2047లో ఊపిరి ఆడదా? 

22 Jun, 2019 01:04 IST|Sakshi

స్వాతంత్య్రం వచ్చిన వందేళ్లకు..ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా .మానవహక్కుల పరిరక్షణలో నంబర్‌వన్‌గా..భావప్రకటనకు తలమానికంగా.. స్త్రీ, పురుష సమానత్వంలోముందంజగా ఉంటుందని మన విశ్వాసం! కాని ఒక సమాజంగా మనం వెనకబడిపోతున్నామని.. శీలమనే గోడల మధ్య బందీ అవుతామని.. స్వేచ్ఛకు ఊపిరాడదనీ.. ఇలాంటి భావవ్యక్తీకరణల్లో ఈ కథనం ముందంజలో ఉంది

2047... ఆర్యావర్త ప్రాంతం... మిలిటరీ తరహా ప్రభుత్వ పాలన.. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న దేశం. అలాంటి సహజ వనరులను తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి.. ఆ ప్రాంతాన్ని పూర్తిగా హిందూ దేశంగా.. ఆర్యావర్తగా మార్చే ప్రయత్నం మొదలై.. అది కొంత సఫలమై అప్పటికి మూడేళ్లు. హిందువుల్లో కూడా మళ్లీ కుల విభజన, వర్గ విభజన ఆ పాలన నైజం. అందుకే ఎటు చూసినా సెక్టార్లు.. హద్దులుగా పెద్ద పెద్ద గోడలు. అగ్ర కులాలు.. అందునా ఉన్నత ఉద్యోగులకు.. ఒక సెక్టార్‌.. నిమ్న కులాలు.. వర్కింగ్‌ క్లాస్‌కు ఇంకో సెక్టార్‌.. దళితులకు ఆ హద్దులన్నిటికీ ఆవల.. స్లమ్స్‌లో నివాసం. ఈ ఆర్యావర్త ప్రభుత్వం వాళ్లకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తూంటుంది. చాలా పరిమితంగా.  ఒకరకంగా చెప్పాలంటే వెలివాడలవి. 

... అందునా కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న మహిళలైతే బానిసలు. అలా పెళ్లిళ్లు చేసుకున్న, తమ హక్కుల కోసం గొంతెత్తిన ఆడవాళ్లను  వెదికి మరీ పట్టుకొచ్చి ‘‘వనితా విముక్తి కేంద్రం’’లో పెడ్తారు. ఆ ఆడవాళ్లు తమ పవిత్రతను పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజూ జవాన్ల బూట్లు తుడవాలి. ఉన్నతులైన పురుషులు తిన్న ఎంగిలి విస్తళ్లల్లో పొర్లుదండాలు పెట్టాలి. తొట్టిలోని  మురికి నీటిలో స్నానం చేయాలి. ఆ మానసిక హింస గాయపెట్టకుండా పూట పూటకు స్టెరాయిడ్స్‌లాంటి మాత్రలు వేసుకోవాలి. ఇవన్నీ మౌనంగా సహిస్తూ.. క్రమశిక్షణ పాటిస్తున్న వాళ్లను పవిత్రతను నిరూపించుకునే పరీక్షకు ఎంపిక చేస్తారు. అలా నిరూపించుకున్న వాళ్లను విముక్తులను చేసి బయటకు అంటే వాళ్ల తల్లిదండ్రుల దగ్గరకు పంపిచేస్తారు. ఫెయిలైన వాళ్లను లేబర్‌ క్యాంప్‌కు తరలిస్తారు. 

పిల్లలు.. ఆర్యావర్త సంస్కృతీ, సంప్రదాయాలకు సార«థులు.. వారధులు. కులాంతర, మతాంతర వివాహాల వల్ల పుట్టిన పిల్లలను సంకరజాతిగా పరిగణించి.. ‘‘ప్రాజెక్ట్‌ బలీ’’ అనే ఆర్యావర్త ప్రభుత్వ కార్యక్రమం కోసం ఉపయోగిస్తుంటారు. 

తిరోగమనమా? పురోగమనమా? అనిపిస్తోంది కదా! ఇప్పటి కొన్ని పరిస్థితులకూ అద్దం పడ్తోందన్న మాటా వినిపిస్తోంది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతున్న ‘లేలా’ అనే వెబ్‌సిరీస్‌ కథ. ప్రయాగ్‌ అక్బర్‌ (బీజేపీ మాజీ మంత్రి, లైంగిక వేధింపుల ఆరోపణలున్న ఎమ్‌జె అక్బర్‌ కొడుకు) రాసిన నవలను అదే పేరుతో  తెరకెక్కించారు ప్రముఖ సినీ దర్శకురాలు దీపా మెహతా. 

