పరివర్తన

15 Sep, 2019 04:54 IST|Sakshi

జేబులో షాపమ్మాయి పర్సు ఉంది. వెల్లావెట్టీలో మాదకద్రవ్యాల వ్యాపారులందరి పేర్లూ ఒకదాని తర్వాత ఒకటిగా అతడి మెదడులో తిరగసాగాయి. వాటి మధ్యలో హఠాత్తుగా పద్మావతి అన్న పేరు కూడా ప్రత్యక్షమైంది. ‘పద్మావతి!’ ఎంత చక్కని పేరు!! కొద్దిరోజుల కిందట ఇలాగే ఒక దొంగతనం చేశాడు.

గోల్డ్‌లీఫ్‌ సిగరెట్‌ పీక అతడి చేతిలో నుంచి జారిపోయి కొన్ని గిరికీలు కొట్టిన తర్వాత మాత్రమే నేల మీద పడింది. అతడు దాన్ని చూస్తూ ఒక్క క్షణం ఆలోచనారహితంగా నిల్చుండిపోయాడు. సిగరెట్‌ కాసేపు ఎర్రగా మెరిసి ఆ తర్వాత తెల్లని బూడిదగా మిగిలిపోయింది.చివరిగుక్క పొగని కాసేపు నోట్లేనే ఉంచుకున్నాడు. ముందున్న రోడ్డు వైపు చూస్తూ ఒక్కసారిగా పొగని విడిచిపెట్టాడు. అతడి పెదవుల మధ్య నుంచి, నోట్లోంచి వచ్చిన పొగ గాలిలో సుడులు తిరిగింది. తర్వాత బాంబలిపట్టియా కూడలిలోని దుమ్మూ ధూళిలో కలిసిపోయింది.

రెండు ప్రైవేట్‌ బస్సులు పోటీలు పడి పరుగెత్తుకుంటూ వచ్చాయి. జంక్షన్‌లోనే ఉన్న బస్టాపులో జాక్‌పాట్‌ యంత్రం వద్ద ఆగిన రేసు గుర్రాల్లా ఆగాయి. యూనిటీప్లాజా భవనం వెనుక సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ ఆకాశహర్మ్యం నీడ గాలెరోడ్డుపై పడుతోంది. అది కరకు కాంక్రీటు నిర్మాణమైనా, దాని నీడ మాత్రం చల్లగా ఉంది. సముద్రం పైనుంచి వీచిన చల్లని గాలులు అతని శరీరాన్ని గిలిగింతలు పెడుతున్నాయి.ఉదయం పీల్చిన హెరాయిన్‌ పట్టు అతడి మెదడు మీద ఇంకా పూర్తిగా చెదిరిపోలేదు. కాని ఇప్పుడు ఈ గాలికి ఎగిరిపోయినట్లు అనిపిస్తోంది. అప్పుడు ఎంతో సంతోషాన్నిచ్చిన తలలోని మత్తు ఇప్పుడు దిగిపోతూ చికాకు కలిగిస్తోంది. హెరాయిన్‌ తీసుకుని చాలాసేపైంది. కాని ఈ క్షణంలో నిటారుగా నిలబడలేకపోతున్నాడు. మోకాళ్ల పైనుంచి శరీరం రెండు ముక్కలుగా చీలిపోతున్నట్లుంది.సముద్రతీరంలో పద్నాలుగు అంతస్తుల భవనంపైన ‘కేసిన్‌ అండ్‌ రేసింగ్‌’ అనే పెద్ద అక్షరాలు పడమటి ఆకాశంలో ప్రకాశిస్తున్నాయి. 

అతడి దృష్టి అంతా అక్కడ బస్సు కోసం నిల్చుని ఉన్న యువతి మీదనే, కాదు ఆమె భుజంలోని బ్యాగు మీదనే ఉంది.ఆమె కురులను చిరుగాలి ప్రేమగా లాలిస్తూ నిమురుతోంది. మాటిమాటికీ తన చేతికి ఉన్న గిల్టు రిస్టువాచీ చూసుకుంటోంది.ముఖం మీద పడుతున్న ముంగురుల్ని మృదువైన వేళ్లతో పైకెత్తుకుంటోంది. ఆమె ఉంగరాల జుట్టు కింద కప్పబడిపోయిన చెవులకు చక్రాల్లాంటి బంగారు రింగులు వేలాడుతున్నాయి. దగ్గర్లో ఉన్న ఎలక్ట్రికల్‌ దీపపు కాంతి వాటి మీద పడి అవి మెరుస్తూ ఉన్నాయి. అతడికి అవి ఎంతో ఆకర్షణీయంగా కనబడుతున్నాయి.

అతడి చెయ్యి ఒకటి డెనిమ్‌ ప్యాంటు జేబులో ఉంది. రెండో చేతిలో ఒక మడతపెట్టిన ఇంగ్లిష్‌ వార్తాపత్రిక ఉంది. ఆమె తన తలని గాలి తాకిడి నుంచి తప్పుకోవడానికి ఇటూ అటూ తిప్పుతున్నప్పుడు లిప్‌స్టిక్‌ పూసిన పెదవులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్రయత్నంగా అతడు కూడా తన పెదవులను నాలుకతో తడుపుకున్నాడు.అతడి చూపులు ఆమె శరీరాన్ని తడుముతున్నాయి. ఇది గ్రహించి అప్రమత్తం చెందాడు. తన దృష్టిని మరల్చుకున్నాడు. ప్యాంటు జేబు తడుముకున్నాడు. రెండు రూపాయల నాణెం తగిలింది.

‘ఇంత ఘోరంగా చేతిలో డబ్బులేని రోజు గతంలో ఎన్నడూ లేదు’ అనుకున్నాడు. ఒకప్పుడు తన తోటి వారందరికీ గంజాయిని ఒక్కొక్క గుక్క తేలిగ్గా ఉచితంగా సరఫరా చేసేవాడు. కాని ఏరోజూ నిద్రిస్తున్న తన చెల్లి మెడలోంచి బంగారు గొలుసును కాజేసి ఇంటి నుంచి వచ్చేశాడో అప్పుడే ఉజ్వలమైన జీవితం అకస్మాత్తుగా ఆగిపోయింది. రోడ్డున పడిపోయాడు. ఆ తర్వాత సిగ్గు విడిచి ఇంటికి వెళ్లినా, తనను చూడగానే విలువైన వస్తువులన్నీ రహస్య ప్రదేశాల్లోకి తరలిపోతున్నాయి. తనను ఎవ్వరూ నమ్మడం లేదు. తన చేతికి ఏమీ చిక్కడం లేదు. అప్పుడు బయటకు వచ్చేవి తన తల్లి కన్నీళ్లు మాత్రమే. వాటికి రూపాయి విలువ కూడా ఉండదు.కాని తల్లి కన్నీరు అత్యంత విలువైన రోజులు కూడా ఉన్నాయి. గతంలో తాగిన తండ్రి ఇంటికి వచ్చి ఆమెతో గొడవ పడేవాడు. అప్పుడామె కన్నీరు కార్చేది. ఆ కన్నీటితో పాటు తన కన్నీరు కూడా కలిసిపోయేది. ఇప్పుడామె గురించి ఆలోచనలు అతని కంటికి కన్నీరు తెప్పించడం లేదు. ఈరోజు ఆమాత్రం కన్నీరు కార్చాలంటే కనీసం రెండు ప్యాకెట్లు హెరాయిన్‌ కావాలి.

ఆ యువతి ఎదురుచూస్తున్న బస్సు ఇంకా రాలేదు కాబోలు, లేదా ఆమె కోసం ఏదైనా సిబ్బంది బస్సు వస్తుందేమో! కాకపోవచ్చు. సిబ్బంది వాహనం కోసమైతే క్యూలో నిల్చోవలసిన అవసరం ఉండదు. 
ఆమె భుజానికి వేలాడుతున్న నల్లని బ్యాగు మీదనే అతడి కళ్లున్నాయి. అదే ప్రస్తుతం అతని లక్ష్యం. దాన్ని కాజెయ్యాలి. యవ్వనపు ఒంపు సొంపులతో నిగనిగలాడుతున్న ఆమె శరీరాకృతి అతనిలో ఒక విధమైన మదన వికారాన్ని మేల్కొలిపింది. ఆ హ్యాండ్‌బ్యాగును కొట్టేసే నెపంలో ఆమె శరీరపు మృదు స్పర్శ కూడా పొందవచ్చు.

అతనిలో ఉప్పొంగుతున్న కోరికలను తీర్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఒక పదిమంది పడతుల వల్ల పొందే సుఖం కన్నా ఒక చిన్న ప్యాకెట్‌ మాదకద్రవ్యం ఎక్కువ సౌఖ్యాన్నిస్తుంది. ఒకసారి హెరాయిన్‌ వాడకం మొదలుపెట్టిన తర్వాత అతడి ప్రియురాలు దిస్నాని మరచేపోయాడు. డ్రగ్స్‌ తీసుకోవడం మానెయ్యమని ఆమె ఎంతగానో బతిమాలేది. ఒత్తిడి చేసేది. చివరకు ఆమే దూరమైపోయింది. ఇప్పుడామెని కలుసుకోవాలనే ఉత్ప్రేరణ కూడా పూర్తిగా లేకుండాపోయింది.

