పెంచిన చేతుల్లోని ప్రేమ

3 Dec, 2018 03:08 IST|Sakshi
ఎమిలీ గిఫిన్‌ 

కొత్త బంగారం

తనకి 18 ఏళ్ళున్నప్పుడు మారియన్‌ గర్భవతి అవుతుంది. పుట్టిన పిల్లని దత్తతకు ఇచ్చేస్తుంది. దాని గురించి ఆమె తల్లికి తప్ప మరెవరికీ తెలియదు. ‘వేర్‌ వి బిలాంగ్‌’ నవల మొదలయ్యేటప్పటికి, మారియన్‌కు 37 సంవత్సరాలు. పేరు పొంది, డబ్బు గణించిన టీవీ ప్రొడ్యూసర్‌. పీటర్‌ అనే బోయ్‌ఫ్రెండు ఉంటాడు. వొక రాత్రి అతనితో పోట్లాడి, ఇంటికి వచ్చినప్పుడు, ఎదురుగా వొక అమ్మాయి కనిపిస్తుంది. ‘నా పేరు కిర్బీ రోస్‌. నేను దత్తత తీసుకోబడ్డాను. ఇదేదో ఆల్కహాల్‌ అనానిమస్‌ ఒప్పుకోలులా అనిపించినా, ఇవే నా గురించిన వివరాలు’ అంటూ, తనను పరిచయం చేసుకుంటుంది. 

కిర్బీని పెంచిన తల్లిదండ్రులకి, ఆ తరువాత మరో కూతురు పుట్టినా కూడా కిర్బీని ప్రేమగానే చూసుకుంటారు. ‘కిర్బీని  వదులుకున్న తల్లిదండ్రులు ఎటువంటివారో!’ అని వాళ్ళు మాట్లాడుకుంటుండగా విని, న్యూయార్క్‌ వచ్చి తల్లి మారియన్‌ వివరాలు కనుక్కుని, ఆమె ఇంటికి చేరుతుంది. ‘‘ఈమె నన్ను విడిచిపెట్టినందుకు నాకే బాధా కలగలేదు. నా తల్లిదండ్రులకి, నా జీవసంబంధమైన తల్లి గురించి ఏదీ తెలియకపోయినప్పటికీ, ‘ఆమె నన్ను వదిలేసింది’ అని కానీ, ‘ఇచ్చేసింది’ అని కానీ అనుకోవద్దు’ అని చెప్పేవారు’’ అంటుంది. 

కిర్బీ మళ్ళీ తన జీవితంలోకి ప్రవేశించడాన్ని ఇష్టపడదు మారియన్‌. పిల్ల మట్టుకు తల్లికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేసి, సాధిస్తుంది కూడా. కిర్బీ తండ్రయిన కాన్రాడ్‌తో తనకుండే ప్రేమా, ఆ ఎడబాటూ మరచిపోలేకపోయిన మారియన్‌ అతని గురించి మాట్లాడదు. నెమ్మదిగా, మారియన్‌ కూతురితో ఎక్కువ సమయం వెచ్చిస్తూ, అన్యోన్యత పెంచుకుంటుంది. మారియన్‌ ఖరీదైన బట్టలు కొనిచ్చినప్పుడు, మధ్య తరగతి కుటుంబంలో పెరిగిన కిర్బీకి అవి నచ్చినప్పటికీ, తీసుకోవడానికి మొహమాటం వేసి, వాటిని తిరిగిచ్చేస్తుంది. 

కిర్బీని తను ఎందుకు వదలుకోవాల్సి వచ్చిందో మారియన్‌ వివరిస్తుంది. కాన్రాడ్‌ ఆచూకీ తెలుసుకుని, అతనికి కూతురి గురించి చెప్తుంది. తండ్రితో కిర్బీ స్నేహం ఏర్పరచుకుంటుంది. ‘మీరిద్దరూ పక్కనే ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఎంతోమందికి ఇది మామూలే అయినా నన్ను సృష్టించిన ఇద్దరితో కలిపి నిలుచోవడం, వింతగా అనిపిస్తోంది’ అంటుంది. 

కూతుర్ని దూరం పెట్టడమే, తను ఇన్నేళ్ళూ అసంపూర్ణమైన స్త్రీనని భావించడానికి కారణమని గుర్తించిన మారియన్‌ తనని తాను క్షమించుకుని, కిర్బీని తన జీవితంలోకి ఆహ్వానిస్తుంది. పీటర్‌తో తనకి చాలినంత ప్రేమ లేదని గ్రహించి, అతన్ని విడిచిపెడుతుంది. కాన్రాడ్, మారియన్‌ను  క్షమిస్తాడు. ఒకానొకప్పుడు తమ మధ్య ఉండిన ప్రేమని ఇద్దరూ అంగీకరిస్తారు కానీ, ‘ఇప్పుడు మన మధ్య పంచుకునేవేవీ లేనప్పటికీ– ఒక విధంగా చూస్తే, వర్తమానం లేక భవిష్యత్తంత ముఖ్యమైన గతం ఉండనే ఉంది’ అనుకుని, తిరిగి కలిసి ఉండాలని అనుకోరు. తనని దత్తత తీసుకున్న కుటుంబమే తనదనీ, వారికన్నా ఎక్కువ తనని అర్థం చేసుకునేవారు ఎవరూ ఉండరనీ కిర్బీ కూడా గుర్తిస్తుంది.

రచయిత్రి ఎమిలీ గిఫిన్‌ రాసిన నవల తల్లీ, కూతురి దృష్టికోణాలతో సాగుతుంది. గతానికీ, వర్తమానానికీ మారుతూ ఉంటుంది. గంభీరమైన విషయాలుండక, కేవలం దత్తత అన్న అంశమే నవలంతా ప్రధానంగా కనిపిస్తుంది. రహస్యాలు ఇతరులపైన ఎంత ప్రభావాన్ని చూపుతాయో అనేకాక, వాటిని దాచిపెట్టిన వ్యక్తిని కూడా అవి ఎలా ప్రభావితం చేస్తాయో అని చెబుతుంది పుస్తకం. పాత్రలనూ, సందర్భాలనూ రచయిత్రి వర్ణించే విధానం వల్ల కథ ఏ మలుపు తిరగబోతుందో పాఠకులు ఊహించగలిగే యీ నవలను 2012లో సెంట్‌ మార్టిన్స్‌ ప్రెస్‌ ప్రచురించింది.
- కృష్ణ వేణి

మరిన్ని వార్తలు