లేలా...
షాలిని (హుమా ఖురేషి)... బాగా చదువుకున్న, ప్రోగ్రెసివ్‌ థాట్స్‌ ఉన్న ఒక హిందూ స్త్రీ. రిజ్వాన్‌ చౌదురి(రాహుల్‌ ఖన్నా) అనే ముస్లిం యువకుడిని ప్రేమించి పెళ్లిచేసుకుంటుంది. వాళ్లకు పుట్టిన బిడ్డే లేలా. ఆ బిడ్డ కోసం షాలినీ అన్వేషణే ఈ సిరీస్‌. 

మంచి ఉద్యోగాలు చేస్తూ.. ఏ లోటూ లేకుండా ప్రశాంతంగా...  కూతురే లోకంగా బతుకుతూంటారు షాలినీ, రిజ్వాన్‌లు. అప్పటికే ఆర్యావర్త ప్రభుత్వం ఏర్పడి యేడాది అవుతుంది. ఒకరోజు.. ఇంట్లోని స్విమ్మింగ్‌ పూల్‌లో షాలిని, రిజ్వాన్‌లు తమ కూతురు లేలాకు ఈత నేర్పిస్తుంటే దుండగులు జొరబడి రిజ్వాన్‌ తల బాది.. షాలినీని ఎత్తుకుపోతారు. ఈ హఠాత్పరిణామానికి బిక్కచచ్చిపోతుంది నాలుగేళ్ల లేలా. స్విమ్మింగ్‌ పూల్‌లో రిజ్వాన్‌ అచేతనమైపోతాడు. 

రెండేళ్లు..
 షాలినీని వనితా విముక్తి కేంద్రంలో పెడ్తారు. అన్నీ  సహిస్తూనే అక్కడి నుంచి పారిపోవడానికి దారి వెదుకుతూంటుంది ఆమె.  అంతలోకే కులాంత వివాహం చేసుకుందని ఇంకో అమ్మాయినీ తీసుకొస్తారు అక్కడికి.  వీళ్లతోపాటు ఒక లేడీ డాక్టర్, ఆస్తి హక్కు కోసం తల్లిదండ్రుల మీద కేసు పెట్టిన మహిళ.. కులాంతర వివాహం చేసుకొని చంటిబిడ్డలతో సహా పట్టుకొచ్చిన తల్లులూ ఉంటారు  ఆ కేంద్రంలో. వీలైనంత త్వరగా ప్యూరిటీ టెస్ట్‌ పెట్టించుకొని అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంటున్న  ఒక మహిళ.. ఆ కేంద్రాన్ని పర్యవేక్షిస్తున్న గురు మా (పురుషుడే)కు ఇన్‌ఫార్మర్‌గా మారుతుంది. ఈ క్రమంలో ఆ కేంద్రంలోని చంటి పిల్లల ప్యూరిటీ టెస్ట్‌ కోసం ఓ వైద్యబృందం వస్తుంది. ఒక బిడ్డ రక్తనమూనాల్లో తల్లితోపాటు తక్కువ కులంలోని తండ్రి రక్తమూ ఉందని ఆ పసికందును  తీసుకెళ్లిపోతారు. ఆ పాప ప్రక్షాళన కోసం ఆమెకు కుక్కతో పెళ్లి జరిపిస్తారు. ఆ అవమానం తట్టుకోలేక ఆమె ఆ బిల్డింగ్‌ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది.  ఇది సద్దుమణిగేలోపే కులాంతర వివాహం చేసుకున్న ఆ కొత్త బందీ ప్రెగ్నెంట్‌ అని తేలుతుంది. గురుమాకు తెలిసి అబార్షన్‌ చేయమని లేడీ డాక్టర్‌కు ఆర్డర్‌ వేస్తాడు. చేశానని చెప్తుంది కాని డాక్టర్‌.. అబార్షన్‌ చేయదు. దీన్ని ఆ ఇన్‌ఫార్మర్‌ పసిగట్టి.. గురుమాకు చెప్పబోతుంటే ఆమెను బాత్రూమ్‌లో బంధించి ఆ అవకాశాన్ని తాను ఉపయోగించుకుని ప్యూరిటీ టెస్ట్‌తో బయట పడాలనుకుంటుంది షాలిని. వెళ్లి గురుమాకు చెప్తుంది ఆ కొత్తమ్మాయికి అబార్షన్‌ జరగలేదు అని. నిజం చెప్పి షాలిని.. ఆర్యావర్తకు అభిమాన పాత్రురాలైందని.. తెల్లవారే ఆమె ప్యూరిటీ టెస్ట్‌కు ఏర్పాట్లు చేస్తాడు గురుమా. ఆ టెస్ట్‌లో లేడీ డాక్టర్‌ను, ఆ కొత్త బందీని రెండు వేర్వేరు సెల్స్‌లో పెడ్తారు. షాలినికి ఒక డివైజ్‌ ఇచ్చి... బటన్‌ నొక్కమని చెప్తాడు గురుమా. ఆ బటన్‌ నొక్కితే ఆ ఇద్దరూ ఉన్న సెల్స్‌లోకి గ్యాస్‌ విడుదలై వాళ్ల ప్రాణాలు గాల్లో కలుస్తాయి. షాలిని విముక్తురాలై బయటకు వెళ్లిపోతుంది. షాలిని.. ఆ పని చేయదు. దాంతో ఆ ఇన్‌ఫార్మర్‌ను పిలిపిస్తాడు గురుమా. ఈ చాన్స్‌ కోసమే ఎదురు చూస్తున్న ఆ మహిళ.. వెంటనే బటన్‌ నొక్కుతుంది. గ్యాస్‌ విడుదలై ఆ ఇద్దరూ చచ్చిపోతారు. రెండేళ్లు అందులో మగ్గిన షాలినీని.. ప్యూరిటీ టెస్ట్‌ ఫెయిలయిందని లేబర్‌ క్యాంప్‌కు పంపిస్తారు. ప్యూరిటీ టెస్ట్‌ పాసైనా ఆ ఇన్‌ఫార్మర్‌ను వనితా విముక్తి కేంద్రంలోనే ఉంచుతారు. ఆమెను తీసుకెళ్లడానికి తల్లిదండ్రులు, అన్న, తమ్ముడు రాలేదని. బయటకు వెళితే స్త్రీకి రక్షణ ఉండదని. 