గత ప్రేమకథ గురించి తలపోసి దిగులుపడటం వల్ల ప్రస్తుతం తలపెట్టిన కార్యం చెడిపోవచ్చని భయపడ్డాడు. ఏ పనికైనా లక్ష్యసాధనలో సెంటిమెంట్లకు తావు ఇవ్వకూడదు.యువతి హ్యాండ్‌బ్యాగును తెరిచి ఒక చిన్న నాణేల పర్సు తీసింది. తీస్తూనే ఆమె పేవ్‌మెంట్‌ పైనుంచి కిందకు దిగి వీధిలోకి వచ్చింది.సరిగ్గా ఆ సమయంలోనే ఒక బస్సు వచ్చి ఆగింది. కండక్టరు ఒక చేత్తో బస్సుని పట్టుకున్నాడు. ఇంచుమించు ఆమెను కౌగలించుకుని లోనికి లాక్కొన్నట్లే రెండోచెయ్యిని చాచి ఉన్నాడు. అతడు కూడా ఫుట్‌బోర్డు ఎక్కాడు. ఆమెను ముందుకు నెట్టుకుంటూ కండక్టరు మోచేతి కింది నుంచి బస్సులోనికి ప్రవేశించాడు.

‘‘ఇప్పుడు బస్సెక్కిన వాళ్లంతా టికెట్‌కు సరిపడా చిల్లర పట్టుకుని రెడీగా ఉండండి... బాంబల పట్టీ.. వెల్లా పట్టీ, దెహీవెలా.. గాల్‌కిస్స..’’ కండక్టర్‌ బిగ్గరగా అరిచాడు.‘గాల్‌ కిస్సా’ అన్నదా యువతి. ఆమె గొంతు శ్రావ్యంగా ఉంది. అతడు బస్సులోంచి ఎటో వీ«ధిలోనికి చూస్తున్నట్టు నటించాడు. అతడి జేబులో రెండు రూపాయలు మాత్రమే ఉన్నాయి. వాటిని టికెట్‌ కోసం కండక్టరుకి ముట్టజెప్పడం అతడికి ఇష్టం లేదు.

‘‘సర్‌! ఎక్కడికి?’’
‘‘దెహీ వెలా..’’ టికెట్‌ తియ్యక తప్పలేదు. ఆమె దిగబోయిన స్టాప్‌ కంటే ఒక స్టాప్‌ ముందరే దిగడానికి వీలుగా టికెట్‌ తీసుకున్నాడు. రెండోది అతని వద్ద అందుకు సరిపడా రెండు రూపాయాలే ఉన్నాయి.బ్యాగ్‌ని ఎంత వేగంగా కొట్టేస్తే అంత వేగంగా దిగిపోవాలి. త్వరగానే పని పూర్తి చెయ్యాలి.అతడు కండక్టరుకు నాణెం ఆమె చేతి కింద నుంచి అందజేశాడు. ఆ క్రమంలో శరీరాన్ని స్పృశించి ఒక మెత్తని అనుభూతిని పొందాడు. ఆ రద్దీలో ఆమె పట్టించుకోలేదు. దూరంగా జరిగే ప్రయత్నమూ చెయ్యలేదు. దాంతో అతడు తన చేతిని మరికొంతసేపు అలాగే ఉంచి ఆనందించాలనుకున్నాడు. కాని ఉంచలేదు. తీసేశాడు. ఆమెతో పాటు బస్సెక్కిన లక్ష్యం అది కానే కాదు. 

