ఎడారి కాయని జీవితం

4 Mar, 2019 00:00 IST|Sakshi

కొత్త బంగారం 

సౌదీలో భవన నిర్మాణంలో కూలీగా పని చేస్తానని ఊహించుకున్న నజీబ్‌ ఆశలను తలకిందులు చేస్తూ అక్కడ మసారా (మేకల శాల)కి కాపరిగా నియమిస్తాడు అర్బాబ్‌.  మానవ సహవాసం లేక, మేకలకి తన బంధువుల పేర్లు పెట్టి, వాటితో మాట్లాడటం మొదలెడతాడు నజీబ్‌.

బెన్యామిన్‌ రాసిన మలయాళీ నవల ‘గోట్‌ డేస్‌’లో, కేరళ యువకుడైన నజీబ్‌ చిరకాల వాంఛ గల్ఫ్‌ దేశాల్లో ఉద్యోగం సంపాదించుకోవడం. ‘బంగారం వాచ్, గొలుసు, ఫ్రిజ్, టీవీ, వీసీఆర్, ఏసీ’లతో కూడిన జీవితం వంటి చిన్న కోరికలే అతనివి. బయటి ప్రపంచం గురించి తెలియక, ‘అమ్మకానికున్న వీసా’ తీసుకుని ఇల్లు తాకట్టు పెడతాడు. గర్భవతైన భార్యని వదిలి, 1992లో సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ వెళ్తాడు. అక్కడ ‘తన కలల సంరక్షకుడు, తన లక్ష్యాలను నెరవేర్చే’ అర్బాబ్‌ (యజమాని) అతన్ని విమానం నుండి దించుకుంటాడు.

నజీబ్‌ను ట్రక్కులో ఎడారికి తీసుకెళ్తాడు అర్బాబ్‌. భవన నిర్మాణంలో కూలీగా పని చేస్తానని ఊహించుకున్న నజీబ్‌ ఆశలను తలకిందులు చేస్తూ అక్కడ మసారా(మేకల శాల)కి కాపరిగా నియమిస్తాడు. నజీబ్‌ ‘అనవసరమైన ఆరోగ్య అవసరాలకని నీరు వృథా చేయకూడదు’. మూడు పూటలా బ్రెడ్డు, పాలే భోజనం. మేకలకి మేత వేస్తూ, పాలు పితుకుతూ, వాటిని ఇసుక దిబ్బల మీద తిప్పుతూ– అర్బాబ్‌ తిట్లూ, దెబ్బలూ తింటుంటాడు. మానవ సహవాసం లేక, మేకలకి తన బంధువుల, స్నేహితుల పేర్లు పెట్టి, వాటితో మాట్లాడటం మొదలెడతాడు. అతని పాస్‌పోర్ట్‌ యజమాని దగ్గర పెట్టుకుంటాడు. జీతం ఇవ్వడు.

‘ఈ పరిస్థితి నేను కన్న కలల నుండి ఎంత దూరమో గుర్తించాను. దూరం నుండి మాత్రమే ఆకర్షణీయంగా కనిపించే పరాయి చోట్ల గురించి కలలు కనకూడదు. అవి యధార్థం అవనప్పుడు, రాజీ పడటం ఇంచుమించు అసాధ్యం’ అనుకున్న నజీబ్, అల్లా చిత్తంపైన ఉన్న విశ్వాసంతో– తన ఒంటరితనాన్నీ, పరాయీకరణనీ ఎదురుకోగలుగుతాడు. మరుసటి మూడేళ్ళల్లో ‘పేలు పట్టి, అట్టలు కట్టిన జుత్తు, పొడుగు గడ్డంతో కంపు గొడ్తున్న ఆటవికుడి’గా మారతాడు. ఒక పిల్లాడిని చూస్తూ తనకి పుట్టిన కొడుకుని తలచుకుంటుంటాడు. ఆ పిల్లవాడి అంగచ్ఛేదానికీ, మరణానికీ సాక్షి అవుతాడు. తన జాగాలో, తనకిముందు అక్కడ పని చేసిన వ్యక్తి ఎముకలు ఇసుకలో కనబడినప్పుడు గానీ తనెంత దారుణమైన పరిస్థితిలో ఇరుక్కున్నాడో అర్థం చేసుకోలేకపోతాడు.

తప్పించుకునే అవకాశం దొరికినప్పుడు ఇక తాత్సారం చేయడు. ఎడారిలో అతని ప్రయాణం బాధాకరమైన రీతిలో వర్ణించబడుతుంది. అతనితో పాటు బయల్దేరిన ఇద్దరిలో ఒకడు మరణిస్తాడు. మరొకతను మాయం అవుతాడు. ఏ గుర్తింపు పత్రాలూ లేకుండా ఒక్కడే నాగరికతలోకి అడుగు పెడతాడు. ‘చావకుండా మిగిలి ఉండాలంటే ఇదొక్కటే నాకున్న దారి’ అనుకుంటూ, జైలు అధికారులకి లొంగిపోతాడు. అక్కడ నుండి అతన్ని ఇంటికి పంపుతుంది ప్రభుత్వం.

‘రచయితలు ఎడారులను జ్ఞానోదయ స్థలాలంటారు. ఆధ్యాత్మిక పునరుజ్జీవనం కలిగిస్తాయంటారు. నాకైతే, ఎడారి ఏ విధంగానూ ప్రాణం పోయలేదు. అక్కడ నేను మూడేళ్ళకి పైగానే ఉన్నాను’ అంటాడు నజీబ్‌. ‘ఇది నాకు నిజజీవితంలో తెలిసిన మనిషి అనుభవాల గురించిన పుస్తకం’ అంటారు రచయిత బెన్యామిన్‌(ఇది కలంపేరు. అసలు పేరు బెన్నీ డెనియల్‌). మేకల వివరాలు నిండి ఉన్న ఈ పుస్తకం– శరీరాన్నీ, మనస్సునూ కూడా తీవ్రంగా అణచివేసే, వణుకు పుట్టించే వృత్తాంతం. దేవుని మీద నమ్మకం అండగా లేకపోతే, నజీబ్‌ పరిస్థితి– ఓటమికీ, స్వీయ నిర్మూలనకీ దారి తీసి ఉండేది.
నాలుగు భాగాలుగా ఉన్న పుస్తకం ఉత్తమ పురుష కథనం. సంభాషణా శైలితో ఉండి, డైరీలా అనిపిస్తుంది. అలంకార ప్రాయమైన భాష ఉండదు. ఈ నవలను సౌదీ అరేబియాలోనూ, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోనూ నిషేధించారు. జోసెఫ్‌ కోయిపల్లి ఇంగ్లిష్‌లోకి అనువదించిన ఈ నవలను 2012లో పెంగ్విన్‌ బుక్స్‌ ప్రచురించింది.  ‘ద మ్యాన్, ఏషియన్‌ లిటరరీ అవార్డ్‌’ కోసం లాంగ్‌లిస్ట్‌ అయింది.
-కృష్ణ వేణి

మరిన్ని వార్తలు