శ్రీశ్రీ సినీగేయ ప్రస్థానం

15 Jun, 2020 01:34 IST|Sakshi

స్మరణ(జూన్‌ 15న శ్రీశ్రీ వర్ధంతి)

శ్రీశ్రీ సినిమా పాటకు శ్రీకారం చుట్టడం, మహాప్రస్థానం గ్రంథరూపంలో వెలువడ్డం– రెండూ 1950లోనే కావడం యాదృచ్ఛికం. 1940లో విడుదలైన కాలచక్రంలో శ్రీశ్రీ మహాప్రస్థాన గీతం కొన్ని మార్పులతో ఉపయోగించబడినా, దాన్ని ఆయన తన మొదటి సినిమా పాటగా పరిగణించలేదు. 1950లో ఆర్‌.ఎస్‌.జునార్కర్‌ దర్శకత్వంలో వచ్చిన ఆహుతి డబ్బింగ్‌ చిత్రంతోనే శ్రీశ్రీ సినీ వ్యాసంగం ప్రారంభమైంది. నీరా ఔర్‌ నందా హిందీ చిత్రానికి తెలుగు సేత అయిన ఆ చిత్రంలోని 9 పాటలనూ శ్రీశ్రీయే రాశారు. వాటిలో మొదటిదైన ‘ప్రేమయే జనన మరణ లీల’ అనేది తన ప్రథమ గీతమని శ్రీశ్రీ స్వయంగా పేర్కొన్నారు. సినిమా కోసం శ్రీశ్రీ యెక్కువ పాటలు రాసిన మొదటి చిత్రం 1952లో విడుదలైన మరదలు పెళ్లి. శ్రీశ్రీ సుమారు 200 స్ట్రెయిట్‌ చిత్రాలకు, 80 డబ్బింగ్‌ చిత్రాలకు కలిపి దాదాపు వెయ్యి పాటలు రాసినా, సంఖ్యాపరంగా డబ్బింగ్‌ పాటలే యెక్కువ కావడం విచిత్రం!

బహుముఖంగా చిత్రగీతాలు రాసిన శ్రీశ్రీ ఆ రంగంలో అనేక ధోరణులకు ఆద్యులూ అగ్రగణ్యులూ అయ్యారు. మాతృకకు మక్కికి మక్కి కాకుండా అవసరమైన మేరకు మాత్రమే ‘లిప్‌సింక్‌’ను పాటించి, తెలుగు నుడికారంతో డబ్బింగ్‌ రచనలు చేసి, దానికొక ఒరవడి ప్రవేశపెట్టారు. వామపక్ష భావజాలంతో సామ్యవాద గీతాలను రాసి సినీ పరిశ్రమలో చైతన్య గీతాలకు అంకురార్పణ చేశారు. తెలుగు సినిమాల్లో యెక్కువ దేశభక్తి గీతాలను రచించిన ఖ్యాతి కూడా ఆయనకే దక్కుతుంది. మహాప్రస్థానం, ఖడ్గసృష్టి కవితా సంకలనాల్లో ముందుగా వెలువడి, ఆ తరువాత పాటలుగా సినిమాలకెక్కినవి పాతికకుపైనే ఉన్నాయి. ఈ విషయంలో కూడా అగ్రతాంబూలం శ్రీశ్రీదే. ఆకలిరాజ్యం, మహానది సినిమాల్లో కథనాయకుడు(కమల్‌హాసన్‌) మహోద్రేకంగా శ్రీశ్రీ కవితల్ని ఉటంకించడం తెలుగు సినీకవుల్లో ఆయనకు మాత్రమే దక్కిన ఘనత.

కవిత్వంలో ఛందోబందోబస్తులను ఛట్‌ఫట్‌ చెయ్యమన్న శ్రీశ్రీ అనేక సాంఘిక చిత్రాల్లో కూడా పద్యాలను రచించారు. బొబ్బిలి యుద్ధంలో మధురాతి మధురమైన జావళీని రాసి తనకు చేతకాని ప్రక్రియ లేదని నిరూపించారు. తన పాటల్లో తనకు నచ్చినది మాత్రం ‘పంతాలు పట్టింపులు’లోని ‘ఇనుకోరా, ఇనుకోరా, ఈ మల్లన్న మాటే ఇనుకోరా’గా ప్రకటించారు. ఆరాధనలోని ‘నా హృదయంలో నిదురించే చెలీ’ ప్రేమగీతంలో ఆ చెలి యెవరని ఓ విమర్శకుడు ప్రశ్నిస్తే , ఆ చెలి కమ్యూనిజమని చమత్కరించారు.

శ్రీశ్రీ పేరు చెప్పగానే మూడు ముఖ్యమైన పాటలు గుర్తొస్తాయి. అవి– తెలుగు సినిమా పాటకు మొదటి జాతీయ పురస్కార గౌరవాన్ని దక్కించిన అల్లూరి సీతారామరాజు చిత్రంలోని ‘తెలుగు వీర లేవరా’. బతుకు మీద విరక్తితో ఆత్మహత్యకు పూనుకొన్న ఓ వ్యక్తిని ఆ ప్రయత్నం నుంచి విరమింపజేసి పూర్ణాయువును పోసిన వెలుగు నీడలు చిత్రంలోని ‘కలకానిది విలువైనది’. ఓ కన్నడ ప్రేక్షకుణ్ని సైతం కేవలం ఆ పాట కోసం ఇరవై సార్లు ఆ సినిమా చూసేలా చేసిన పునర్జన్మ చిత్రంలోని ఓ సజీవ శిల్పసుందరీ.

శ్రీశ్రీ నిజాయితీ, నిబద్ధత గల సహృదయ కవి. తెలుగు వీర లేవరా పాటలో సింహాలై గర్జించాలి అనే చోట వ్యాకరణ దోషం వుందని తనే చెప్పి ఆ తర్వాత సవరించుకున్నారు. కలకానిది పాటలోని రెండు పంక్తుల భావం ఆ పాట తమిళ వెర్షన్‌ రాసిన నారాయణ కవిదనీ ఆ ఘనత తనకు చెందదనీ ప్రకటించారు. దేవత చిత్రంలోని బొమ్మను చేసి ప్రాణము పోసి పల్లవి వీటూరిదని ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.

30 ఏప్రిల్‌ 1910న జన్మించిన శ్రీశ్రీ 15 జూన్‌ 1983న అస్తమించారు. ఆయన అవసాన దశలో రాసిన నేటిభారతంలోని అర్ధరాత్రి స్వతంత్రం అంధకార బంధురం అనే విప్లవ గీతం ఆయనకు ప్రభుత్వమిచ్చిన ఏకైక నంది పురస్కారం– అది ఆ తర్వాత వచ్చిన అనేక స్వాతంత్య్ర సంబంధిత గీతాలకు స్ఫూర్తినిచ్చింది.
-పైడిపాల

మరిన్ని వార్తలు