ఆర్థరైటిస్‌కు అన్నిసార్లూ ఆపరేషన్ అవసరం లేదు...

16 Jun, 2016 23:29 IST|Sakshi
ఆర్థరైటిస్‌కు అన్నిసార్లూ ఆపరేషన్ అవసరం లేదు...

హోమియో కౌన్సెలింగ్

 

నా వయసు 25 ఏళ్లు. నాకు తిన్నవెంటనే కడుపులో నొప్పి, మంటగా ఉంటోంది. అంతేకాకుండా అప్పుడప్పుడూ తేన్పులు రావడం, కడుపు ఉబ్బరంగా అనిపించడం జరుగుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్ట్రైటిస్ అన్నారు. దీనికి హోమియోలో పరిష్కారం ఉందా? - నీరజ, రామచంద్రాపురం
గ్యాస్ట్రైటిస్ అనేది జీర్ణాశయానికి సంబంధించిన సమస్య. జీర్ణాశయానికి లోపల వైపున అనేక మ్యూకస్ పొరలు ఉంటాయి. వీటిలో మంట, వాపు ఏర్పడితే దాన్ని గ్యాస్ట్రైటిస్‌గా పరిగణిస్తారు. ఇది జీర్ణాశయ గోడలలో ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది.

 కారణాలు: ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, పొగతాగడం, రసాయనాలు వినియోగం ఎక్కువైనప్పుడు, ఇతరత్ర ఆరోగ్య సమస్యలకోసం మందులు అధికంగా వాడటం, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం, ఉపవాసాలు ఎక్కువగా ఉండటం, ఆస్పిరిన్, ఐబూప్రొఫెన్ వంటి మందుల్ని వాడటం వల్ల, హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ తలెత్తినప్పుడు గ్యాస్ట్రైటిస్ రావచ్చు. సమస్య కొంతకాలం పాటు వచ్చి తగ్గిపోతే దాన్ని అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటారు. సమస్య ఎక్కువకాలం పాటు బాధిస్తూ ఉంటే దాన్ని క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటారు.

 
లక్షణాలు:  జీర్ణాశయంలో లోపలి భాగంలో ఉండే జీర్ణాశయ పొరలలో ఇన్ఫెక్షన్ వచ్చి, జీర్ణప్రక్రియ కుంటుపడుతుంది. కడుపులో మంట వస్తుంది  పొడుస్తున్నట్లుగా కడుపులో నొప్పి రావడం, ఏదో మెలిపెట్టినట్లుగా కడుపు మధ్యభాగంలోనూ, కాస్తంత పై భాగంలోనూ నొప్పి రావడం జరుగుతుంది  వాంతులు, మలంలో రక్తం కనిపించవచ్చు  ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపించవచ్చు  గ్యాస్ట్రైటిస్ ముదిరితే కడుపులో అల్సర్స్ ఏర్పడటంతో పాటు క్యాన్సర్‌కు కూడా కారణం కావచ్చు. కడుపులోని ఇన్ఫెక్షన్ ఇతర ప్రాంతాలకూ పాకవచ్చు.

 
నిర్ధారణ: రక్తపరీక్షలు, సీబీపీ, మూత్రపరీక్ష, ఎక్స్-రే, మలపరీక్ష, ఈసీజీ, ఎండోస్కోపీ.

 
నివారణ: సరైన ఆహారపు అలవాట్లు పాటించడం, మంచి పోషకాహారం తీసుకోవడం, రసాయనాల వాడకం తగ్గించడం, ఆస్పిరిన్ వంటి మందుల వాడకం తగ్గించడం.

 
చికిత్స: హోమియోలో ఎలాంటి సమస్యలకైనా కాన్‌స్టిట్యూషనల్ చికిత్స ద్వారా క్రమేపీ రోగనిరోధక శక్తి పెంచుతూ వ్యాధి తీవ్రతను తగ్గిస్తూ, వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు.

 

డాక్టర్ ఎ.ఎం.రెడ్డి
సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి
హైదరాబాద్

 

 

ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్

 

 నా వయసు 62 ఏళ్లు. ఇటీవల మోకాళ్లలో నొప్పిగా ఉంటే డాక్టర్‌కు చూపించుకున్నాను. మోకాలి కీలులో ఆర్థరైటిస్ ఉందని చెప్పి ఆపరేషన్ అవసరమని చెప్పారు. ఆపరేషన్ తప్పదా? నాకు తగిన సలహా ఇవ్వండి. - ధనలక్ష్మి, అనంతపురం
ఇటీవల ఆర్థరైటిస్ సమస్య చాలా సాధారణంగా కనిపిస్తోంది. స్థూలకాయం, జీవనశైలి, క్యాషియం లోపం, విటమిన్-డి లోపం లాంటివి కీళ్ల అరుగుదలకు కారణమవుతాయి. కీళ్ల సమస్యకు అందుబాటులో ఉన్న చికిత్సల పట్ల పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం వల్ల చాలామంది కీళ్లలో ఆర్థరైటిస్‌కు సర్జరీ మేలు అని భావిస్తుంటారు. కానీ ఆర్థరైటిస్ దశను బట్టి మాత్రమే సర్జరీ అవసరమవుతుంది. ఆర్ఠరైటిస్ ఏ రకానికి చెందినప్పటికీ దానిలో వివిధ దశలు ఉంటాయి. ఒక్కో దశకు ఒక్కోరకమైన చికిత్స ఉంటుంది. సంప్రదాయ చికిత్సలన్నీ ఫెయిల్ అయినప్పుడు, వ్యాధి చివరి దశలో ఉన్నప్పుడు మాత్రమే సర్జరీ అవసరమవుతుంది. బరువు, వయసు, ఎముక నాణ్యత, పేషెంట్ ఫిట్‌నెస్ అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సర్జరీని ఎంచుకుంటారు.


ఈ దశల్లో ఆపరేషన్ అవసరం లేదు...
కీళ్ల వ్యాధిలో నాలుగు దశలుంటాయి. అవి...
1. కీలులో ఖాళీ ఎక్కువగా ఉండదు. కానీ నొప్పి వల్ల పేషెంటు చురుకుదనం తగ్గుతుంది. ఇది ప్రారంభదశ కాబట్టి చికిత్సగా మందులు, తగిన విశ్రాంతి, ఫిజియోథెరపీతో సరిపోతుంది.


 2. రెండో దశలో కీలులో ఖాళీ పెరుగుతుంది. నొప్పి కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ దశలో విశ్రాంతి, ఫిజియోథెరపీ మందుల వాడకంతో పాటు ఇంట్రా ఆర్ట్‌క్యులార్ ఇంజెక్షన్లు అవసరమవుతాయి.


 3 - 4 దశలు: ఈ దశల్లో కూడా సాధ్యమైనంత వరకు సంప్రదాయ చికిత్సలకే ప్రాధాన్యం ఇవ్వడాలి. ఇక తప్పదనుకుంటే కీహోల్ సర్జరీ లేదా మినిమిల్లీ ఇన్వేసివ్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీ ఎంచుకోవచ్చు. అయితే వ్యక్తి వయసు, బరువు, ఎముకల నాణ్యత, ఇతరత్రా ఆరోగ్య సమస్యలన్నింటినీ కీళ్ల సర్జరీ విజయవంతమవుతుందా, ఫెయిలవుతుందా అన్న అంశం ఆధారపడి ఉంటుంది.

