హత్యతో ముడిపడిన చరిత్ర

13 Aug, 2018 00:12 IST|Sakshi

కొత్త బంగారం

1921– బోంబే. మిల్లు యజమాని ఫరీద్‌ మరణిస్తాడు. అతని ముగ్గురు వితంతువులు– రజియా, సకీనా, ముంతాజ్‌–  జనానాలో ఉంటారు. పేరున్న వకీలైన జమ్షెడ్‌ మిస్త్రీ కూతురు పెర్వీన్, ఇంగ్లండ్‌ నుంచి ‘లా’ చదివి వచ్చిన 23 ఏళ్ళ యువతి. అప్పట్లో, స్త్రీలకు కోర్టులో వాదించే హక్కు ఉండకపోయినందువల్ల తండ్రి ఆఫీసులో దస్తావేజులు తయారు చేస్తూ, క్లయింట్లకి సలహాలిస్తుంటుంది. వితంతువులు ముగ్గురూ తమ ‘మెహ్ర్‌’ను మదరసా కట్టేందుకు రాసిచ్చారని వారి హౌస్‌ ఏజెంట్‌ ముక్రీ నుంచి తండ్రికి వచ్చిన ఉత్తరాన్ని చూసి, నివ్వెరపోతుంది. ముంతాజ్‌కు చదువు రాదన్న సంగతిని ఆమె సంతకానికి బదులున్న ‘ఇంటూ మార్క్‌’ను బట్టి గ్రహిస్తుంది.

ఆ వితంతువులు మగవారితో ముఖాముఖీ మాట్లాడరు, ఇల్లు విడవరు. బోంబే సీ వ్యూ స్ట్రీట్లో ఉన్న, ‘మలబార్‌ హిల్‌’ ఇంట్లో, పరదాలో ఉండే ఆ భార్యలతో ఏకాంతంగా మాట్లాడే పని పెర్వీన్‌ మీద పడుతుంది. ముగ్గురూ కలిసే ఉండి కూడా, ఒకరితో మరొకరు తమ రహస్యాలనూ, పథకాలనూ పంచుకోరు. అప్పుడు నెలకొన్న ఉద్రిక్తతలు– ‘ముక్రీ హత్యకూ, మరొక హత్యా ప్రయత్నానికీ దారి తీస్తాయి. ఆఖరి పేజీలలో– స్నేహితురాలైన బ్రిటిష్‌ అమ్మాయి ఏలిస్‌ సహాయంతో పెర్వీన్‌ హంతకులెవరో కనిపెడుతుంది. న్యాయవాద వృత్తిలో ఎదిగి, భారతదేశపు మొట్టమొదటి స్త్రీ వకీలు అవుతుంది.

కథాంశానికి సమాంతరంగా పెర్వీన్‌ గత వ్యక్తిగత జీవితం నడుస్తుంది. ఇంగ్లండ్‌ వెళ్ళక ముందు కలకత్తాలో సోడా వ్యాపారం చేసే సైరస్, ఆమెని ఆకర్షించి పెళ్ళి చేసుకుంటాడు. పాతకాలపు పార్శీ ఆచారాలని పాటించే అత్తగారింట్లో బహిష్టు సమయాన పెర్వీన్‌ను విడిగా, ఇరుకు గదిలో నెలకి 8 రోజులుంచుతూ, ‘బినామాజీ’ ని పాటించేవారు. అప్పుడు, తనని తాను శుభ్రపరచుకునే అనుమతి కూడా ఉండేది కాదామెకి. తన తాత, తండ్రికి ఉన్న ఆస్తుల కోసమే సైరస్‌ తన్ని పెళ్ళి చేసుకొమ్మని అడిగాడనీ, అతను అంటించుకున్న సుఖవ్యాధులు తనకీ సంక్రమించాయనీ పెర్వీన్‌ గ్రహిస్తుంది. ఆ కారణం ఆధారంగా, అప్పుడు విడాకులు మంజూరు చేయబడేవి కావు కనుక ఆమె భర్తతో చట్టబద్ధంగా దూరంగా, క్షేమంగా ఉండేందుకు, తండ్రి కలకత్తా కోర్టులో కేసు వాదించి గెలిపిస్తాడు. తల్లి, అన్న కూడా పెర్వీన్‌కు పూర్తి సహకారాన్ని అందించే ఆధునిక కుటుంబం ఆమెది. వర్తమానంలో సైరస్‌ మరణించడంతో, పెళ్ళి అన్న బంధంనుండి బయట పడుతుంది పెర్వీన్‌.

ప్రథమ పురుషలో ఉండే సుజాతా మెస్సీ రాసిన, ‘ద విడోస్‌ ఆఫ్‌ మలబార్‌ హిల్‌’ కథ, 1920ల పార్శీల చరిత్రతో, ‘ముస్లిమ్‌ పర్సనల్‌ లా’తోనూ ప్రారంభించి, వలస రాజ్యపు చరిత్ర గురించి కూడా విడమరిచి చెబుతుంది. రెండు భిన్నమైన మతాల గురించిన కథనం విసుగు పుట్టించదు. వందేళ్ళ కిందట స్త్రీల జీవితాలు ఎంత దుర్భరంగా ఉండేవో చెప్తారు రచయిత్రి. కట్టడాల్లోనూ, అకౌంట్లు చూడ్డంలోనూ సిద్ధహస్తులైన పార్శీల కష్టపడే స్వభావాన్నీ, వారి పదజాలాన్నీ ఆసక్తికరంగా వర్ణిస్తారు. అప్పటి వారి భోజనం, వస్త్రధారణ, ఆచారాల వంటి రోజువారీ వివరాలని కళ్ళకి కట్టేలా వివరిస్తూ, గడిచిపోయిన కాలాన్ని సజీవంగా పాఠకుల ముందుంచుతారు. వారికి ఇంటి పేరుండకపోవడం బ్రిటిషర్లకి నచ్చనందువల్ల, వారి వృత్తే ఇంటి పేరయేది. ఉదా: మిస్త్రీ, సోడావాలా.

భారతదేశపు మొట్టమొదటి స్త్రీ వకీలైన కొర్నీలియా సోరబ్జీ జీవితాన్ని ఆధారంగా తీసుకుని రాసిన యీ నవలను, సోహో ప్రెస్, 2018 జనవరిలో ప్రచురించింది. ఆడియో పుస్తకం ఉంది.
- కృష్ణ వేణి

మరిన్ని వార్తలు