నీ పోరు పడలేను నాయుడుబావా

25 Mar, 2019 00:33 IST|Sakshi

సాహిత్య మరమరాలు 

చిత్రకారుడు, కథకుడు, కవి, నవలాకారుడు అడివి బాపిరాజు కళాసేవలో తన్మయులై వున్నప్పటికీ, వుద్యోగం పురుష లక్షణమనే భావంతో నాలుగేళ్లు న్యాయవాద వృత్తిని చేపట్టారు. సరసులు, సహృదయులు, సంపన్నులు అయిన గంధం వెంకయ్యనాయుడు దగ్గర జూనియర్‌గా చేరారు. అయితే బాపిరాజు వృత్తిలో పైకి రావాలనే ఆలోచన లేకుండా యెప్పుడూ కులాసాగా కాలక్షేపం చేసేవారు. చిత్రకారుడుగదా ఒకసారి యే మూడ్‌లో వున్నాడో విలువైన స్టాంపు మీద బొమ్మ వేశారు. 

అది చూసిన నాయుడు ‘‘ఇంకానయం. అదృష్టవశాత్తూ దానికి రంగులు వేయలేదు కాబట్టి శుభ్రంగా రబ్బరుతో చెరిపేసి వాడుకోవచ్చు’’ అని నవ్వి వూరుకున్నారు.

ఇంకోసారి ఓ పెద్ద కేసులో రికార్డు చూడమంటే, ‘‘నీ పోరు పడలేను నాయుడుబావా! నే రంగమెళ్లి పోతాను నాయుడుబావా’ అంటూ పాడటం మొదలెట్టారు బాపిరాజు. అయితే బాపిరాజు తత్వం తెలిసినవారు కాబట్టి నాయుడు కూడా తేలిగ్గా తీసుకుని నవ్వేశారు.

అయినాల కనకరత్నాచారి
 

మరిన్ని వార్తలు