పెత్తనం పోయి కర్ర మిగిలింది

15 Jul, 2019 00:03 IST|Sakshi

సాహిత్య మరమరాలు 

అబ్బూరి ఛాయాదేవి అబ్బూరి రామకృష్ణారావు కోడలు, వరద రాజేశ్వరరావు సహచరి అని అందరికీ తెలిసిందే. సన్నని లోగొంతుకతో, ఆగి ఆగి మాట్లాడే ఛాయాదేవి మాటల్లో మందుపూసిన కత్తివాదర లాంటి చమత్కారాలు తొంగిచూసేవి. భర్త చనిపోయాక, ఆయన వాడిన చేతికర్ర, వొంకీ పేముబెత్తాన్ని ఛాయాదేవి కూడా ఉపయోగించారు. ఒకసారి ఇంటికి వచ్చినవారు ‘ఈ చేతికర్ర వరద గారిది అనుకుంటాను’ అన్నారట. ‘అవునండీ! పెత్తనం పోయింది, కర్ర మాత్రం మిగిలింది’ అన్నారట ఛాయాదేవి.

ఇంట్లో వుండే పాత వస్తువులతో కళాకృతులు చేయటం ఛాయాదేవి హాబీ. ఒకరోజు ఆమె నిర్జీవంగా అనిపించిన చేతికర్రకు తన చీరల్లోని ఒక రంగులపూల డిజైను వున్న అంచును కత్తిరించి కర్రకు పైనుండి కిందిదాకా అలంకరించారు. ఇంటికి వచ్చినవారు ఎవరో ‘ఏమిటీ, చేతికర్రకు చీర చుట్టారు’ అని అడిగారట. అప్పుడామె తన సహజ ధోరణిలో ‘ఈ కర్ర నిన్నటిదాకా మగకర్ర. నేటి నుండి స్త్రీవాది’ అన్నారు. 
ఒకరోజు పెళ్లినాటి మాటలు చర్చకు వచ్చి, ‘నన్ను చౌకబారుగా కొట్టేశావు’ అన్నారట వరద. ‘అవును, మీరుండేది చౌకబారులో కదా’ అని చురక అంటించారట ఛాయాదేవి.

సేకరణ: శిఖామణి

మరిన్ని వార్తలు