 
సర్జరీ తప్పదనుకుంటే... చాలా సందర్భాల్లో ఆపరేషన్ కంటే మందులు వాడుతున్న వారిలోనే జీవనశైలిలో నాణ్యతను గమనించవచ్చు. అయితే సర్జరీ తప్పదనుకుంటే మినిమల్టీ ఇన్వేజివ్ సర్జరీ అయితే గాటు తక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా జాయింట్ ఆర్థరైటిస్ ఉన్న ప్రతి వ్యక్తికీ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీ అవసరం లేదు. దాదాపు 95 శాతం వరకు ఆర్థరైటిస్ పేషెంట్లలో సర్జరీ లేకుండానే వ్యాధిని తగ్గించవచ్చు. అయితే ఒకవేళ కీలుమార్పిడి శస్త్రచికిత్స ప్రక్రియను అది చివరి ఆప్షన్‌గా మాత్రమే ఎంచుకోవాలి. దానికంటే ముందు మందులు, ఫిజియోథరపీతోనే తగ్గించవచ్చు.

 

డా. ప్రవీణ్ మేరెడ్డి ఆర్థోపెడిక్ సర్జన్
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్

 

 

డర్మటాలజీ కౌన్సెలింగ్

నా వయసు 22 ఏళ్లు. నాకు జుట్టు విపరీతంగా రాలిపోతోంది. నా హెయిర్‌లైన్ కూడా క్రమంగా వెనక్కుపోతూ మాడు కనిపిస్తోంది. నేను అనిమిక్‌గా ఉంటాను. హిమోగ్లోబిన్ కూడా తక్కువే. కేవలం 10 శాతం మాత్రమే. దయచేసి నా జుట్టు రాలిపోకుండా ఉండటానికి తగిన సలహా ఇవ్వండి. - శిరీష, వరంగల్
జుట్టు రాలిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో పోషకాహార లోపం చాలా ప్రధానమైనది. పైగా మీ విషయంలో మీలో హిమోగ్లోబిన్ కేవలం 10 శాతం మాత్రమే అంటున్నారు. మీ రక్తహీతన కారణంగానే జుట్టు రాలిపోతూ ఉండవచ్చు. మీ వయసులో అంటే ఇరవైలలో ఉండే యువతలో ఇది చాలా సాధారణమైన విషయం. బహుశా మీ ఒత్తిడి కూడా జుట్టు రాలడానికి కారణం కావచ్చు. ఇవన్నీ కలిసి మీలో జుట్టు రాలడం ఎక్కువయ్యేందుకు దోహదపడుతూ ఉండవచ్చు. మీరు ఈ కింది సూచనలు పాటించండి.

 
మీలో రక్తహీనతను తగ్గించుకోండి. మీ హిమోగ్లోబిన్ పాళ్లు కనీసం 14 శాతానికి పెరగాలి. ఇందుకోసం ఫై సల్ఫేట్ 50 ఎంజీ మాత్రలు రోజుకు ఒకటి చొప్పున, విటమిన్-సి 500 ఎంజీ మాత్రలు రోజుకు ఒకటి చొప్పున మూడు నెలల పాటు వాడండి.

 
ఇక మీ జుట్టు రాలడాన్ని అరికట్టడం కోసం బయోటిన్ 10 ఎంజీ, సాపాల్మెథో లేదా ఇతర అమైనోయాసిడ్‌లను రోజుకు ఒకసారి చొప్పున భోజనం తర్వాత మూడు నెలల పాటు తీసుకోండి.

 
మీ జీవనశైలి (లైఫ్‌స్టైల్)లో మార్పులు చేసుకోవడం చాలా అవసరం. మీరు రోజూ కనీసం ఎనిమిది గంటల పాటు హాయిగా, గాఢంగా నిద్రపోయేలా చూసుకోండి.

 
పై సూచనలన్నీ పాటించాక కూడా మీ జుట్టు రాలడం తగ్గకపోతే ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా చికిత్స, మీసోథెరపీ వంటి ప్రక్రియలను మీ జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు.

 

డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ  చీఫ్ డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్,
గచ్చిబౌలి, హైదరాబాద్

 

మరిన్ని వార్తలు