మీలో ఒక ఆర్టిస్ట్ ఉన్నారు...

6 Aug, 2014 23:03 IST|Sakshi
మీలో ఒక ఆర్టిస్ట్ ఉన్నారు...

కళాశాల
 
చిత్రకళ అనేది వంశపారంపర్యంగానో, పుట్టుకతోనో వచ్చే కళ కాదు. సాధనతో వికసించే కళ. ఎంతోమంది యువ చిత్రకారులు ప్రపంచవ్యాప్తంగా తమ ప్రతిభను చాటుతున్నారు. మీలో కూడా ఒక చిత్రకారుడు కచ్చితంగా ఉంటాడు.

 
ఇలా చేసి చూడండి...
బాపుగారు చెబుతుంటారు జేబులో స్కెచ్‌బుక్ లాంటిది ఎప్పుడూ ఉండాలని. మీరు బస్‌స్టాప్‌లో ఉన్నా, థియేటర్ దగ్గర ఉన్నా కనిపించిన దృశ్యాన్ని గీయండి. వారం పది రోజుల్లోనే చిత్రం పరిపూర్ణంగా రాకపోవచ్చు. అయితే కాలం గడుస్తున్న కొద్ది మీ రేఖల్లో పరిణతి కచ్చితంగా కనిపిస్తుంది.
     
సృజనకు తొలిమెట్టు అనుకరణ అంటారు. మొదట్లో ప్రసిద్ధుల చిత్రాలను చూసి సాధన చేసినా, అంతిమంగా మాత్రం మీదైన ప్రత్యేక శైలిని ఎంచుకొని దాని మీద సాధన చేయండి.
     
మీకు ఇష్టమైన సబ్జెక్ట్ అంటూ ఒకటి ఉండాలి. ‘ప్రకృతికి సంబంధించిన చిత్రాలను నేను బాగా గీయగలను’ అనే నమ్మకం ఉన్నప్పుడు ముందు ఆ సబ్జెక్ట్ పైనే కృషి చేయండి.
     
ఒక ఫొటోను ఎంచుకొని భిన్న మాధ్యమాల్లో చిత్రించడానికి ప్రయత్నించండి. పెయింట్, పెన్సిల్, అబ్‌స్ట్రాక్ట్, రియలిజం... ఇలా విధానంలోనైనా సరే ప్రయత్నించి చూడండి.
     
కేవలం బొమ్మలు వేస్తుంటే సరిపోదు. పుస్తక అధ్యయనం కూడా ముఖ్యమే. కళ, చారిత్రక, సాంస్కృతిక పుస్తకాల అధ్యయన ప్రభావం మీ చిత్రకళలో కొత్త కాంతిని నింపుతుంది.
     
ప్రతి రంగుకూ ఒక ధర్మం, లక్షణం ఉంటుంది. సాధన చేసే క్రమంలో, పెద్ద చిత్రకారులను అడిగి, పుస్తకాలను చదివి రంగుల గురించి లోతైన అవగాహన పెంచుకోండి.
     
 మీరు గీసిన బొమ్మలను కుటుంబసభ్యులు, స్నేహితులకు చూపించి వారి అభిప్రాయం తీసుకోండి. భారీ పొగడ్తలకు, అతి విమర్శకు దూరంగా ఉండండి. వాస్తవికమైన విమర్శను స్వీకరించండి.
 
 మీ కంటే నైపుణ్యంతో గీసే వాళ్ల సలహాలు, సూచనలు తీసుకోండి.
 

మరిన్ని వార్తలు