తొందరే అన్ని పన్లనీ నాశనం చేసేస్తోంది

25 Feb, 2019 00:04 IST|Sakshi

ప్రతిధ్వనించే పుస్తకం

అబ్బాయీ, మన డేరా ఇవాళ ఇక్కడుంది. పశువులు ఇక్కడి గడ్డిని మేస్తాయి. ఈ చుట్టుప్రక్కల మనుష్యులవీ పశువులవీ మలమూత్రాలు కనపడ్డం మొదలెడతాయి. అప్పుడు ఈ చోటు వదలి మరో చోటుకి వెళ్లిపోతాం. అక్కడ కొత్తగా మొలిచిన పచ్చిక ఎక్కువగా ఉంటుంది. 

రాహుల్‌ సాంకృత్యాయన్‌ రచన ‘ఓల్గా నుంచి గంగకు’లో క్రీ.పూ. 2500 ఏళ్ల కింద జరిగిన కథగా చెప్పే ‘పురుహూతుడు’లో తాతకూ, పురుహూతుడికీ మధ్య జరిగే సంభాషణ ఆసక్తికరంగా ఉంటుంది. దీని అనువాదం చాగంటి తులసి. అది ఇక్కడ:

‘‘ఈ రాగిని చూసినా, వ్యవసాయపు పొలాల్ని చూసినా నా గుండె మండుతుంది. ఈ రెండూ వక్షునదీ తీరానికి వచ్చిన్నాటినుంచీ అంతటా పాపం అధర్మం పెరిగిపోయేయి. దేవతలూ కోపగించేరు. అంటువ్యాధులు ఎక్కువైపోయేయి. కొట్టుకోడాలు నరుక్కోడాలు ఎక్కువైపోయేయి’’ అన్నాడు తాత.

‘‘ఇంతకు పూర్వం ఈ రెండూ లేవా తాత?’’ పురుహూతుడు అడిగేడు.

‘‘లేవురా అబ్బాయీ! ఇవి నా చిన్ననాటి రోజుల్లో కొద్దికొద్దిగా అప్పుడప్పుడే వచ్చేయి. మా తాతైతే వీటిపేరన్నా వినలేదు. ఆ కాలంలో రాతితో చేసినవీ, ఎముకలతో చేసినవీ, కర్రతో చేసినవీ ఆయుధాలు ఉండేవి.’’

‘‘అలాగా! అయితే కలప నెలా కోసేవారు తాతా?’’

‘‘రాతి గొడ్డలితో.’’

‘‘చాలాసేపు పడుతూ ఉండి ఉంటుంది. ఇంతబాగానూ తెగి ఉండి ఉండదు.’’

‘‘ఇదిగో ఈ తొందరే అన్నిపన్లనీ నాశనం చేసేస్తోంది. ఇప్పుడు రెణ్నెల్లకి సరిపడే గ్రాసాన్నో సగం బతుక్కి ఉపయోగపడే స్వారీ గుర్రాన్నో ఇచ్చి ఓ రాగి గొడ్డలి తీసుకో. ఆ తర్వాత అడవులకి అడవులు నరికేసి ధ్వంసం చేసెయ్యి. ఊళ్లకి ఊళ్లు చంపేసి నాశనం చేసెయ్యి. అయితే ఊళ్లు అడవిలో చెట్లలా ఆయుధాలు లేకుండా లేవు. వాటిదగ్గరా అంత పదును గొడ్డలీ ఉంది. ఇదిగో ఈ రాగి గొడ్డలి యుద్ధాల్ని మరింత క్రూరంగా మార్చేసింది. దీనితోగాని గాయం అయిందా విషపూరితమైపోతుంది. పూర్వం అయితే బాణపు ములుకులు రాతివి ఉండేవి. అవింత పదునుగా ఉండేవి కావు కాబట్టి సరిపోయేది. అయితే నేర్పరుల చేతుల్లో అవీ ఉపయోగపడేవి. ఇప్పుడీ రాగి ములుకులతో ముక్కుపచ్చలారని పిల్లకాయలూ పులిని వేటాడేద్దామనుకుంటున్నారు. ఇప్పుడిహ ఎవరైనా గొప్ప విలుకాణ్ణవాలని ఎందుకనుకుంటాడు?’’

‘‘తాతా! నువ్వు చెప్పేవాటిల్లో ఓ దానిని నేను ఒప్పుకుంటున్నాను. మనిషి ఓ దగ్గరే కట్టిపడి ఉండటానికి పుట్టలేదు. నిజం.’’

‘‘అవున్రా అబ్బాయీ! రోజూ చేసినచోటే దానిమీద దానిమీదే మల విసర్జన చెయ్యడం ఎంత అసహ్యకరం! మన డేరా ఇవాళ ఇక్కడుంది. పశువులు ఇక్కడి గడ్డిని మేస్తాయి. ఈ చుట్టుప్రక్కల మనుష్యులవీ పశువులవీ మలమూత్రాలు కనపడ్డం మొదలెడతాయి. అప్పుడు ఈ చోటు వదలి మరో చోటుకి వెళ్లిపోతాం. అక్కడ కొత్తగా మొలిచిన పచ్చిక ఎక్కువగా ఉంటుంది. అక్కడ నేలా నీరూ గాలీ ఎక్కువ పరిశుద్ధంగా ఉంటాయి.’’

‘‘అవున్తాతా! నాకూ అలాంటి నేలంటేనే ఇష్టం. అలాంటిచోట నా పిల్లంగోవి ఇంకా తియ్యగా పలుకుతుంది.’’

మరిన్ని వార్తలు