మీ దైవంతో టచ్‌లో ఉన్నారా?

21 Mar, 2014 02:49 IST|Sakshi
మీ దైవంతో టచ్‌లో ఉన్నారా?

దేవుడు అనేక రూపాలలో మనిషి  జీవితంలోకి వస్తాడు. వచ్చినప్పుడు ఆయన వచ్చినట్టు తెలీదు. వెళ్లిన తర్వాత మాత్రమే  వచ్చివెళ్లినట్లు తెలుస్తుంది!
 
 
 జీవితాన్ని మించిన గురువు లేదు. గురువును మించిన దైవమూ లేదు. అంతమాత్రాన జీవితాన్ని నేరుగా దైవం అనేందుకు లేదు! మధ్యలో కొందరు గురువులు, కొందరు శిష్యులు నలిగిపోవాలి. నాలుగు వీధులు తిరగాలి. కాళ్లు అరగాలి. కంఠనాళాలు తెగిపోవాలి. అప్పుడే దైవోద్భవం జరుగుతుంది. దేవుడు తేటగా పైకి తేలతాడు.


అయితే చూడండి, ఈ నలిగిపోవడం, తిరగడం, అరగడం, తెగిపోవడం వంటివన్నీ దేవుడు లేడని ‘కనిపెట్టడానికి’ కూడా జరుగుతుంటాయి. అప్పుడు కూడా ఏదో ఒక రూపంలో దేవుడు తేటగానో, తీక్షణంగానో పైకి తేలతాడు తప్ప ‘సప్రెస్’ అయిపోడు. చివరికేమిటి? అంతా కలసి దేవుడు ఉన్నాడని చెప్పడం కోసం జీవిస్తున్నారా? పరమార్థం అదే కావచ్చు. ఒక మంచి గురువులా ఎవరికి ఎలా చెప్తే అర్థమవుతుందో అలా చెప్తుంది జీవితం. ‘నువ్వేం చెప్పినా అర్థమవుతుందిలే. చెప్పుకుంటూ పో’ అని చెవుల్లో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పరుగులు తీసేవాళ్లని కూడా వదిలిపెట్టదు. బిడ్డ వినడం లేదని తల్లి వెంటపడకుండా ఉంటుందా? గురుశిష్య బంధమూ అంతే.


 ఏథెన్స్ తత్వవేత్త సోక్రటీస్‌కు జీవితమే గురువు. ఈ మహాజ్ఞాని జీవితాన్ని చాలా ప్రశ్నలు అడిగాడు. జ్జానం అంటే ఏమిటి? స్నేహం, ప్రేమ, సౌందర్యం, నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం, సత్యం, మతం, దైవం.. ఇవన్నీ ఏమిటి? అని జీవితాన్ని సతాయించాడు. మరి సమాధానాలు దొరికాయా? అవి ఆయనకు అక్కర్లేదు. అడగడమే అయన తెలుసుకున్న జ్ఞానం, ఆయన నమ్మిన దైవం. ఎంతెంతమంది శిష్యులు సోక్రటీస్‌కు! అతడొక దైవం అయిపోయాడు వారికి. ముఖ్యంగా ప్లేటోకి. ప్లేటోలాంటి శిష్యుడే ఈ కాలపు సర్ అలెక్స్ ఫెర్గూసన్.
 ఈ స్కాట్లాండ్ ఫుట్‌బాల్ టీమ్ మేనేజర్ తన ఇంట్లో గోడ కి ఒక బెల్టుని దేవుడిపటంలా వేలాడదీసుకున్నాడు! ఆ బెల్టు ఆయన చిన్ననాటి టీచర్ ఎలిజబెత్ థాంప్సన్‌ది. అలెక్స్ శ్రద్ధగా వినకపోయినా, సరైన సమాధానం చెప్పకపోయినా ఎలిజబెత్ టీచర్ తన బెల్టు తీసి రెండు అంటించేవారట. ఆమె తన పాలిటి దైవం అంటారు అలెక్స్.


‘‘టీచర్ నన్ను అలా దండించకపోయి ఉంటే, జీవితం నాకు ఇవాళ ఇన్ని అందించి ఉండేది కాదు’’ అంటారు అలెక్స్. పాఠశాల జీవితం నుంచి బయట పడి ఏళ్లు గడిచినా, నిన్న మొన్నటి వరకు అలెక్స్ తన ‘దైవం’తో టచ్‌లో ఉన్నారు. కానీ విషాదం, ఆమె చనిపోయినప్పుడు ఆయన దగ్గర లేరు. కనీసం కడసారి చూసేందుకైనా వీలుకానంత దూరంగా విదేశాల్లో ఉన్నారు. తిరిగి స్కాట్లాండ్ వచ్చిన కొన్ని నెలలకు అలెక్స్‌కు పోస్టులో ఒక పార్సిల్ వచ్చింది. తెరచి చూస్తే ‘బెల్టు’! దాంతో పాటు టీచర్ మేనల్లుడి చేతిరాతతో ఉన్న ఉత్తరం. ‘‘ఈ బెల్టు గురించి మీకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. విత్ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ యువర్ టీచర్ ఎలిజబెత్’’ అని రాసి ఉంది అందులో! ప్రస్తుతం అలెక్స్ ఇంటి గోడకు వేలాడుతున్న బెల్టు అదే! అలెక్స్‌కు ఆ బెల్టు దైవంతో సమానం.
 
దేవుడు అనేక రూపాలలో మనిషి జీవితంలోకి వస్తాడు. వచ్చినప్పుడు ఆయన వచ్చినట్టు తెలీదు. వెళ్లినప్పుడు మాత్రమే వచ్చివెళ్లినట్లు తెలుస్తుంది! అదీ గురుసాన్నిధ్యంలో ఉన్నవారికే తెలుస్తుంది.
 
 

మరిన్ని వార్తలు