ఎడమచేతి వాటం అబ్బాయిలు మేధావులా?

26 Nov, 2013 00:07 IST|Sakshi

మనిషికి హార్మోనల్ ప్రభావం వల్ల వచ్చేదే ఎడమచేతి వాటం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పది శాతం జనాభా ఎడమచేతి వాటం వారే! ఎడమచేతి వాటం వారి  మానసిక, శారీరక పరిస్థితులను కొన్ని సర్వేలు ఇటీవల వెలుగులోకి తెచ్చాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు యు.కె.కి చెందిన రీసెర్చ్ సర్వే ఆన్ లెఫ్టీ వంటి  సామాజిక పరిశోధన సంస్థలు వివిధ దేశాలలో చేసిన అధ్యయనాల ప్రకారం.. ఎడమచేతి వాటమున్న మహిళలతో పోలిస్తే మగాళ్ల సంఖ్య 50 శాతం ఎక్కువ. 11 శాతం మంది ఎడమచేతి వాటంవారిలో, తల్లిదండ్రులలో ఎవరో ఒకరు మాత్రం లెఫ్ట్ హ్యాండర్‌లు. కేవలం 1.4 శాతం మంది ఎడమచేతి వాటం వారి తల్లిదండ్రులిద్దరూ ఎడమచేతి వాటం వాళ్లే.

మిగతావారికి మాత్రం జన్యు నేపథ్యం లేకుండానే ఎడమచేయి అలవాటుగా మారింది. ఎడమచేతి వాటాన్ని గుర్తించడానికి ప్రధానమైన ఆధారం రాత. లెఫ్ట్ హ్యాండర్స్‌లో 98 శాతంమంది ఎడమచేతితోనే రాస్తున్నారట. మిగతా పనుల్లో మాత్రం వీరు ఎడమచేతికి కొద్దిగా పని తగ్గిస్తున్నారట. టూత్‌బ్రష్, స్పూన్, కత్తెర, కత్తి వంటివి ఎడమ చేతితో ఉపయోగించే వారి శాతం 60 - 70  మధ్యలో ఉంది. మిగతా వారు మాత్రం ఈ పనులను కుడి చేత్తోనే చేసుకొంటున్నారు!  ఎడమచేతి వాటం వారిలో ఆత్మవిశ్వాసం పాలు ఎక్కువేనట. 58 శాతం మంది లెఫ్ట్ హ్యాండర్స్ తాము మేధావులమని, ఇతరులకంటే తెలివైనవారమని చెప్పారట.

48 శాతంమంది ఇతరులతో పోల్చుకొన్నప్పుడు తమలో సృజనాత్మకత ఎక్కువ స్థాయి లో ఉందని, ఇతరులకంటే భిన్నంగా ఉన్నందున అందరూ తమను విచిత్రంగా చూశారని 71 శాతం లెఫ్ట్ హ్యాండర్స్ అన్నారట. అయితే తమ చేత కుడిచేత్తో రాయించాలని చాలామంది ప్రయత్నించారని లెఫ్ట్ హ్యాండర్స్ చెప్పారు. ఇక కంప్యూటర్ మౌస్ వంటివి ఎడమచేతి వాటం వారికి ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చాయి. అయితే కేవలం 38 శాతంమంది మాత్రమే వాటిని ఉపయోగిస్తున్నారని సర్వేలో పేర్కొన్నారు.

40 శాతంమంది లెఫ్ట్ హ్యాండర్స్ ‘ఆర్ట్’పై ఆసక్తిని చూపుతున్నారట. కొన్ని హారర్ సినిమాలను ఎడమచేతి, కుడి చేతి వాటాల వారికి ఒకేసారి చూపించగా... ఎడమచేతి వాటం వారిలో ఎక్కువ భీతి కనిపించిందని అధ్యయనకర్తలు అన్నారు. 17 శాతం మంది కవలలు ఎడమచేతి వాటంవారే! ఇక ఎడమచేతి వాటం అబ్బాయిలు గర్వించదగ్గ విషయాన్నొకటి చెప్పారు విశ్లేషకులు. ఏ పనికైనా ఎడమచేతిని ఉపయోగించే అబ్బాయిలంటే అమ్మాయిల్లో ఏదో ఆకర్షణ భావం కలుగుతుందని అధ్యయనకర్తలు పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు