మూడు స్థితుల్లోని జీవితం

31 Dec, 2018 00:36 IST|Sakshi

ప్రతిధ్వనించే పుస్తకం 

ధనికొండ హనుమంతరావు శతజయంతి సంవత్సరం ఇది. ఆయన సుమారు 150 కథలు, మూడు నవలలు, తొమ్మిది నవలికలు, రెండు నాటకాలు, పన్నెండు నాటికలు రాశారు. మొపాసా కథలతోపాటు అనేక గ్రంథాలను అనువదించారు. పత్రికా సంపాదకుడిగా, ముద్రాపకుడిగా ఆయన సేవలు అపురూపమైనవి. 

ధనికొండ రాసిన గుడ్డివాడు నవలిక ప్రత్యేకమైనది. ఇది మానవ మనస్తత్వానికి అద్దం పట్టే నవల. బాగా కళ్లుండి లోకంలోని అందాల్ని ఆస్వాదిస్తూ ఉన్న వ్యక్తికి అకస్మాత్తుగా కళ్లు పోతే అతని ప్రవర్తన ఎలా ఉంటుందో దీని ద్వారా తెలుసుకోవచ్చు. బాహ్య సౌందర్యాన్ని చూడలేనప్పుడు అంతఃసౌందర్యాన్ని దర్శించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ నవలలో పాత్రలు తక్కువగా ఉన్నా సామాజిక సాంస్కృతికాంశాలకు కొదవ లేదు. 

జగన్నాథం ప్రమాదంలో కళ్లు పోగొట్టుకొని ఆసుపత్రిలో చేరతాడు. అక్కడ నర్సుతో ప్రేమలో పడతాడు. అక్కడే మరో నర్సుతోనూ ప్రేమాయణం సాగిస్తాడు. ఈ ప్రణయం అతని జీవితంలో ఎలాంటి భూకంపం సృష్టించిందో ధనికొండ అద్భుతంగా సృజించాడు. చూడ్డానికి త్రికోణ ప్రేమకథలా ఉన్నప్పటికీ ఇది ప్రధాన పాత్రల మధ్య జరిగే జీవన సంఘర్షణ. ఫ్రాయిడ్‌ తదితర మానసిక శాస్త్రవేత్తల ప్రభావం ఉన్న ధనికొండ మనుషుల మనసుల్ని చిత్రించడంలో ఆరితేరిన రచయిత. కళ్లు ఉన్నప్పుడు, కళ్లు పోయిన తరువాత, మళ్లీ కళ్లు వచ్చిన తరువాత, ఇలా జీవితంలోని మూడు సందర్భాల్లో జగన్నాథం ప్రవర్తన ఎలా ఉంటుందో చిత్రించాడు.

కళ్లు పోయిన జగన్నాథం కళ్ల కోసం ఆరాటపడతాడు. కళ్లు వచ్చిన తరువాత ‘నాకు కళ్లెందుకిచ్చావు? కళ్లు లేనప్పుడే నేను సత్యాన్ని చూడగలిగాను. కళ్లు ఉంటే చూసేదంతా మి«థ్య! ఈ ఘోరాన్ని చూసేందుకేనా నాకు దృష్టి నిచ్చింది?’ అని వాపోతాడు. సమాజంలో కనిపించే వివిధ అసమానతలు, కుటుంబ జీవితం, అనుబంధాలు, కులాలు, మతాలు, కులవృత్తులు మొదలైన అనేక అంశాలను ధనికొండ చిత్రించిన విధం మన కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. 

ధనికొండ శతజయంతి సందర్భంగా ఆయన సాహిత్యమంతా పన్నెండు సంపుటాల్లో ముద్రితమయింది. అందులో భాగంగా అనేక సంవత్సరాల తరువాత గుడ్డివాడు నవలిక కూడా  పునర్ముద్రణకు నోచుకుంది. విజయవాడ పుస్తక ప్రదర్శనలో ఈ పన్నెండు సంపుటాలు జనవరి 3న ఆవిష్కృతం కానున్నాయి.
మాడభూషి సంపత్‌ కుమార్‌
 

మరిన్ని వార్తలు