లోకంలో అన్నిటికన్నా పెద్ద శత్రువు అదే!

27 Mar, 2016 10:49 IST|Sakshi
లోకంలో అన్నిటికన్నా పెద్ద శత్రువు అదే!

‘‘గోదావరీ నదీజలాలు పుష్కలంగా ఇక్కడి ప్రజల కాళ్ల కింది నించి పారుతూ వెళ్ళి వృథాగా సముద్రం పాలవుతుండగా, వీరు కరువుకాటకాల బారిన పడకుండా చూడడానికి... వాటిని అలా వదిలివెయ్యడంలో తగిన ఔచిత్యం కనిపించడం లేదు’’ అని ఆర్థర్ కాటన్ అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ‘‘నీవు ఆనకట్ట కట్టి నీటిని నిల్వచేసి కొన్ని వేల ఎకరాలు సాగు కావడానికి కారణం కాగలవా?’’ అని జవాబొచ్చింది.

అంతే! ఆయన గుర్రం వేసుకుని అరణ్యాల వెంట తిరిగి గోదావరి ప్రవాహ ప్రాంతమంతా పరిశీలించి ప్రాజెక్ట్ ఎక్కడ కడితే పది కాలాలపాటు నిలబడుతుందన్నది సర్వేచేసి చివరకు కొండల మధ్యనున్న ధవళేశ్వరం వద్ద అయితే బాగుంటుందని ఎంపిక చేశారు. ఆయన ఈ దేశంలో ఉన్నన్నాళ్లూ కష్టపడి ప్రాజెక్ట్ పూర్తిచేసి ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం కావడానికి కారణమయ్యాడు. ఒక దశలో ఆయన ఒక సంవత్సరం పాటు తీవ్రంగా అనారోగ్యం పాలయి, చివరకు ప్రాణాపాయంలో కూడా పడ్డాడు. కొద్దిగా కోలుకోగానే మళ్లీ వచ్చి ప్రాజెక్ట్ పని పూర్తిచేశాడు.

అందులోంచి నీళ్లు రైతుల పొలాలకు పారుతుంటే చూసి పొంగిపోయాడు. ఎక్కడివాడు? ఈ దేశంవాడా? ఈ జిల్లావాడా? ఈ ధర్మంవాడా? నిజమైన దేశభక్తుడన్నవాడు తన దేశప్రజల అవసరాలను గుర్తించి వాటిని పరిష్కరించాలని ఆయనే ఒకచోట రాసుకున్నాడు. ఒక్క లేఖ రాసినందుకు ప్రభుత్వం ‘‘నీవు చెయ్యగలవా?’’ అంటే ‘‘చెయ్యగలను’’ అని నిలబడడమే కాదు, ప్రాజెక్ట్ కట్టే సందర్భంలో వ్యక్తిగతంగానే కాదు, ఆరోగ్యపరంగానే కాదు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా అన్నింటినీ తట్టుకుని నిలబడ్డాడు. అంత గొప్ప ఆనకట్ట కట్టాడు. చరిత్రలోనే కాదు, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయాడు. ఒక సంకల్పానికి నిలబడడం అంటే అదీ.

జీవితంలో ఆశయ సిద్ధికోసం మనం నిర్ణయం తీసుకోవాలి. ఆ లక్ష్య సాధనలో భీతి ఉన్న నాడు, భగవంతుడు కూడా అనుకూలించి తీరతాడు, తూర్పుగోదావరి జిల్లాలోనే డొక్కా సీతమ్మ అనే ఒక మహాతల్లి తన ఆస్తులు కరిగిపోతున్నా వెరవక ఆకలితో తలుపుతట్టిన కొన్ని వందలమందికి ప్రతిరోజూ దగ్గరుండి ఆప్యాయంగా అన్నం తినిపించి పంపేది. మనకు తినడానికి లేదే అని భర్త వారిస్తే, ‘‘నేను పెట్టేటప్పుడు - సాక్షాత్తూ ఆ మహావిష్ణువే వచ్చి తింటున్నాడన్న భావనతో పెడతాను. ఎవర్ని నమ్మి పెడుతున్నానో వాడే చూసుకుంటాడు’’ అని  నమ్మి పెట్టింది. ఆమె పేరుమీద ఒక ఆక్విడక్ట్ కూడా కట్టారు. అప్పటి బ్రిటీష్ చకవర్తి తన పట్టాభిషేక మహోత్సవానికి ఆమె ఫొటోను కలెక్టర్ చేత తెప్పించుకుని ఒక సోఫాలో పెట్టి సతీసమేతంగా ఆమెకు నమస్కారం చేసుకున్న తరువాత పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆయన పంపించిన పట్టం ఇప్పటికీ ఉన్నది. ఆమెను ఆ స్థాయికి తీసుకెళ్ళింది ఏమిటి... కేవలం లక్ష్యశుద్ధి మాత్రమే.

