షూస్ పాలిష్ చేస్తున్నారా!!

7 Jun, 2016 23:08 IST|Sakshi
షూస్ పాలిష్ చేస్తున్నారా!!

ఇంటిప్స్

 

పాఠశాలలు మొదలవబోతున్నాయి. పిల్లలకు కొనాల్సిన జాబితాలో యూనిఫామ్స్, షూస్ (బూట్లు) తప్పనిసరి. నలుపు, తెలుపు రంగు అంటూ ఓ రెండు రకాల షూస్ కొంటే ఏడాదంతా చూసుకోనవసరం లేదు అనుకోవడానికి లేదు. ఇంట్లోనూ, స్కూల్లోనూ చదువుల ఒత్తిడితో నలిగిపోయే పిల్లలకు షూస్ పెద్ద భారం కాకూడదు. ఏడాది పొడవునా పిల్లల పాదాలను సంరక్షించే షూస్ విషయంలో తల్లిదండ్రులు తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు షూస్ తయారీదారులు, సప్లయర్ల కంపెనీ మేనేజింగ్ డెరైక్టర్ సాహిల్ గుప్తా. వారు ఇస్తున్న కొన్ని సూచనలు ఇవి.

 
స్కూల్‌కి వెళ్లే పిల్లలు ఎగుడుదిగుడు రోడ్లలో పరిగెడుతుంటారు. దుమ్ములో నడుస్తుంటారు. ఇసుకలో గెంతులేస్తుంటారు. పాదాన్ని సంరక్షిస్తున్నట్టుగా షూస్ లేకపోతే అడ్డంకే. అందుకే ఎదిగే పాదానికి తగ్గట్టుగా షూస్ ఎంపిక ఉండాలి. పిల్లవాడి పాదానికన్నా ఒక అంగుళం పెద్ద సైజు షూస్ తీసుకోవాలి.చర్మం ఏ తరహా మెటీరియల్‌ను ఇష్టపడుతుందో షూస్‌ని బట్టి తెలుసుకోవచ్చు. మిగతావాటన్నింటికన్నా లెదర్‌ని మాత్రమే చర్మం భరిస్తుంది. పాదాలకు సౌకర్యంగా ఉంటుంది.  మురికిపటినా, ఇసుక చేరినా ఏ రోజుకారోజు శుభ్రం చేయకపోతే.. పిల్లలకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని రోజూ పాఠశాల నుంచి రాగానే ముందుగా షూస్ బయటే వదిలేయమని చెప్పాలి.

     
{పతీరోజూ పాలిష్ చేస్తే షూస్ ఎక్కువ రోజులు మన్నుతాయి. షూ పాలిష్‌లో రెండు పద్ధతులున్నాయి. క్రీమ్ పాలిష్ పోయిన కలర్‌ని తిరిగి తెప్పిస్తుంది. వ్యాక్స్ పాలిష్ షూ మెరిసేలా చేస్తుంది. అందుకని స్కూల్ షూస్‌కి ఎప్పుడైనా క్రీమ్ పాలిష్ బెస్ట్ ఆప్షన్. దీని తర్వాత వ్యాక్స్ పాలిష్‌తో ఒక కోట్ వేస్తే షూస్ మెరుస్తాయి.  షూస్ పాలిషింగ్ రోజూ చేయడం వల్ల ఎక్కడైనా చిరిగినా, మడమ దగ్గర విడిపోయినా, లేసులు ఊడిపోయినా తెలుసుకోవడం సులువు అవుతుంది. ఇవన్నీ పిల్లలు బాగా గుర్తించగలరు కాబట్టి రోజూ తమ షూస్ పాలిష్ చేసే బాధ్యతను వారికే అప్పగించాలి.

 
అందరివీ ఒకే చోట కాకుండా పిల్లలకోసం షూస్ కేస్ ప్రత్యేకంగా కేటాయించడం వల్ల శుభ్రత బాగుంటుంది. పని సులువు అవుతుంది.వర్షాకాలంలో షూస్ తడిగా ఉండే అవకాశాలు ఎక్కువ. వాటిని పొడిబార్చడానికి వేడి చేయడం, లోపల న్యూస్ పేపర్లు పెట్టడం వంటివి చేస్తే... అవి దుర్వాసన రావడంతో పాటు, బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అందుకని, రాత్రిపూట సోడా బై కార్బనేట్‌ను షూస్ లోపల చల్లి ఉంచాలి. దీని వల్ల తేమ తగ్గడమూ, బాక్టీరియా నశించడమూ రెండూ జరుగుతాయి.స్కూళ్లలో చెప్పే పాఠాలలో టీచర్లు షూస్ కేర్ గురించి కూడా వివరిస్తే పిల్లలు తమ పాదాల సంరక్షణ పట్ల మరింత జాగ్రత్తగా ఉంటారు. షూ పాలిష్ చేయడం ఎలాగో పిల్లలకే చెబితే తల్లిదండ్రులకూ పని సులువు అవుతుంది. ఈ అలవాటు వల్ల పిల్లలకు షూస్ పరిశుభ్రత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదు.

మరిన్ని వార్తలు