ఆ రద్దీలో కూడా బహుశ ఆమెకు పరిచయస్తులెవరో అడిగారు: ‘ఏం చేస్తున్నావమ్మా!’
‘‘దెహీవెరాలో ఒక షాపులో పనిచేస్తున్నాను’’ చెప్పింది.
ఆమె తన నాణేల పర్సును తిరిగి హ్యాండ్‌బ్యాగులో పెట్టుకుంది. ఆమె శరీరం మీంచి మత్తెక్కించే పరిమళం వస్తోంది. అంటే బ్యాగులో కూడా మంచి మొత్తమే ఉండవచ్చని నమ్మకం కలిగింది. ఆమె నోరు చిన్నదిగా ఉంది. కాని అనర్గళంగా ఇంగ్లిష్‌ మాట్లాడగలదని ఊహించాడు.దెహీవెలా వరకు టికెట్‌ తీసుకున్నాడు. ఈలోగానే ఆ షాపమ్మాయి బ్యాగ్‌ కొట్టెయ్యాలి. ఒక కొత్త బ్లేడుని చొక్కా జేబులోంచి తీశాడు. తన తొడని ఆమె తుంటిభాగానికి నొక్కి పట్టాడు. బ్యాగ్‌ని ఒక పక్కగా కత్తిరించాడు. సరిగ్గా ఆ సమయంలో యాదృచ్ఛికంగానే ప్రయాణికుల చూపులన్నీ కిటికీలోంచి బయటికే ప్రసరిస్తున్నాయి. కుడిచేతిలోని ఇంగ్లిష్‌ వార్తాపత్రికని పైకి తీసి రెండు వేళ్ల మధ్య పెట్టుకున్నాడు. మిగిలిన మూడు వేళ్లనీ బ్యాగులోకి చొప్పించాడు. ఈ దశలో ఎవరైనా అటువైపు చూసినా వార్తాపత్రిక మాత్రమే కనబడుతుంది. 

మొదటగా అతడి వేళ్లకి మూత తెరిచి ఉన్న ప్లాస్టిక్‌ పెట్టె దొరికింది. అది ఆమె లంచ్‌ బాక్స్‌ కావచ్చు. అందులోనే చిన్న స్పూనూ, ఫోర్కు తగిలాయి. పోట్లాటకు దిగిన కోడి తన పెట్టని వెంబడిస్తున్నట్టు అతడి వేళ్లు బ్యాగులోనే పర్సు కోసం తడుముతున్నాయి. బస్సు వెల్లాలెట్టీ బ్రిడ్జి పైనుంచి పోతుండగా అతడి పని పూర్తయింది. ఆ రద్దీలో ఆ షాపమ్మాయిని ఆనుకుని నిల్చున్న ఆనందాన్ని అనుభవిస్తూ దెహీవెలా వరకు ప్రయాణించవచ్చు. కాని అతడి ధ్యేయం అది కాదు. ఆ తర్వాత స్టాప్‌లోనే చల్లగా దిగిపోయాడు. ఆమె మనీ పర్సు అతడి జేబులో సురక్షితంగా ఉంది. సన్నగా ఈల వేసుకుంటూ ఉత్సాహంగా ముందుకు నడిచాడు.

జేబులో షాపమ్మాయి పర్సు ఉంది. వెల్లావెట్టీలో మాదకద్రవ్యాల వ్యాపారులందరి పేర్లూ ఒకదాని తర్వాత ఒకటిగా అతడి మెదడులో తిరగసాగాయి. వాటి మధ్యలో హఠాత్తుగా పద్మావతి అన్న పేరు కూడా ప్రత్యక్షమైంది. ‘పద్మావతి!’ ఎంత చక్కని పేరు!! కొద్దిరోజుల కిందట ఇలాగే ఒక దొంగతనం చేశాడు.

ఆ రోజు ఆమె పర్సులో పదమూడువందల రూపాయలు దొరికాయి. ‘ఇలాంటి అదృష్టం సాధారణంగా రాదు’ అనుకున్నాడు.  అంతేకాదు, ఆమె గురించి సమాచారం దొరికింది. చిరునామా దొరికింది. ‘‘పద్మావతి! షైనింగ్‌ స్టార్‌ గార్మెంట్‌ ఫ్యాక్టరీ, గాలే రోడ్, రత్మలానా’’. అంతేకాదు, ఆమె హరిబన్‌ తోటకు చెందింది. పద్మావతి చెల్లెలు ఒక ఉత్తరం అక్కకు రాసి ఉంది. అదింకా అతడి జేబులోనే ఉంది. దాని మీదనే ఈ చిరునామా ఉంది. ఆ ఉత్తరంలో చెల్లెలు అక్క పద్మావతిని డబ్బు పంపమని కాబోలు కోరింది. అయితే ఆ పదమూడువందలతో ఆ రోజు జల్సా చేశాడు. మంచి భోజనం చేశాడు. హెరాయిన్‌ కొనుక్కుని నిల్వ చేసుకున్నాడు. డబ్బు ఖర్చయిపోయింది గాని, ఆనాటి పర్సు, ఆ ఉత్తరం అతడి వద్ద మిగిలే ఉన్నాయి. 

