గ్రేట్‌ రైటర్‌; నగై కఫూ

25 Feb, 2019 00:05 IST|Sakshi

నవల ఏదో రాయాలని కూర్చునే ఒక మహిళ ఎలాంటి దుస్తులు ధరిస్తుందో చూడకుండా ఆమెలాంటి ఒక పాత్రను సృష్టించలేను అంటాడు నగై కఫూ (1879–1959). ఇంతటి సూక్ష్మ వివరాల మీద కూడా కఫూకు ఎంతో పట్టింపు. అందుకే ఎంతో శోధించిన అంశాలను కూడా వాటికి తాను సాక్షిగానో, పరిశీలకుడిగానో లేని కారణంగా రాయకుండా వదిలేసేవాడు. అంతటి చిత్తశుద్ధి కారణంగానే కఫూ ఆధునిక జపాన్‌ సాహిత్యంలో గొప్ప రచయితగా పేరొందాడు. స్ట్రేంజ్‌ టేల్‌ ఫ్రమ్‌ ఈస్ట్‌ ఆఫ్‌ ద రివర్, గీశా ఇన్‌ రైవల్రీ, అమెరికన్‌ స్టోరీస్, ద రివర్‌ సుమిద, డ్యూరింగ్‌ ద రెయిన్స్, ఫ్లవర్స్‌ ఇన్‌ ద షేడ్, డ్వార్ఫ్‌ బాంబూ, ప్లెజర్‌ ఆయన రచనలు.

రచన అనేది రాసేవాడి వ్యక్తిత్వంగా కఫూ భావిస్తాడు. వ్యక్తిత్వం వెల్లడి కానిదానిమీద ఆయనకు ఆసక్తి లేదు. తెలిసిన సబ్జెక్టును మళ్లీ మళ్లీ రాయడం మీద ఆయనకు అయిష్టత లేదు. సమాజం వల్ల ద్వితీయ శ్రేణి పౌరులుగా తిరస్కరించబడి జీవితంతో పోరాడే వాళ్లు అందుకే ఆయన రచనల్లో తిరిగి తిరిగి దర్శనమిస్తారు. కేవలం రాజకీయ ముఖం మాత్రమే చూపే వార్తాపత్రికలను రోజుల తరబడి చదవకుండా గడిపేవాడు. తీవ్ర భావోద్వేగంలో కాకుండా ఆలోచనాయుత స్థితి నెలకొన్నాకే రాయాలనీ, సహానుభూతి లేని అంశాలను స్పృశించకూడదనీ ఆయన పెట్టుకున్న నియమాలు.  
 

మరిన్ని వార్తలు