లేబర్‌ క్యాంప్‌
విముక్తి కేంద్రం నుంచి లేబర్‌ క్యాంప్‌కు తీసుకెళ్తున్నప్పుడే తప్పించుకుని తన కూతురి కోసం రిజ్వాన్‌ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తుంది షాలిని. కూతురు అక్కడ ఉండకపోగా  షాలిని మరిది.. ఆమె మీద విరుచుకుపడ్తాడు. ‘‘నువ్వు మా అన్నను పెళ్లి చేసుకోవడం వల్లే ఇదంతా జరిగింది’’ అంటూ. విస్తుపోతుంది అతని  ప్రవర్తనకు. ఈలోపు లేబర్‌ క్యాంప్‌ గార్డ్‌ భాను (సిద్దార్థ) ఈ ఇంటికి వచ్చి షాలినీని తీసుకొని వెళ్లిపోతాడు. లేబర్‌ క్యాంప్‌ ద్వారా ఆమెకు ఒక ఇంజనీర్‌ ఇంట్లో సర్వెంట్‌ ఉద్యోగం దొరుకుతుంది. నగరానికి ఎయిర్‌ కండిషన్‌ డోమ్స్‌ను ఏర్పాటు చేయడానికి ఆ ఎన్‌ఆర్‌ఐ ఇంజనీర్‌ను అమెరికా నుంచి రప్పిస్తుంది ప్రభుత్వం. ఆ ఏసీ డోమ్స్‌ వల్ల విపరీతమైన వేడి పుట్టి.. రేడియేషన్‌కు చుట్టుపక్కల ఉన్న స్లమ్స్‌ అన్నీ మాడి మసైపోతాయని.. ఇది ఒకరకమైన మారణహోమం అని.. దాన్ని ఎలాగైనా ఆపాలని.. ఆర్యావర్త సిద్ధాంతాలను వ్యతిరేకిస్తున్న విప్లవకారులను కోరుతాడు ఆ ఇంజనీర్‌. వాళ్లతో రహస్య సంబంధాలు పెట్టుకుంటాడు. వాళ్లలో ఒకడే భాను. ఆర్యావర్త ప్రణాళికలను తెలుసుకోవడానికి లేబర్‌ క్యాంప్‌ గార్డ్‌గా పనిచేస్తుంటాడు. ఆ నిజం షాలినీకి తెలుస్తుంది. సహకరిస్తే.. ఆమె కూతురును వెదకడంలో సహాయం చేస్తానంటాడు భాను. అసలామె వనితా విముక్తి కేంద్రానికి రావడానికి.. ఆ సిబ్బందికి ఉప్పందించింది ఆమె మరిదేననే సీక్రెట్‌ కూడా చెప్తాడు. హతాశురాలవుతుంది షాలిని. ఇంకోవైపు ఎయిర్‌కండిషన్‌ డోమ్స్‌ను తయారు చేస్తున్న ఇంజనీర్‌ మీద అనుమానం వచ్చి అతని కుటుంబాన్నీ చంపేయిస్తుంది ఆర్యావర్త ప్రభుత్వం. ఎలాగైనా ఆ మారణహోమాన్ని ఆపాలని.. ఆ ప్లాన్‌ వివరాలు ఆర్యావర్త ప్రభుత్వాధినేత జోషి తర్వాత వ్యక్తి అయిన రావు ఆఫీస్‌లో ఉంటాయని.. అది తమకు అందివ్వాలని చెప్తాడు భాను. అందుకు ఆమెను రావు ఇంట్లో సర్వెంట్‌గా చేరుస్తాడు. 

