుల మధ్య ఆధిపత్య పోరు. సాగరమధనం చేసి అమృతం సాధించినా దక్కింది సురులకే. ఇక తీవ్ర తపస్సు చెయ్యడం, మరణం లేని జీవితం కావాలనడం, ప్రత్యక్షమైన దేవతలు సృష్టి విరుద్ధమైన కోరిక అనటం, నానా ఉపాయాలతో మరణం తప్పించుకునే కోరిక సాధించడం, దేవతలు త్రిమూర్తులను శరణు వేడటం, ఆ కోరికలోని లొసుగుల ద్వారా అసుర సంహారం జరగడం, వింత కోరిక కోరి చివరకు పగలూ రాత్రీ కాని సంధ్యా సమయంలో, ఇంటాబయట కాకుండా, నరుడూ మృగమూ కాకుండా నరమృగం చేత చచ్చిన హిరణ్య కశిపుడి కథ, వానరులంటే చిన్నచూపుతో వారిని విస్మరించిన రావణుడి కథ మరొకటి.. మరొకటి.. ఇలా ఎన్నెన్నో!

తారకాసురుడి వంతు
శివపుత్రుని చేత చావు కావాలన్నాడు తారకాసురుడు. కారణం సతీదేవి వియోగంతో శివుడు ఆత్మనిష్టలో ఉన్నాడు. ఇక ఆయన పెళ్లి, కుమారుడు కలగడం అసంభవం అనుకున్నారు.శివుడి ధ్యాస మరల్చడానికి దేవతలు విష్ణు మానసపుత్రుడు మన్మధుడిని తపోభంగం చెయ్యమన్నారు. తన సతి రతీదేవితో కలిసి వచ్చి చెరుకువింటితో పంచశరాలను సంధించాడు. శివుడి క్రోధానలంలోదగ్ధమయ్యాడు. ఈలోగా పర్వత రాజ పుత్రికగా పుట్టిన పార్వతి శివుడికి సపర్యలు చేసి, తీవ్ర తపస్సు చేసి భోళాశంకరుడిని పెళ్లాడింది. ఆ తర్వాత కుమార సంభవం, తారకాసుర సంహారం జరిగిపోయాయి.

కథ ఇక్కడితో ఆగిపోలేదు
తారకుడి కొడుకులు ముగ్గురు తీవ్ర తపస్సు చేసి, వరం చేత బంగారం, వెండి, ఇనుము (త్రి) పురాలను పొంది విహరించసాగారు. వేర్వేరు కక్ష్యలు, లోకాల్లో తిరిగే ఈ మూడు పురాలు వెయ్యేళ్లకొకసారి లిప్త కాలం పాటు ఒకే సరళరేఖ మీదకు వచ్చిన సమయంలో ఒకే బాణం దెబ్బకు మాత్రమే నాశనమవ్వాలని కోరుకున్నారు. వరగర్వంతో ముల్లోకాలను గడగడలాడిస్తున్న వీరిని సంహరించమని దేవతలు శివుడిని వేడుకున్నారు. మేరు పర్వతం చాపంగా మారగా, ఆదిశేషు అల్లెతాడు, విష్ణువు బాణం కాగా శివుడు ఆ త్రిపురాసుర సంహారం చేసి త్రిపురాంతకుడు, పురహరుడు అయ్యాడు. ఆ ధనుస్సు దేవతల ద్వారా దేవరాతునికి చేరింది. వారి వంశంలో ఒకడైన జనకుడి కూతురు జానకిని ఈ విల్లు విరిచే రాముడు పెళ్లాడాడు.

అయితే, అంతకుముందు
శరణు వేడిన దేవతలతో.. ‘‘త్రిపురాసురులు ధర్మ విరుద్ధమైన పనులు చెయ్యమంటారు. ఇది దాయాది వైరం మాత్రమే. అందుకే సహాయం చెయ్యనని’’ నిరాకరిస్తాడు శివుడు. వారిని ధర్మభ్రష్టులను చేసే పని చెయ్యడానికి మహావిష్ణువు మరో అవతారం ఎత్తవలసి వచ్చింది. అదే బుద్ధుడి అవతారం.బుద్ధుడి అవతారంలో వచ్చిన విష్ణువు త్రిపురాసురుల నగరాల్లో దైవం, పునర్జన్మలు, పాపపుణ్యాలను లేవని బోధించి నాస్తికతను వ్యాపింపచేశాడని, యజ్ఞక్రతువులు, అక్కడ జంతుబలులు ఆపించి ధర్మభ్రష్టులను చేసినందువల్ల వీరిని శివుడు సంహరించగలిగాడని ఒక కథ.

ధర్మబద్ధుడు, అధర్మబుద్ధుడు
హైందవం బౌద్ధాన్నీ వదలకుండా మింగేసి, బుద్ధుడిని అవతారంగా మార్చుకుందని విమర్శ. కాదు చరిత్రలో మనం చదువుకునే శాక్యముని బుద్ధుడు, పురాణ బుద్ధుడు వేర్వేరంటారు కొందరు.ఈ బుద్ధుడిని అవతారాల్లో ప్రస్తావించిన 12వ శతాబ్దం నాటి జయదేవ కవి ‘గీతగోవిందం’లోని ‘ప్రళయ పయోధి జలే’ అనే అష్టపదిని చూపుతారు కొందరు. కానీ అందులో కరుణా దృష్టితో యజ్ఞయాగాల్లో జంతుబలిని ఆపిన గౌతమ బుద్ధుడి వర్ణన ఉంటుంది!ఈ అష్టపదిలో కాకుండా బుద్ధావతారాన్ని వర్ణించిన కీర్తనలు మరేమైనా ఉన్నాయా? లేకేం.. పదకవితా పితామహుడు అన్నమయ్య కీర్తనల్లో కొన్ని దశావతార కీర్తనలు ఉన్నాయి. వాటిలో కొన్ని పరిశీలిస్తే బుద్ధుడి వర్ణన ఈ విధంగా ఉంది.