ఆ రోజు పద్మావతి గార్మెంట్‌ ఫ్యాక్టరీ పిట్ట. ఈ రోజు ఈ అమ్మాయి షాపు పిట్ట. నిజానికి ఈ షాపమ్మాయి మంచి కుటుంబం నుంచే వచ్చినట్టుంది. పర్సు నుంచి కూడా సువాసనలు వస్తున్నాయి. డబ్బు బాగా ఎక్కువగానే ఉండొచ్చు. దాన్ని తెరిచి చూడాలనే కుతూహలం ఎక్కువవుతోంది. రోడ్డు జనంతో కిటకిటలాడుతోంది. పర్స్‌ పైకి తీసి చూడాలనే కోరికను ఆపుకున్నాడు. గాలే రోడ్డు దాటి బీచ్‌కు దారితీసే చిన్న సందులోనికి ప్రవేశించాడు. పర్స్‌ తెరిచాడు. చిన్న పెర్‌ఫ్యూమ్‌ బాటిల్‌ దొరికింది. అది అమ్మకానికి పనికిరాదు. పోనీ ఉపయోగించడానికి అది ఆడ పెర్‌ఫ్యూమ్‌. ప్యాంటు ఎడమ జేబులో పెట్టుకున్నాడు. మరో చిన్న పెట్టె దొరికింది. అది కనుబొమల మేకప్‌ పెట్టె. దాన్నీ ఎడమ జేబులోనే పెట్టుకున్నాడు. మరి డబ్బు కోసం తడిమాడు. ఒక్క రూపాయి నాణెం మాత్రమే దొరికింది. ఛస్‌ ఈ రోజు బాగాలేదు. ఒక కాగితం కూడా దొరికింది. తెరిచి చూశాడు. అది ఆమెరికన్‌ పాప్‌ సింగర్‌ ప్రసిద్ధ గీతం: ‘‘ది లవర్స్‌ ప్యారడైజ్‌’’ పర్స్‌తో పాటు పనికిరానివన్నీ మురికి కాలువలో పారెయ్యాలనుకున్నాడు. ఎందుకో ఆ షాపమ్మాయి అందమైన రూపం ఆమెని తాకిన అనుభూతి గుర్తు వచ్చి ఆగాడు. డబ్బు దొరక్కపోయినా ఇవన్నీ ఆమె జ్ఞాపకాన్ని మిగులుస్తాయి. డబ్బుపరంగా ఈ రోజు నష్టమే. వృథా ప్రయత్నం. 

ఆ రోజు పద్మావతి పర్సు దొరికిన రోజు ఎంతో అదృష్టం.హఠాత్తుగా గత జీవితాన్ని బాల్యం నుంచి ఒకసారి పునరావలోకనం చేసుకోవాలనే బలమైన కోరిక అతడి మెదడులో తొలచివేస్తోంది. ఆ స్థితిలోనే అతడు బీచ్‌ని చేరుకున్నాడు. కొలంబో బీచ్‌ ప్రపంచంలోనే అతి సుందరమైనది. తీరం వెంబడి పాలవంటి మృదువైన తరంగాలు వచ్చి విస్తరించి వెనక్కి తిరిగిపోతున్నాయి. ఆ సరికే సూర్యుడు అస్తమించాడు. చల్లని చిరుగాలి తనతో పాటు సూక్ష్మమైన నీటి బిందువుల్ని మోసుకొస్తోంది. ఉదయం నుంచి నగరపు ఉష్ణోగ్రతలో ఉక్కిరిబిక్కిరి అయిన అతడి శరీరం ఒక సౌఖ్యాన్నీ సాంత్వననీ పొందింది. ఆ క్షణంలో ఒక్క హెరాయిన్‌ గుక్క కూడా లేని కష్టాన్ని మరచిపోయాడు.అతడు చదువుకునే రోజుల్లో ఒక ప్రసిద్ధ స్కూల్‌ క్రికెట్‌ టీములో కెప్టెన్‌గా ఉండేవాడు. ఉపాధ్యాయులూ సహచరులూ అతణ్ణి అభిమానించేవారు. నిత్యమూ మిత్రులతో సంతోషంగా సంచరించేవాడు. కాని పరీక్ష తప్పాడు. చెడు స్నేహాలు మరిగి పుస్తకాలు పట్టుకోకపోవడమే కారణం.వ్యసనాల వల్ల ఇప్పుడు సంఘవ్యతిరేక శక్తిగా మారిపోయాడు. తన ముఖం సభ్య సమాజానికి చూపనేలేడు.

