ఫైజ్‌ హృదయపు వర్ణాలు

17 Dec, 2018 00:05 IST|Sakshi

‘నాకు తెలుసు, నా జీవితం పట్ల నాకూ భయం వుంది/ కానీ ఏం చేయను/ నేను వెళ్లాలనుకున్న దారులన్నీ/ మరణ శిక్షల నెల మీదుగా వెళ్తున్నాయి’ అంటాడో చోట ఫైజ్‌ అహ్మద్‌ ఫైజ్‌.
ఫైజ్, భారత్‌–పాకిస్తాన్‌ ప్రగతిశీల కవిగా, వామపక్షవాద కవిగా అమిత ప్రాచుర్యం పొందాడు. ఉర్దూ భాష ప్రత్యేకతను కాపాడుతూనే ప్రగతిశీల ఆలోచనలను అక్షరీకరించాడు. తన జీవిత కాలంలో 8 కవితా సంపుటాలు ప్రచురించాడు ఫైజ్‌. నఖ్స్‌ ఎ ఫర్యాది, దస్ట్‌ ఎ సభా, జిందా నామా, దస్త్‌ ఎ తాహ్‌ ఏ సంగ్, సర్‌ ఎ వాది ఏ సీనా, షాన్‌ ఎ షహర్‌ ఏ యారాన్, మేరే దిల్‌ మేరే ముసాఫిర్‌ , ఘుబార్‌ ఏ అయ్యాన్‌. ఆ ఎనిమిది సంపుటాల్లోంచి ఎంపిక చేసిన కవితలతో వెలువడ్డ ఆంగ్ల సంకలనం ‘ద కలర్స్‌ ఆఫ్‌ మై హార్ట్‌’. బారన్‌ ఫరూకీ అనువదించిన ఈ సంకలనంలో 57 కవితలున్నాయి. వాటి ఉర్దూ లిప్యాంతరీకరణ కూడా జత చేశారు. ఎప్పుడైతే మాట, పాట, గీత, రాత ప్రమాదంలో పడతాయో, ఎప్పుడైతే భిన్న అభిప్రాయాల వ్యక్తీకరణకు వీలు లేదో అప్పుడు సరిగ్గా ఫైజ్‌ కవిత్వం అవసరమవుతుంది. 
మాట్లాడు మిత్రమా మాట్లాడు
మాట్లాడు...
గొంతు మూగ పోకముందే
శరీరం మృతి చెందకముందే
మాట్లాడు
ఇప్పటికీ సజీవమయిన సత్యం కోసం
మాట్లాడు మిత్రమా మాట్లాడు
చెపాల్సినదంతా చెప్పేయి 
1911లో అప్పటి బ్రిటిష్‌ ఇండియాలోని పంజాబ్‌లో జన్మించాడు ఫైజ్‌. స్థితిమంతమైన కుటుంబమే. కానీ అది సామాజికంగా, రాజకీయంగా అత్యంత సంక్షోభ కాలం. ఆ సంక్షోభం సమాజంలోనే కాదు వ్యక్తులుగా మనుషులందరిలోకీ ప్రసరించింది. ఆ పరిస్థితుల్లో పెరిగిన ఫైజ్‌ ఉన్నత వర్గాలకు చెందిన అందరిలాగా పై చదువులకు విదేశాలకు వెళ్లకుండా లాహోర్‌లో ఇంగ్లిష్‌ సాహిత్యం, తత్వశాస్త్రం, అరబిక్‌లతో చదువు పూర్తి చేశాడు. అమృత్‌సర్‌లో కాలేజీ అధ్యాపకుడిగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించాడు. క్రమంగా కమ్యూనిస్టు భావాలతో ప్రభావితుడై పేదల పక్షాన జరిగే పోరాటాలకు మద్దతుగానూ, క్యాపిటలిస్టులకు వ్యతిరేకంగానూ గళమెత్తడం ఆరంభించాడు. వాటికి తోడు మనిషి అంతరంగ ఆవిష్కరణం కూడా కనిపిస్తుంది. ఇండియన్‌ ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌ ఉద్యమంలో ముల్క్‌ రాజ్‌ ఆనంద్, సజ్జద్‌ జహీర్, కిషన్‌ చందర్‌ లాంటి అనేక మంది గొప్ప సాహితీమూర్తులతో పాటు ఫైజ్‌ కూడా ప్రధాన భూమిక పోషించాడు.
‘నా కవిత్వంలో నేనెప్పుడూ ఉత్తమ పురుషలో ‘నేను’ అని రాయను, ‘మేము’ అని రాయడానికే ఇష్టపడతాను’ అని ఒక చోట రాసుకున్నాడు ఫైజ్‌. ‘ద కలర్స్‌ ఆఫ్‌ మై హార్ట్‌’ ఆయన వారసత్వాన్ని అర్థం చేసుకునేందుకు తోడ్పడుతుంది.
వారాల ఆనంద్‌ 
 

మరిన్ని వార్తలు