కెలసి బిత్తల తిరిగేటి భూతం (పుడమి నిందరిబట్టె భూతము) ::: పొంచి సిగ్గెగ్గెరుగని బోయనాయుడు (పొడవైన శేషగిరి బోయనాయుడు) ::: ఆకసానబారే ఊరి అతివల మానముల కాకుసేయువాడు(తెప్పగా మర్రాకుమీద తేలాడు వాడు) ::: పురసతుల మానముల పొల్లసేసిన చేయి (ఇందరికి నభయంబులిచ్చు చేయి) ::: బిత్తల అంటే దిసమొల/దిగంబరత్వం అని అర్ధం. ఈ పదాన్ని కొద్ది మార్పులతో రాయలసీమ, తెలంగాణ, కర్ణాటకల్లో వాడుతారు. సిగ్గెగ్గులెరగని అన్నా కూడా దిసమొలతో తిరిగేవాళ్లను అంటారు.అతివల మానములు కాకుచేయువాడు, పురసతుల మానముల పొల్ల చేసిన అన్నప్పుడు.. విష్ణువు మాయారూపంలో వచ్చి పాతివ్రత్యాన్ని భంగం చేసిన తులసి, జలంధరుల కథలాగా పురసతులను బుద్ధావతారంలో మోసగించాడని అర్థమవుతుంది.

ఈ కీర్తనలూ ఆ విషయాన్నే చెబుతున్నాయి.సింకసూపుల వాడు సిన్నెక్క (సిరుత నవ్వులవాడు సిన్నెక్క) ::: కోరి బుద్ధుడైన సిగ్గు (శ్రీ వెంకటేశ్వరునికి చెలి అలమేలుమంగ) ::: పరకాంతల భంగపరచకుంటే మేలు (సంసారమే మేలు సకల జనులకు) ::: మోస మింతుల జేయు మునిముచ్చు దొంగ (వీడివో యిదే వింతదొంగ) ::: పొంచి అసురకాంతలలో వెదకిన బుద్ధావతారంబైనాడు (ఇతనికంటే మరి దైవము గానము) ::: కొంగు జారినంతలోన కూలెను త్రిపురములు (హరీ నీ ప్రతాపమునకడ్డమేది లోకమున).

శృంగేరిలో దిగంబర బుద్ధుడు
దిగంబరత్వం జైనంలో ఉంది కానీ, బౌద్ధంలో కనిపించదు. ఈ బిత్తల బుద్ధుడు తెలుగు సంకీర్తనల్లో కనిపించాడు కానీ మిగిలిన చోట్ల ఉన్నాడా? ఉన్నాడు. సాహిత్యం సంగతేమో కానీ శిల్ప రూపంలో ఈ బిత్తల బుద్ధుడు కనిపిస్తాడు. అదే శృంగేరి లోని పురాతన విద్యాశంకర ఆలయం. హంపి విజయనగర స్థాపకులు హరిహర బుక్కరాయలు, వారి గురువు విద్యారణ్య స్వామి ఆదేశానుసారం 14 వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర. అదివరకే ఉన్న హోయసలాలయాన్ని పునర్నిర్మించారని కొందరు చరిత్రకారులు నిర్ధారించారు. ఈ విద్యాశంకర ఆలయం వెనుకవైపు విష్ణు అవతారాలను చెక్కారు. మత్స్య నుండి రాబోయే కల్కి వరకు మొత్తంగా 11 అవతారాలను చెక్కారు. దశావతారాలను ఎక్కువ ప్రాచుర్యంలోకి తెచ్చారు కానీ భాగవతానుసారం 24 విష్ణు అవతారాలు ఉన్నాయి. ఈ అవతార శిల్పాల్లో మరో ప్రత్యేకత పరశురాముడి ఆహార్యం క్షత్రియుణ్ణి పోలి ఉంటుంది. అన్నమయ్య వర్ణించిన సిగ్గెగ్గులెరగని బిత్తల అవతారం కూడా వీటిల్లో ఉంది. ఇంతకూ జంతుబలులు, యజ్ఞయాగాదులు నిరసించిన గౌతమ బుద్ధుడు, త్రిపురాల్లో నాస్తికత బోధించిన అవతార బుద్ధుడు ఒకరా? వేర్వేరా? మరింత పరిశోధనలు జరిగేవరకూ ఆలోచిస్తూ ఉందాం.ఈ బుద్ధావతారం కథ సంగతేమో కానీ అన్నమయ్య కంటే వందల ఏళ్ల పురాతనమైన ఈ ఆలయ మంటపంలో 12 స్తంభాలుంటాయి. వాటిమీద 12 రాశుల చిహ్నాలుంటాయి. వాటిని చూడగానే ఇన్ని రాసులయునికి అంటూ రాశులమీద ఉన్న కీర్తన గుర్తొస్తుంది.

– గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

మరిన్ని వార్తలు