అతని తండ్రి ప్రభుత్వోద్యోగిగా ఉండేవాడు. ఒక సమ్మెలో పాల్గొన్నందున ఉద్యోగం పోయింది. ఇప్పుడు పాత కార్ల కంపెనీలో ఒక చిరుద్యోగిగా చేరాడు.అతడు కుటుంబానికీ నిష్ప్రయోజకుడైపోయాడు.అతడి తల్లి సంసారాన్ని నెట్టుకు రావడానికి పెళ్లిళ్లకు పుట్టినరోజులకు కేకులు చేసుకుంటూ తృణమో పణమో సంపాదిస్తోంది.అతడు సంపాదనలేక బలాదూరుగా తిరుగుతూ దొంగతనాలు చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నాడు.
అతని చెల్లెలు కొలంబోలోని ఒక మంచి బడిలో చదివేది. కాని కుటుంబ పరిస్థితుల వల్లల పరీక్ష తప్పింది. ఇప్పుడు ఒక షాపులో సేల్స్‌గర్ల్‌గా చేరింది. కుటుంబ పోషణలో పాలు పంచుకుంటోంది. 

అతడి వల్ల కుటుంబానికి నష్టమే కాని లాభం లేదు. పొరపాట్న ఇంటికి వెళ్తే విలువైన వస్తువులన్నీ దాచుకుంటున్నారు. ‘ఛీ! నాదీ ఒక బతుకేనా?’ తీరంలో పెద్ద గ్రానైట్‌ రాతి అంచున కూర్చున్నాడు. ఈరోజు తన బాధితురాలైన యువతిని మరచిపోలేకపోతున్నాడు. దొంగతనం చేసిన ఆమె పెర్‌ఫ్యూమ్‌ బాటిల్, మేకప్‌ పెట్టె, ఆ కాగితం మీది ఇంగ్లిష్‌ పాటలోని మాటలూ అతణ్ణి వెంటాడుతున్నాయి. ఖాళీ పర్సూ, టిఫిన్‌ బాక్సులోని స్పూనూ ఫోర్కూ.. వీటినే తిప్పి తిరగేస్తున్నాడు.

‘ఛీ! నాదీ ఒక జీవితమేనా?’ ఆరోజు పద్మావతి పర్సులో హృదయవిదారకమైన ఉత్తరం దొరికినప్పటికీ అది అతణ్ణి కదిలించలేకపోయింది. దాన్ని పట్టించుకోనే లేదు. ఆమె పట్ల కాస్తంత జాలి కూడా కలగలేదు. కాని ఈ రోజు అంతా నేరమే అనిపిస్తోంది.ఇప్పుడతనికి తన చెల్లెలి ముఖం గుర్తు వచ్చింది. ఆమె కూడా ఒక షాపులో పని చేస్తోంది. ఆమె ఆకృతి తరంగాలపైన తేలి తన వైపే వస్తున్నట్లుంది. సాధారణంగా అతడు తన ఇంటి గురించి, అక్కడి వాతావరణం గురించి, కుటుంబ సభ్యుల గురించి ఆలోచించడు. ఏదైనా దొంగిలించాలంటేనే ఇల్లు గుర్తు వస్తుంది. తన తల్లి అష్టకష్టాలూ పడి పొదుపు చేసి చెల్లెలి కోసం కొన్న బంగారు నెక్లెస్‌ దొంగిలించిన వైనం అతడికి గుర్తు వచ్చింది. చెప్పలేని విషాదం ఆవరించింది. కాని ఒక గుక్క హెరాయిన్‌ కోసం తల్లడిల్లిపోతూ మరి గత్యంతరం లేక ఆ పని చేశాడు.అప్పటి నుంచి అందరూ చీదరించుకుంటున్నారు.
ఈరోజు ఇంటి గురించి తలంపులు వరుసగా గుచ్చి గుచ్చి వేధిస్తున్నాయి. హెరాయిన్‌ కోసం కూడా తాపంగా ఉంది. అయినా ఈ రోజు షాపమ్మాయి, తన చెల్లెలు ఏకకాలంలో ఆలోచనలలోకి చొచ్చుకొస్తున్నారు. ఈ స్థితి అతనికి అర్థంకావడం లేదు.

ఇప్పుడు అతనిలో ఏదో అయింది. మెదడులో ఒక తేనెతుట్టె కదిలింది. హృదయంలో ఏదో చెదిరింది.నిజానికి ఈ రోజు కొట్టేసింది ఒక్క రూపాయే. పద్మావతికి కలిగిన నష్టం పదమూడువందలతో పోలిస్తే ఇది ఏమీ కాదు. కాని ఈ షాపమ్మాయికీ అతడి చెల్లెలికీ మధ్య పోలికలు అతనికిప్పుడు స్ఫురిస్తున్నాయి. మనసు వికలమైపోతోంది.ఇంకా జేబులోనే దాచుకున్న పద్మావతి ఉత్తరాన్ని మరోసారి చదవాలనిపించింది. చేతిలో ఉన్న వాటిని రాతి మీద పెట్టి ఆ ఉత్తరాన్ని పైకి తీశాడు. 