అసలు లక్ష్యంపై నిలబడడానికి సంస్కార బలమొకటి ఏర్పడితే, హితశత్రువుని దాటగలిగితే అనవసరపు ఆకర్షణలకు ప్రలోభాలకు వశం కాకుండా నిలబడగలిగిన వాడవైతే అసలు ఒక కార్యం చేయడం కాదు, కార్యం ఎలా చేయాలన్న దానికి కూడా ఆదర్శమూర్తి అవుతాడు. అతనిని ఆదర్శంగా తీసుకుని కోట్లమంది ఆ మార్గంలో వెళ్లి తరిస్తారు. అలాంటి వాడు తయారుకావాలంటే ఆ విచక్షణా జ్ఞానానికి అవసరమైనది- హిత శత్రువునకు వశం కాకుండా ఉండగలగడమే.

తరువాత. అహిత శత్రువు. ఇది శత్రువు, దీని జోలికి వెళ్లకూడదని తెలుసు, కానీ వెళ్లకుండా ఉండలేడు. దీనితో ఉంటే నేను పాడైపోతానని తెలిసి కూడా అప్పటికది కల్పిస్తున్న సంతోషంలో, ఉద్వేగంలో దాన్ని విడిచిపెట్టలేక దానితో కూడి పాడైపోవడం. అందుకే సంగమం చాలా ప్రధానమైనది. ఎంత పెద్ద ఇనుపముక్క అయినా నీటితో చేరితే తుప్పుపట్టి పోతుంది. అదే అగ్నిహోత్రంతో కూడితే ఎలా కావాలంటే అలా వంగి లోకానికి ఉపకరిస్తుంది. దేనితో కూడామా అన్నది ముఖ్యం. దాన్ని గెలవడం తేలిక కాదు.

దేని జోలికి వెళ్లకూడదో దాని జోలికి వెళ్లవద్దు. దానితో ప్రయోగాలు చెయ్యవద్దు. ‘‘నేను అతీతుణ్ణండీ, నాకేమీ కాదనుకోవద్దు’’. ే అన్నిటికన్నా పెద్ద శత్రువు ... కాలం విలువ తెలుసుకోలేని అజ్ఞానం. అందుకే మహనీయుల చరిత్ర పుస్తకాలుగా రావాలి. వారు చెప్పిన మాటలు వినాలి. డొక్కా సీతమ్మగారి మీద, కాటన్‌గారి మీద, అలాంటివారి మీద పెద్దపెద్ద వేదికల పైన ప్రసంగాలు జరగాలి. లాల్‌బహదూర్ శాస్త్రి, అరబిందో, భగవాన్ రమణులు అటువంటి వారిని గురించి పిల్లలకు ప్రత్యేకంగా చెప్పాలి. అలా జరిగిన నాడే లక్ష్యసిద్ధి కలుగుతుంది. ఆ సంకల్పం ధృతితో కూడినదై అహిత శత్రువులను విడిచిన నాడు ఎవరి సంకల్పమైనా ఉత్తమ సంకల్పమై కొన్ని కోట్ల మందికి ఆదర్శవంతులవుతారు.

ఒక సంకల్పానికి కట్టుబడి ఉండడానికి మనకు స్ఫూర్తి ఎవరు? మనకు అడుగడుగునా కన్పించే హనుమ విగ్రహాలు చాలు. అలాగే మహనీయుల శిలామూర్తులు మనకు పలు ప్రాంతాల్లో  కనపడతాయి.

తూర్పు గోదావరి జిల్లాలో ధవళేశ్వరం, అమలాపురం, రావులపాలెం జంక్షన్... ఎక్కడికెళ్ళినా గుర్రం మీద కూర్చుని ఉన్న కాటన్ దొర కనబడతాడు.
 

మరిన్ని వార్తలు