భూమి సూర్యుడి చుట్టూ...ఈ దేశం డాలర్ చుట్టూ

31 Jan, 2014 23:09 IST|Sakshi
భూమి సూర్యుడి చుట్టూ...ఈ దేశం డాలర్ చుట్టూ

మీరు పొదుపెలా చేస్తారు? ఖర్చెలా పెడతారు? పోనీ పెట్టుబడులు దేన్లోపెడతారు? వీటన్నిటికీ సమాధానమివ్వాలంటే... ముందు మీరు ఏ దేశస్తులన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే దేశాన్ని బట్టి పొదుపు అలవాట్లు, ఖర్చు పెట్టే తీరు, పెట్టుబడి సాధనాలు మారిపోతుంటాయి. కారణం... ఒక్కో దేశానిదీ ఒక్కోతీరు. వివిధ దేశాల ప్రజల ఆర్థిక అలవాట్లను పరిచయం చేసేందుకే ఈ శీర్షిక.  
 
లాటిన్ అమెరికా దేశమైన అర్జెంటీనా గతరెండు దశాబ్దాలుగా తీవ్ర సంక్షోభాలు ఎదుర్కొంది. మాంద్యం చుట్టుముట్టింది. బ్యాంకులు దివాలా తీశాయి. జీతాలు, పింఛన్లలో కోతలు పడ్డాయి. కరెన్సీ భారీగా పతనమైంది. అప్పులు రికార్డు స్థాయిలో పెరిగాయి. కష్టపడి వీటిని గట్టెక్కినా నిరుద్యోగుల సంఖ్య.. నిత్యావసరాల ధరలు ఇప్పటికీ ఎక్కువే. ద్రవ్యోల్బణం ప్రస్తుతం 10.5% ఉన్నా... ఇది 25 శాతానికి చేరుతుందనే అంచనాలున్నాయి. ఇక్కడ ప్రభుత్వం రిటైర్మెంట్ పథకం అమలు చేస్తోంది.

కానీ చాలామందికి అది సరిపోదు. ప్రభుత్వ ఆసుపత్రులున్నాయి. వాటి సేవలు నాసిరకం. దీంతో ఉద్యోగులు తాము సగం-కంపెనీలు సగం భరించేలా ప్రైవేటు వైద్యాన్నే ఆశ్రయిస్తున్నారు. ఎగువ మధ్య తరగతి, శ్రీమంతుల సంగతి సరేసరి. ఇక డబ్బున్న వారైతే భవిష్యత్ అవసరాల కోసం వారి డబ్బును డాలర్లలోకి మార్చుకుని.. ఆ డాలర్లు ఇంట్లో దాచుకుంటున్నారు. దీన్ని చూసిన ప్రభుత్వం నియంత్రణ చర్యలకు దిగటంతో... డాలర్ల కోసం బ్లాక్ మార్కెట్‌ను ఆశ్రయిస్తున్నారు.
 
ఖర్చు: వీళ్లు కార్లు, టీవీల వంటి వినియోగ వస్తువులపై బాగానే ఖర్చు పెడతారు. మిగతా వస్తువుల రేట్లు అసాధారణంగా పెరిగినా... ఇవి అలా పెరగవు. పెపైచ్చు మిగతా దేశాలతో పోలిస్తే అర్జెంటీనాలో కారు ఎంత పాతబడినా దాని విలువ మాత్రం పెద్దగా తగ్గిపోదు.
 
పొదుపు: అంతా డాలర్లలోనే. వాటిని పెసోల్లోకి మారిస్తే గిట్టుబాటు అవుతుందన్నదే వీరి ఉద్దేశం. రేట్ల మోత ఎదుర్కొనేందుకు పలువురు తమ డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారు. వడ్డీ 15 శాతం దాకా వస్తున్నా ధరల పెరుగుదల అంతకు మించి పాతిక శాతం దాకా ఉంటోంది. ఇక రియల్ ఎస్టేట్ ఆస్తి కొనటం చాలా కష్టం. ఎందుకంటే బ్యాంకులు రుణాలివ్వవు. మొత్తం నగదు... అది కూడా డాలర్లలో  చెల్లించాల్సిందే. అంత కూడబెట్టడమంటే మాటలా మరి!! ఉన్న ఏకైక మార్గమల్లా బంధుమిత్రుల నుంచి రుణం తీసుకుని ఆస్తి కొనటం.
 
పెట్టుబడి: చిన్నా చితకా స్టాక్ ఎక్స్ఛేంజీలున్నా వాటిలో షేర్లు కొంటే కావాల్సినపుడు అమ్మటం కష్టం. అందుకని అంతా ఆధారపడేది డాలర్లపైనే. నేరుగా డాలర్లు కొనటం, డాలర్‌తో లింకున్న బాండ్లు, ఫండ్లలో పెట్టుబడులు పెట్టడం వంటివి చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు