పెద్ద వ్యాఖ్యానం

11 Feb, 2019 00:35 IST|Sakshi

సాహిత్య మరమరాలు

సినీనటుడు జగ్గయ్య అరుదైన సాహితీవేత్త అని కొందరికే తెలుసు. తండ్రి సీతారామయ్య దగ్గర బాల్యంలో సంస్కృతాంధ్రాలను అభ్యసించిన జగ్గయ్య 15వ యేటే పద్యాలు రాశారు. ఆ తర్వాత రవీంద్రనాథ్‌ టాగూరు వివిధ కవితా సంపుటాల్లోంచి 137 ఖండికలను యెంచుకొని ‘రవీంద్ర గీత’ పేరుతో తెలుగులో అనువదించారు. 1980లో అవి పుస్తకంగా వచ్చాయి.

పురాణ ప్రబంధ కావ్యాలలోని విశేష ప్రయోగాల గురించి జగ్గయ్య షూటింగ్స్‌ లేని సమయాల్లో ఆ పరిజ్ఞానం గల విద్యావంతులతో చర్చించేవారు. అలా ఆయనకు దగ్గరైన వారిలో ‘ముత్యాలముగ్గు’ నిర్మాత, నూజివీడు కళాశాలలో ప్రధాన ఆంధ్రోపన్యాసకుడు అయిన ‘ఎమ్వీయల్‌’ ఒకరు. ఒకనాడు వాళ్లిద్దరి మధ్య ‘మను చరిత్ర’ ప్రథమాశ్వాసంలోని ప్రవరుని గుణగణాలకు సంబంధించిన ప్రసక్తి రాగా, ఎమ్వీయల్‌ ‘ఆపురి బాయకుండు’ పద్యంలో పెద్దన శైలిని ప్రశంసించారట. అప్పుడు జగ్గయ్య కలిగించుకుని పద్యాంతంలో ‘ప్రవరాఖ్యు డలేఖ్య తనూ విలాసుడై’ అనే ప్రయోగానికి తనదైన భాష్యం చెప్పారు. సంస్కృతంలో ‘తనూ’ శబ్దం స్త్రీ వాచకమనీ, అనేక పర్యాయ పదాలుండగా పెద్దన తనూ శబ్దం వాడ్డం ప్రవరుడు స్త్రీ అంతటి సౌకుమార్యం కలిగినవాడని సూచించడమేనని జగ్గయ్య ఆ పద ప్రయోగ రహస్యం గురించి వ్యాఖ్యానిస్తే ఆయన పాండిత్య పటిమకు ఎమ్వీయల్‌ అవాక్కయ్యారట!
- డాక్టర్‌ పైడిపాల
 

మరిన్ని వార్తలు