‘‘ప్రియమైన అక్కా!
నిన్ను ఇబ్బంది పెడుతున్నందుకు ఏమీ అనుకోవద్దు. తల్లిదండ్రులు లేకపోవడమంటే ఏమిటో ఇప్పుడు తెలుస్తోంది. అయినా నువ్వు మమ్మల్ని అంతకన్నా ఎక్కువగా చూసుకుంటున్నావు. అక్కా! మా పరీక్షలు వచ్చే నెలలో జరగబోతున్నాయి. నా బడి యూనిఫామ్‌లన్నీ ఒక్కసారే చిరుగుపట్టాయి. రోజూ బడికి వెళ్లి రావడానికీ డబ్బు చేతిలో లేదు. చదువుకోవడానికే కాలం సరిపోవడం లేదు. కొబ్బరి కమ్మలు అల్లి వాటిని అమ్మి డబ్బు సంపాదించే అవకాశమూ లేదు. ఈ స్థితిలో అక్కా! నువ్వే నా ధైర్యం.. నువ్వే నా బలం. దయచేసి కొంత డబ్బు.. వీలైనంత త్వరగా..’’ అతడికి సంబంధించినంత వరకు ఈ ఉత్తరంలోని అంశం అర్థంలేనిదీ అప్రస్తుతమైనదీ! కాని అప్పుడే అక్కడే చించిపారెయ్యకుండా ఎందుకు అట్టేపెట్టుకుని తిరుగుతున్నాడో అతడికే తెలీదు.

ఆ ఉత్తరాన్ని బట్టి పద్మావతికి తల్లీ తండ్రీ లేరని తెలుస్తోంది. ఒక చెల్లి ఉంది. ఇంకా అన్నదమ్ములు ఉన్నారేమో తెలీదు. వారి ఆర్థిక పరిస్థితీ అవగతమవుతోంది. ఆమె ఆ డబ్బు తన చెల్లెలికి పంపడానికి ఉంచుకున్నది కాబోలు. అది ఆమె నెల జీతం కూడా కావచ్చు. ఆ మొత్తాన్ని తను దొంగిలించాడు.తనూ పరీక్ష తప్పాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల తన చెల్లీ పరీక్ష తప్పింది. ఇప్పుడు పద్మావతి చెల్లెలు కూడా సరిగ్గా చదవలేక పరీక్ష తప్పితే? అందుకు తనే బాధ్యుడవుతాడు. తన దొంగతనమూ, తన వ్యసనాలూ కారణమవుతాయి. వారి నాశనానికి తనే పునాది వేసినవాడవుతాడు.ఇంతకుముందు ఆ ఉత్తరాన్ని మనసుపెట్టి చదవలేదు. ఇప్పుడు విషయం అర్థమైంది. ఇక చేసేదేముంది? చెదిరిపోయిన మనసుతో, చేతగాని అనుభూతితో ఆ ఉత్తరాన్ని చిన్న చిన్న ముక్కలుగా చించేశాడు. అతడి గుండె కూడా శకలాల పర్యంతమైంది. అనంతమైన మహాసముద్రం వైపు చూస్తూ కూర్చున్నాడు. చేతిలోని ఉత్తరం ముక్కల్ని సముద్రంలోకి విసిరేశాడు.

సముద్రం మీద నుంచి నేల మీదకు బలంగా వీస్తున్న గాలి ఆ ముక్కల్ని తిరిగి అతని వైపే తెచ్చింది. కొన్ని అతనికే అంటుకున్నాయి. ఎక్కువభాగం సుదూరంగా ఎగిరిపోయాయి. అతడి ఆలోచనలూ ఆవిరైపోయాయి. ఎన్నడూ లేనిది అతడి మనస్సు మాదకద్రవ్యం లేకుండానే కుంగిపోయింది. తన మీద తనకే అసహ్యం వేసింది. ‘కుటుంబాన్ని మోసం చేస్తున్నాను. దొంగతనాలు చేసి ఎన్నో జీవితాలను నాశనం చేస్తున్నాను. ఇలా ఎంతకాలం? ఎందుకోసం? చివరికి ఏమవుతాను?’ ఇటువంటి అంతర్మథనం అతనిలో చోటుచేసుకుంది. 

ఉత్తరాన్ని తీసేసిన పద్మావతి పర్సును ఇందాక రాతి మీద ఉంచాడు. ఇప్పుడు దాన్ని మళ్లీ పైకి తీశాడు. తన జీవితంలో చేసిన ఘోరాలన్నింటిలోకీ అతి క్రూరమైన అత్యంత హేయమైన నేరానికి సాక్ష్యంగా ఈ పర్సు చేతిలోనే ఉంది. అది ఇప్పుడు నిప్పుల కుంపటి పట్టుకున్నట్లుంది.గడచిన జీవితం వద్దనుకున్నా కళ్ల ముందు కరాళ నాట్యం చేస్తోంది. ‘అయిన వాళ్లకి దూరమయ్యాను. ప్రియురాలికి అప్రియుడనయ్యాను. మంచి మిత్రులకీ శత్రువునయ్యాను. అందరి అభిమానాన్నీ పోగొట్టుకున్నాను. ఇక మిగిలిందేముంది? సాధించేదేముంది? ఎవరికోసం? దేని కోసం?.. నాకిక నిష్కృతి లేదు’ హెరాయిన్‌ తీసుకోకుండానే ఒక్కసారిగా కన్నీళ్లు పెల్లుబికి వచ్చాయి.

అతడి మెదడులో ఒక తీవ్రమైన రసాయనిక చర్య మొదలైంది. అలాగే స్థాణువులా చలనం లేకుండా నిల్చుండిపోయాడు. చూస్తుండగానే గాఢాంధకారం మహాసముద్రాన్ని కబళించేస్తోంది. మరోవైపు చంద్రుడు తన చల్లనికాంతితో చీకటిపై సమరానికి సమాయత్తమవుతున్నాడు. జేబులో షాపమ్మాయి పర్సు ఉంది. వెల్లావెట్టీలో మాదకద్రవ్యాల వ్యాపారులందరి పేర్లూ ఒకదాని తర్వాత ఒకటిగా అతడి మెదడులో తిరగసాగాయి. 
వాటి మధ్యలో హఠాత్తుగా పద్మావతి అన్న పేరు కూడా ప్రత్యక్షమైంది.‘పద్మావతి!’ ఎంత చక్కని పేరు!! తీరంలో పెద్ద గ్రానైట్‌ రాతి అంచున కూర్చున్నాడు. ఈరోజు తన బాధితురాలైన యువతిని మరచిపోలేకపోతున్నాడు. దొంగతనం చేసిన ఆమె పెర్‌ఫ్యూమ్‌ బాటిల్, మేకప్‌ పెట్టె, ఆ కాగితం మీది ఇంగ్లిష్‌ పాటలోని మాటలూ అతణ్ణి వెంటాడుతున్నాయి. 

సింహళ మూలం : లియనగే అమరకీర్తి
అనువాదం : టి షణ్ముఖరావు

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సంతోషం నీలోనే ఉంది

శంకరగీత

అద్దెకొంప

ప్రమాదంలో పుడమి కవచం

మంత్రి యుక్తి

ఆ సమయంలో ఇవి చేయకూడదా?

తిక్క కుదిరింది

సరైన ప్రాయశ్చిత్తం

బండలు

తేనెపట్టులా నీ పలుకే..

పరలోకాన్ని దూరం చేసిన ‘అనుమానం’!!

విశ్వానికి ఆదిశిల్పి పుట్టిన రోజు

నన్ను పదకొండో కొడుకుగా చూసుకో...

పాపాయికి చెవులు కుట్టిస్తున్నారా?

ఆరోగ్య కారకం

ఓనమ్‌ వచ్చెను చూడు

డిస్నీ బ్యూటీ

తల్లి హక్కు

దాని అంతు నేను చూస్తాను

పాఠాల పడవ

జయము జయము

ఫైబ్రాయిడ్స్‌ తిరగబెట్టకుండా నయం చేయవచ్చా?

పెద్దలకూ పరీక్షలు

పావనం

పగుళ్లకు కాంప్లిమెంట్స్‌

నేను సాదియా... కైరాళీ టీవీ

డౌట్‌ ఉంటే చెప్పేస్తుంది

ఇడ్లీ.. పూరీ... మరియు భర్త

ఫ్రెండ్స్‌కి ఈ విషయం చెబితే ‘మరీ, విలనా!’ అన్నారు.

కొండలెక్కే చిన్నోడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మాకు పది లక్షల విరాళం

ఇక మా సినిమా మాట్లాడుతుంది

నలభయ్యేళ్ల తర్వాత వేదిక పంచుకున్నాం

నిజమైన హీరోలకు ఇచ్చే గౌరవమే ‘బందోబస్త్‌’

సైరా కెమెరా

పండగకి వస్తున్నాం