రావుగారింట్లో..
ఆర్యావర్త ప్రభుత్వం బ్యాన్‌చేసిన పాకిస్తానీ కవి, రచయిత.. ఫైజ్‌ అహ్మద్‌ఫైజ్‌కు వీరాభిమాని.. రావు. రహస్యంగా ఫైజ్‌ పాటలను వింటూంటాడు. ఈ బలహీనతను అడ్డం పెట్టుకుని భాను అడిగిన వివరాలను లాగొచ్చని అనుకుంటుంది  షాలినీ. శ్రద్ధగా పనిచేస్తూ.. అతని అనుంగు సేవకులలో ఒకరిగా చేరుతుంది. చాటుగా ఫైజ్‌ పాటలను తెచ్చిస్తూ అతని నమ్మకాన్ని సంపాదిస్తుంది. ఆ చనువుతో ఆమె గతాన్ని తెలుసుకుంటాడు అతను. కూతురు లేలీ గురించీ చెప్పేస్తుంది. జాలిపడ్తాడు రావు. ఆర్యావర్త పట్ల తనకున్న అసమ్మతినీ వెళ్లగక్కుతాడు. ఈ చాన్స్‌ను ఉపయోగించుకుందామని షాలినీ ప్లాన్‌ చేసుకునే లోపే.. షాలినీకున్న కూతురి బలహీనతను తన రాజకీయ ఎత్తుగడకు వాడుకుందామనుకుంటాడు. కూతురి ఆచూకీ పట్ల ఉన్న తన ఆరాటాన్ని, తపనను.. అటు విప్లవకారులు.. ఇటు రాజకీయ నేతలు పావుగా మలచుకుంటున్న తీరుకు కుమిలిపోతుంది షాలిని. కాని తప్పదు.. బిడ్డ ముఖ్యం అని మనసును స్థిరం చేసుకుంటుంది. ఈ వేటలో లేలా ఎక్కడో కాదు.. ఇంతకు ముందు తనకు సర్వెంట్‌గా పనిచేసిన అమ్మాయి ఇంట్లోనే ఉందని తెలుస్తుంది.  ఆ సర్వెంట్‌ కుటుంబం ఇప్పుడు బాగా సంపన్న కుటుంబంగా మారిపోతుంది. తన కూతురి పేరు విజయా యాదవ్‌గా మార్చేస్తుందా సర్వెంట్‌. ఆమె భర్త జోషీకి పీఏగా ఉంటూంటాడు. రావు ఇంట్లోని ఆఫీస్‌కు వస్తూంటాడు. ఒకసారి రాత్రి పూట.. రావు ఆఫీస్‌లో ఎయిర్‌ కండీషన్స్‌ డోమ్స్‌ ఆపరేషన్‌ ఫైల్స్‌ను ఫోటో తీస్తుంటే చూస్తాడు. కూతురిని మరచిపోతే కాపాడ్తానని, లేదంటే జైలే అని బెదిరిస్తాడు. సరే అన్నట్టుగా తలూపుతుంది షాలినీ. భానుకి అన్నీ చెప్తుంది. త్వరలోనే షాలిని కూతురు చదువుతున్న స్కూల్లో ఫంక్షన్‌ ఉంటుంది. అక్కడ గ్యాస్‌ బాంబ్‌ను ప్రయోగించమని ఆ బాంబ్‌ను షాలినీకిస్తాడు భాను. తను క్రిమినల్‌ను కాదని.. అలాంటివి చేయలేనంటుంది. కూతురు కావాలంటే తప్పదు అని హెచ్చరిస్తాడు. బాంబ్‌ తీసుకొని ఫంక్షన్‌కు వెళ్తుంది. దానికి ఆర్యావర్త అధినేత జోషీ వస్తాడు. అతనిని సన్మానించే వాళ్ల జాబితాలో ఆమె పేరూ పెడ్తాడు రావు. సన్మానం పేరుతో జోషీ దగ్గరకు వెళ్లిన షాలినీ తన చేతిలోని బాంబును చూపించి అతణ్ణి బెదిరిస్తుంది. పోలీసులు వస్తారు. అక్కడితో ఫస్ట్‌ సీజన్‌ ఎండ్‌!   

మరిన్ని వార్తలు