చావు తర్వాత చావు గురించి...

3 Dec, 2018 02:24 IST|Sakshi

ప్రతిధ్వనించే పుస్తకం

‘స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళివంటిదే బ్రదర్‌’ అన్న చరణం వినగానే ఆ పాట రాసింది శ్రీశ్రీ అనిపిస్తుంది. కానీ, అది ఆచార్య ఆత్రేయది. పేరు చూడకుండా చదివితే మరణానంతర జీవితం నవల రావిశాస్త్రి రాసిందనిపిస్తుంది. కానీ, అది నందిగం కృష్ణారావుది. అంతే కాదు, ఈ పేరు చదవగానే ఇదో అలౌకిక జీవన వర్ణ చిత్రణ అనిపిస్తుంది. కానీ, ఇది పూర్తి స్థాయి లౌకిక వర్ణ వర్గ కుల సహితమైన నేటి సమాజపు వాస్తవ జీవన చిత్రణం. 

ఇందులో ఒక మరణం తరువాత ఏర్పడే శూన్యాన్ని సొమ్ముచేసుకునే ఆచరణలూ, వాటి చుట్టూ పోగేసిన నమ్మకాలూ, భయాలూ, మోసాలూ, ద్రోహాలూ కొనసాగడం చరిత్ర మాత్రమే కాదు, వర్తమానం కూడా. దీన్ని భవిష్యత్తులోకి సాగదీయడానికి ఎన్నో వ్యవస్థలు జీవితంలోని అభద్రతాభావాన్నీ, భవిష్యత్తు పట్ల దురాశనీ, సుఖభోగాల పట్ల లాలసనీ కలబోసి న్యాయంతో ధర్మాన్నీ నైతికతనీ ఏకమొత్తంగా పాతి పెట్టడానికి మన గ్లోబల్‌ విలేజ్‌ పడుతున్న పాట్లూ, సృష్టిస్తూన్న విధ్వంసాలూ అన్నీ ఇన్నీ కావు. 

మరణానంతర జీవితం నవల్లో మనిషి చావుని పెట్టుబడి లేని రాబడిగా మార్చుకునే వైనం కళ్ళకి కట్టినట్లుగా వివరించడం జరిగింది. ఇందులో కర్మకాండలు జరిపించే వివిధ కులాలవారు, వారి వృత్తివిద్యా ప్రదర్శనతో మొదలుపెట్టి.. ధనమదాంధులు, నాయకులు, డాక్టర్లు, లాయర్లు, చివరికి చావు కులాల్లో కొత్తగా చేరిన రకరకాల ఇన్సూ్యరెన్సు కులాలు, అందరికీ అయినవాళ్ళు, అన్నింటికీ అయినవాళ్ళు, ఎవ్వరికీ కాకపోయినా అన్నీ తామే అయి నిల్లుకునేవాళ్ళు, చివరికి జొన్నపొత్తులు కాల్చుకోవడానికి కాష్ఠంలో బొగ్గులేరుకునే నిర్భాగ్యులదాకా ఎంతమంది ఎన్ని విధాలుగానో ఎన్నెన్ని రకాల దోపిడీలకి పాల్పడతారో, ఇంకెన్ని రకాల దోపిడీలకి గురౌతారో మన కళ్ళకి కడుతుంది.

స్వార్థం, క్రౌర్యం, కుట్ర, కుత్సితం, కుహకం మొదలైనవన్నీ కలిసి మన మనసుని ఎన్నిరకాలుగా బూడిద చేస్తాయో తెలిసిన తరవాత మన చావు మనం చావడానిక్కూడా చచ్చేంత భయం వేస్తుంది. అయితే అదే సమయంలో ఆ భస్మంలోంచీ ఫీనిక్స్‌లా రెక్కలు విప్పుకునే ఆత్మ విశ్వాసం తలెత్తుకుని నిలబడి  చెడునించి సైతం మంచిని పిండగల నేర్పరితనం కూడా ఆవిష్కృతం అవుతుంది. మంచి నుండి చెడుకి సాగే పతనంతో బాటుగా చెడు నించీ మంచికి సాగే దారిని కూడా చూపించడం వల్ల చదువరిని నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది.
- జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

మరిన్ని వార్తలు